హైదరాబాద్: మార్చి 24వ తేదీ నుంచి కనిపించకుండా పోయిన పర్వతారోహకుడు మల్లి మస్తాన్‌బాబు మృతిచెందినట్లు అధికారులు ధ్రువీకరించారు. పర్వతారోహ...
హైదరాబాద్: మార్చి 24వ తేదీ నుంచి కనిపించకుండా పోయిన పర్వతారోహకుడు మల్లి మస్తాన్‌బాబు మృతిచెందినట్లు అధికారులు ధ్రువీకరించారు. పర్వతారోహణ నిమిత్తం చిలీ దేశంలోని యాండీస్ పర్వతరోహణ చేస్తున్నప్పుడు అతనితో సమాచార సంబంధాల తెగిపోయాయి. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా గాంధీ జనసంఘం గ్రామానికి చెందిన మస్తాన్‌బాబు చివరగా మార్చి 21న కుటుంబ సభ్యులతో మాట్లాడారు. మార్చి 24 నుంచి ఆయన ఆచూకీ తెలియకపోవడంతో ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. సుమారు 5వేల అడుగుల ఎత్తులో చిలీ పర్వతశ్రేణిలో మస్తాన్‌బాబు మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. ఆయన పర్వతారోహణ పూర్తిచేసుకొని తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురై మృతి చెంది ఉండవచ్చని భావిస్తున్నారు.గిన్నీస్‌బుక్‌లో స్థానం..మస్తాన్‌బాబు పర్వతారోహణలో ఎన్నో విజయాలు, రికార్డులు సొంతం చేసుకున్నారు. ఎవరెస్టు శిఖరం ఎక్కిన మొదటి ఆంధ్రప్రదేశ్ వ్యక్తిగా రికార్డును తన పేరన రాసుకున్నారు. 2006లో 172 రోజులలో ఏడు సమ్మిట్స్‌కు పర్వతారోహణ చేసి మస్తాన్‌బాబు గిన్నీస్‌బుక్‌లో స్థానం సంపాదించుకున్నారు. అత్యంత వేగంగా పర్వతారోహణ చేస్తూ ఏడు సమ్మిట్స్ను చేరుకున్న వ్యక్తిగా పేరుగాంచారు. అంటార్కిటికాలోని అత్యంత ఎత్త్తెన పర్వతమైన మౌంట్ విన్సన్ మాసిఫ్ను అధిరోహించిన మొదటి భారతీయుడు మస్తాన్‌బాబు. అర్జెంటీనాలోని అకోన్కాగువా అనే 6,962 మీటర్ల ఎత్త్తెన పర్వతాన్ని మూడు సార్లు అధిరోహించారు. హిమాలయాలు కాకుండా బయట ఉన్న ఎత్త్తెన పర్వతం ఇది. మస్తాన్‌బాబు పెరూలోని హువాస్కారన్(6,768మీటర్లు) పర్వతం, బొలీవియాలోని సాజమా(6,542మీటర్లు) పర్వతం, ఈక్విడార్‌లోని చింబోరజో(6,310మీటర్లు) పర్వతం, చిలీలోని ఓజోస్ డెల్ సలాడో(6,800మీటర్లు) పర్వతాలను అధిరోహించారు. ఇప్పటివరకు ఏ భారతీయుడు ప్రపంచంలో ఇన్ని ప్రాంతాల్లో పర్వతారోహణ చేయలేదు.వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి..మస్తాన్‌బాబు స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో సంగం మండలానికి చెందిన గాంధీ జనసంఘం గ్రామం. ఆయన వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు. మస్తాన్‌బాబు ఐఐఎం కోల్‌కతా, ఐఐటీ ఖరగ్‌పూర్, ఎన్ఐటీ జంషెడ్పూర్, కోరుకొండ సైనిక్ స్కూల్ పూర్వ విద్యార్థి.గాలింపు చర్యలపై ఫేస్బుక్ పేజీమస్తాన్బాబు కనిపించకుండా పోయినప్పటి నుంచి స్నేహితులు 'రెస్క్యూ మల్లి మస్తాన్‌బాబు' పేరుతో ఫేస్బుక్ పేజీ రూపొందించారు. మస్తాన్ మరణించిన విషయం తెలియగానే 'మౌంటెయిన్ రిటైన్డ్ ఇట్స్ ఫేవరెట్ చైల్డ్' అని పోస్ట్ చేశారు. మస్తాన్ సోదరి దొరసానమ్మ ప్రస్తుతం అర్జెంటీనాలోనే ఉన్నారు. మస్తాన్‌బాబు తప్పిపోగానే యాండీస్ పర్వతాల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. మస్తాన్ స్నేహితులు ప్రత్యేకంగా హెలికాప్టర్ ఏర్పాటు చేసి ఆరు వేల మీటర్ల ఎత్తు వరకు అన్వేషించారు. ప్రత్యేక బృందం కాలినడకన కూడా గాలించారు. సజీవంగా తిరిగి రావాలని ఆశతో గాలించిన స్నేహితులకు నిరాశే మిగిలింది. పర్వతారోహణలో ఎన్నో విజయాలు సాధించిన మస్తాన్‌బాబు అదే పర్వతారోహణలో తుది శ్వాస విడవడం ఎంతో విషాదాన్ని మిగిల్చింది. దీంతో కుటుంబసభ్యలు, స్నేహితులు విషాద సాగరంలో మునిగిపోయారు.మస్తాన్‌బాబు కుటుంబానికి పలువురి పరామర్శసంగం: మస్తాన్‌బాబు మృతి చెందిన నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులను పలువురు రాజకీయ ప్రముఖులు పరామర్శించారు. ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్మన్ రాఘవేంద్రరెడ్డి తదితరులు మస్తాన్‌బాబు తల్లి సుబ్బమ్మను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
