-64వేల పైచిలుకుకు చేరనున్న కార్మికుల సంఖ్య -ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కృషితోనే కొత్తకళ గోదావరిఖని : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల...
-64వేల పైచిలుకుకు చేరనున్న కార్మికుల సంఖ్య
-ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కృషితోనే కొత్తకళ
గోదావరిఖని : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని సింగరేణి సంస్థలో ఈ ఏడాది కార్మికుల సంఖ్య భారీగా పెరగనుంది. గడిచిన 15 ఏండ్లుగా గణనీయంగా తగ్గుతూ వస్తున్న కార్మికుల సంఖ్య తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా పెరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణిపై ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో కొత్త ఉద్యోగాలకు తోడు డిపెండెంట్లకు ఉద్యోగాలు లభిస్తున్నాయి. రిక్రూట్మెంట్లతోపాటు మెడికల్ అన్‌ఫిట్, చనిపోయిన కార్మికుల పిల్లలకు డిపెండెంట్ ఉద్యోగాలు భారీగా ఇస్తున్న క్రమంలో కార్మికుల సంఖ్య పెరగనుంది. 2014-15 మార్చి 31కి సింగరేణిలో 58,837 మంది కార్మికులు ఉన్నట్లు యాజమాన్యం ప్రకటించింది. 2015-16 ముగిసే నాటికే సంస్థలో కార్మికుల సంఖ్య 64వేల పైచిలుకుకు పెరుగుతుందని యాజమాన్యం పేర్కొంటుంది.
ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఐదు వేల మందికి పైగా కొత్త ఉద్యోగులు చేరనున్నారు. చాలాకాలంగా వేచిచూస్తున్న డిపెండెంట్లు 2,744 మందికి యాజమాన్యం ఉద్యోగాలు కల్పించనున్నది. కొత్తగా ఇప్పటికే ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు జారీ చేసిన యాజమాన్యం 2,229మందిని తీసుకోవాలని నిర్ణయించింది. అంతర్గతంగా మరో 539మంది కార్మికులకు వివిధ ట్రేడ్స్‌లో పరీక్షలు నిర్వహించి అర్హులైన వారికి పదోన్నతులు కల్పించనుంది. భారీగా మెడికల్ అన్ఫిట్స్ కోసం వేచిచూస్తున్న క్రమంలో ఈ ప్రక్రియ ద్వారా పెద్ద సంఖ్యలో కార్మికులు రిక్రూట్మెంట్ జరిగే అవకాశముంది. సింగరేణిలో డిస్మిస్ కార్మికులు, వీఆర్ఎస్ డిపెండెంట్లకు సంబంధించి ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే కార్మికుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముంది.
సీమాంధ్ర పాలనలో వివక్ష:
గతంలో సీమాంధ్ర పాలకుల హయాంలో సింగరేణి పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాత్రం సింగరేణిలో కొత్త ఉద్యోగాలు, కొత్త ప్రాజెక్టుల ఏర్పాటు, సింగరేణి విస్తరించడం లాంటి కార్యక్రమాలు వేగవంతమవుతున్నాయి. సింగరేణిలో గడిచిన పదేండ్లలో కార్మికుల సంఖ్య భారీగా తగ్గింది. 2005-06సింగరేణిలో 86,025 మంది కార్మికులుండగా, 2014-15 నాటికి కార్మికుల సంఖ్య 58,837కు తగ్గింది. పదేండ్లలోనే కార్మికుల సంఖ్య 27,188 తగ్గిపోయింది. ప్రతిఏటా రిటైరైన కార్మికుల స్థానాల్లో కొత్త ఉద్యోగాలు కల్పించకపోవడం, నూతన రిక్రూట్మెంట్లు చేయకపోవడం వల్ల కార్మికుల సంఖ్య తగ్గుతూ వస్తున్నది. 2005-06లో కార్మికుల సంఖ్య 86,025గా ఉండగా, 2006-07లో 82,224కు, 2007-08లో 75,573కు, 2008-09లో 70,586కు, 2009-10లో 69,043కు, 2010-11లో 67,615కు, 2011-12లో 66,466కు, 2012-13లో 64,600కు, 2013-14లో 61,778కు , 2014-15లో 58,837కు తగ్గిపోయింది. ప్రతిఏటా రెండు వేల నుంచి నాలుగు వేల వరకు కార్మికుల సంఖ్య తగ్గింది.
Key Tags
Singareni , KCR , Telangana , Medical unphits
