(15 Apr) జిల్లాలో అకాల వర్షం రైతులను నిండా ముంచింది. కొంత మంది రైతులు తమ పంట కోత పూర్తి చేసుకొని రెండు మూడు రోజుల్లో ఇంటికి తెచ్చుకునేవార...
(15 Apr) జిల్లాలో అకాల వర్షం రైతులను నిండా ముంచింది. కొంత మంది రైతులు తమ పంట కోత పూర్తి చేసుకొని రెండు మూడు రోజుల్లో ఇంటికి తెచ్చుకునేవారు. మరి కొంత మంది అమ్మకానికి పొలంలోనే పంటను ఆరబెట్టి బస్తాల్లో నింపి విపణికి తీసుకెళ్ళాల్సి ఉంది. ఇంకొంత మంది కోతలు పూర్తి చేసుకొని పంటను బస్తాలో నింపి అమ్మకానికి తీసుకెళ్లారు. తెల్లారితే తూకం పూర్తయ్యేది. కానీ అకాల వర్షం వారి ఆశలను నేలకూల్చింది. కళ్ల ముందే చేతికొచ్చిన పంట చేజారిపోయింది.. ఆరబెట్టిన పసుపు తడిసిసోయింది.. బస్తాలో ఉన్న మొక్కజొన్న మొలకలు వచ్చాయి.. కోతకు సిద్ధంగా ఉన్న పంటలు నేలవాలాయి. ఉల్లి, నువ్వులు తదితర పంటలలో పూత, మామిడిలో కాత రాలిపోయింది. ఖరీఫ్‌లో నష్టపోయిన రైతాంగం రబీపై ఆశతో పంటలు సాగు చేస్తే అది కాస్తా నీటి పాలయింది. ఈ నెలలో వరుసగా రెండు రోజులు వర్షాలు కురియడంతో రైతులు పంటలను నష్టపోయారు. జిల్లా మొత్తంలో రూ.5 కోట్లకు పైగా విలువైన పంట ఉత్పత్తులను కోల్పోయారు. ప్రాథమిక అంచనా మేరకు 13న కురిసిన వర్షానికి 622 హెక్టార్ల భూమిలో పంటలకు నష్టం జరగ్గా, సోమవారం రాత్రి కురిసిన వర్షానికి 1,935 హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లింది. వరుస వర్షాలతో నష్టపోయిన రైతులను అదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. స్వయంగా ముఖ్యమంత్రి పరిస్థితులపై సమీక్షించి, గ్రామాల వారీగా పంటల నష్టం సర్వే చేసి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. దీంతో బుధవారం నుంచి గ్రామాల వారీగా నష్టం వివరాలు సేకరించనున్నారు.జిల్లాలో ఏటా 1.10 లక్షల హెక్టార్లలో రబీ సాగు అవుతుంది. అయితే ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు నెలకొనడం, విద్యుత్తు సమస్యను దృష్టిలో పెట్టుకొని వరి సాగు తగ్గించి ఆరుతడి పంటలు సాగు చేశారు. వారం రోజుల్లో పంట ఉత్పత్తులు చేతికి రావడంతో పాటు అమ్మకాలు కూడా పూర్తయ్యేవి. అలాంటిది అకాల వర్షం రైతులను నిండా ముంచాయి. జిల్లాలో వరి సాగు 17 వేల హెక్టార్లలో సాగు కావాల్సి ఉండగా, కేవలం వేయి హెక్టార్లలోపు సాగయింది. పంట కోత దశలో ఉంది. అకాల వర్షంతో ఆ కాస్తా పంట చేజారి పోయింది. మొక్కజొన్న, జొన్న, నువ్వులు, తదితర పంటలు కోత దశలో ఉన్నాయి. కొన్ని చోట్ల కోత పూర్తి చేసి అమ్మకానికి సిద్ధంగా ఉంచారు. మరి కొన్ని ప్రాంతాల్లో సజ్జ కోత దశలో ఉంది. గాలులు, వర్షంతో పంట నేలవాల్చింది. దీంతో పంటకు నష్టం వాటిల్లింది.అకాల వర్షంతో నష్టపోయిన 18 మండలాల్లోని 110 గ్రామాల్లో రైతుల వారీగా సర్వే చేసి నష్టం ప్రతిపాదనలు పంపాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు మండల వ్యవసాయాధికారితో పాటు రెవిన్యూ సిబ్బంది తదితరులు నష్టం లెక్కింపులో ఉంటారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇటీవల పంట నష్ట పరిహారం పెంచ డంతో రాస్ట్ర ప్రభుత్వం సైతం తాజాగా నష్టపరిహారం పెంచింది. మొక్కజొన్నకయితే హెక్టారుకు 8,333, జొన్న, బాజ్ర, నువ్వులు తదితర