(4 Apr) హైదరాబాద్: శనివారం (నేడు) దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్ పరీక్ష జరగనుంది. జేఈఈ మెయిన్స్ రాత పరీక్షలో వచ్చిన ర్యాంకుల ఆధారంగా ఎన్...
(4 Apr) హైదరాబాద్: శనివారం (నేడు) దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్ పరీక్ష జరగనుంది. జేఈఈ మెయిన్స్ రాత పరీక్షలో వచ్చిన ర్యాంకుల ఆధారంగా ఎన్ఐటీల్లో నేరుగా ప్రవేశాలు కల్పిస్తారు. ఐఐటీల్లో ప్రవేశాలకుద్దేశించిన అడ్వాన్స్ పరీక్ష రాయటానికి కూడా ఇదే అర్హత పరీక్ష! ఈపరీక్ష తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, ఖమ్మం కేంద్రాల్లో...ఆంధ్రలో- గుంటూరు, తిరుపతిల్లో పరీక్ష నిర్వహిస్తారు. బీటెక్‌కు ఉదయం, బీఆర్క్‌కు మధ్యాహ్నం పరీక్ష జరుగుతుంది. ఆన్లైన్లో పరీక్ష...ఈనెల 10, 11 తేదీల్లో నిర్వహిస్తారు. ర్యాంకుల ఖరారులో ఇంటర్ మార్కులకు 40శాతం వెయిటేజీపై కేంద్రం (సీబీఎస్ఈ) గురువారం స్పష్టతనివ్వడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పన్నెండో తరగతి.. తత్సమాన పరీక్షలో మార్కుల్ని పరిగణనలోకి తీసుకొని ర్యాంకుల్ని నిర్ధారిస్తామని పరీక్ష ప్రకటన సందర్భంగా పేర్కొనడంతో తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమైంది. చాలా రాష్ట్రాలలో... సీబీఎస్ఈ పద్ధతిలో పన్నెండో తరగతి ఒక్కదానికే బోర్డు పరీక్ష నిర్వహిస్తారు. కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో ఇంటర్ రెండు సంవత్సరాలకూ బోర్డు పరీక్ష ఉంటుంది. నిరుడు కూడా ఇదే సమస్య ఉత్పన్నం కాగా... కోర్టు ఆదేశాలతో రెండేళ్ల మార్కులను లెక్కించారు. ఈసారి కూడా అలాగే... నిబంధన ఉండటంతో విద్యార్థుల్లో అయోమయం నెలకొంది. ఈ విషయమై జేఈఈ మెయిన్స్ నిర్వాహకులైన సీబీఎస్ఈ ఛైర్మన్‌ను అడగ్గా... ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు ఈ ఏడాది కూడా రెండేళ్ల (ఇంటర్ మొదటి, రెండు సంవత్సరాలు) మార్కులను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. జేఈఈ అడ్వాన్స్‌లో మాత్రం రెండో సంవత్సరం మార్కులను మాత్రమే పర్సంటైల్ లెక్కలకు పరిగణనలోకి తీసుకునే అవకాశముంది. అయితే... అడ్వాన్స్‌లో పర్సంటైల్ లెక్కలకు ఇంటర్లో కనీసం 75% మార్కులు దాటితే సరిపోతుందంటూ ప్రమాణాల్ని మార్చిన నేపథ్యంలో ఇది పెద్ద సమస్య కాబోదని నిపుణులంటున్నారు.
