(15 Apr) హైదరాబాద్, ఏప్రిల్ 14: రెండు తెలుగురాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నగరానికి ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది. ఇప్పటికే అకాల వర్...
(15 Apr) హైదరాబాద్, ఏప్రిల్ 14: రెండు తెలుగురాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నగరానికి ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది. ఇప్పటికే అకాల వర్షంతో నగరం అతలాకుతలమవుతుండగా, తాజాగా బర్డ్‌ఫ్లూ వైరస్ రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో వెలుగుచూడటంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. జంటనగరవాసులను బర్డ్‌ఫ్లూ భయం వెంటాడుతోంది. వైరస్ ఉన్నట్లు పూణెలోని వైద్య నిపుణులు నిర్థారించటంతో చికెన్ కొనుగోలు చేసేందుకు నగరవాసులు జంకుతున్నారు. ప్రస్తుతం నగరంలోని చికెన్ మార్కెట్ ప్రకారం కిలో స్కిన్లెస్ చికెన్ రూ. 135 పలుకుతుండగా, బోన్‌లెస్ చికెన్ రూ. 260వరకు కిలో ధర పలుకుతోంది. అయితే రంగారెడ్డి జిల్లాలో బర్డ్‌ఫ్లూ వైరస్‌ను నిర్థారించటంతో పాటు త్వరలోనే పూణె నుంచి రానున్న ప్రత్యేక వైద్యుల బృందం వైరస్ వెలుగుచూసిన హయత్‌నగర్‌కు చుట్టూ కిలోమీటరు పరిధిలోని అన్ని కోళ్ల పరిశ్రమలను సందర్శించి, కోళ్లకు తగిన పరీక్షలు చేయనున్నారు. బర్డ్‌ఫ్లూ వైరస్ ఉన్నా, లేకపోయినా ముందుజాగ్రత్త చర్యగా ప్రస్తుతం హయత్‌నగర్‌కు కిలోమీటరు పరిధిలోనున్న అన్ని కోళ్ల పరిశ్రమలోని కోళ్లను పూడ్చివేయాలని సూచించటంతో ఆరోగ్యపరంగా ప్రజలు, వ్యాపార పరంగా చికెన్ హోల్‌సెల్ వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఎలాగో వేసవి కాలం విక్రయాలు తగ్గటంతో ధర పడిపోతుందని భావించామే తప్ప, ఈ బర్డ్‌ఫ్లూ వ్యాప్తి చెందితే తమ వ్యాపారాలు మూసివేసుకోవల్సిందేనని మరికొందరు వాపోతున్నారు. కొద్దిరోజుల క్రితం వరకు కిలోకు రూ. 150 నుంచి రూ. 160 మధ్యనున్న స్కిన్లెస్ చికెన్ ధర అకాల వర్షాల కారణంగా రూ. 130 నుంచి రూ. 140 కి పడిపోయిందని, ఇపుడు బర్డ్ ఫ్లూ వైరస్ వెలుగుచూడటంతో మున్ముందు తమ వ్యాపారాలు మరింత దివాలా తీసే అవకాశాలున్నాయని చికెన్ వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా సరిగ్గా దశాబ్ద కాలం క్రితం బర్డ్ ఫ్లూ నగరంలో స్వైరవిహారం చేసింది. అప్పట్లో తీవ్ర ఆందోళనకు గురైన కోళ్ల పరిశ్రమ యజమానులు కోళ్లను చంపి, పాతేశారు. బర్డ్ ఫ్లూ వ్యాధి సోకిందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని నమ్మించేందుకు కొందరు హోటల్ యజమానులు రోజుల తరబడి ప్రజలకు చికెన్ వంటకాలను ఉచితంగా పంపిణీ చేసినా తినే నాథుడే కరవయ్యాడు. ఇపుడు కూడా అదే పరిస్థితి ఎదురౌతుందా? లేక వైరస్ రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌కే పరిమితమయ్యేలా వైద్య నిపుణులు చర్యలు తీసుకుంటారా? వేచి చూడాలి!