పంటలకు రూ.5,000, వరికి రూ.10వేల చొప్పున నష్టాన్ని లెక్కగట్టి ప్రతిపాదనలు పంపించాలని ఉత్తర్వులు జారీ చేసింది. గతంతో పోలిస్తే నష్టపరిహారం పెంచడం, సర్వేకు ఆదేశాలు జారీ చేయడంతో పరిహారం విడుదల అవుతుందని రైతులు ఆశిస్తున్నారు. జిల్లాలో అకాల వర్షాలతో జరిగిన పంట నష్టం (ప్రాథమిక అంచనా హెక్టార్లలో)పంట 13న 14న గత నెలలో మొక్కజొన్న 27 37 232నువ్వులు 472 812 56 జొన్న 8 20 --వరి -- 203 60మొత్తం 622 1,935 364మండలాలు 6 8 4గ్రామాలు 37 61 12ఈయన పేరు సందీప్ సారంగాపూర్ మండలం యాకర్‌పల్లి గ్రామం. మూడు ఎకరాల్లో గోధుమ పంట సాగు చేశాడు. వారం రోజుల్లో పంట ఇంటికి వచ్చేది. అకాల వర్షం కురియడంతో పంట నేల రాలింది. పంటను కోత చేయడం కష్టం అవుతుంది. దీంతో పాటు కాతలో ఉన్న గోధమ కాస్తా గాలి, వర్షంతో గింజ నేలరాలింది.* ఆదిలాబాద్ మండలం జందాపూర్ గ్రామానికి చెందిన ఈయన పేరు దేవిదాస్ ఖరీఫ్‌లో సోయాబీన్ సాగు చేస్తే వర్షాభావం వల్ల నష్టపోయారు. బోరు బావిలో నీళ్ళు ఉన్నాయని, తొలిసారి ఉల్లి పంటను రెండు ఎకరాల్లో సాగు చేశారు. ఒకటి, రెండు రోజుల్లో పంట ఇంటికి చేరేది. కొంత పంట కోత చేసి పొలంలోనే ఉంచారు. మరి కొంత పంట కోయాల్సి ఉంది. వరుసగా రెండు రోజులు, అది వడగళ్ళ వర్షం కురియడంతో కాత పూర్తిగా చెడిపోయింది. అమ్మకానికి పనికి రాకుండా అయింది.* ఈయన పేరు నరేశ్‌రెడ్డి కుంటాల మండలం కల్లూరు గ్రామం. మొక్కజొన్న పంట సాగు చేసి కోత పూర్తి చేసి, గింజలను సంచుల్లో నింపి అమ్మకానికి కేంద్రానికి తీసుకొచ్చారు. మరుసటి రోజున తూకం వేస్తే పైసలు చేతికందేవి. అలాంటిది రాత్రి అకాల వర్షం కురియడంతో బస్తాల్లో నీరు నిండిపోయింది. ఆరబెట్టిన తరువాత కొనుగోలు చేస్తామనడంతో వాటిని బస్తాల్లోనుంచే మొలకలు వచ్చాయి. అకాల వర్షం కంటే ముందు అమ్మితే క్వింటాలుకు రూ.1310 చొప్పున ధర వచ్చేది. ఇప్పుడు మరో రెండు మూడు రోజులు ఆరబెట్టిన తరువాతనే ధర నిర్ణయిస్తామని చెప్పడంతో ఆ పనిలో ఉన్నారు.* జైనథ్ మండలానికి చెందిన ఈయన పేరు బాపూరావు. నీటి వసతి ఉందని నువ్వులు సాగు చేశాడు, సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి పంట మొత్తం నేలకు వాలిపోయింది. పూత దశలో ఉన్న పంట వారం పది రోజుల్లో కాతకు వచ్చేది. అలాంటిది అకాల వర్షం కారణంగా నేలకు ఒరగడం, పూత రాలిపోవడంతో దిగుబడి పూర్తిగా తగ్గిపోయే వీలుంది. నిర్మల్, : వ్యవసాయ డివిజన్‌గా పేరు నిర్మల్‌లో అకాల వర్షాలకు వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. నిర్మల్ మండలం సోన్, మాదాపూర్, పాక్పట్ల, గాంధీనగర్, చిట్యాల్ గ్రామాల్లో సజ్జ, నువ్వు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. సారంగాపూర్, మామడ, లక్ష్మణచాంద మండలాల్లో పసుపు వర్షానికి తడిసిపోయింది. నాణ్యత దెబ్బతినడంతో గిట్టుబాటు ధరలు రావడం కష్టమే. ముథోల్ నియోజకవర్గంలోని కుంటాల మండంలో ఎక్కువ నష్టం సంభవించింది. దాదాపు 10 వేల క్వింటాళ్ల మక్కలు తడిసిముద్దయ్యాయి. నువ్వు, వరి పంటలకు కూడా నష్టం వాటిల్లింది. భైంసా, కుభీరు, తానూరు, ముథోల్ మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో మక్కలు తడిసిపోయాయి. లోకేశ్వరం మండలంలో దాదాపు 300 ఎకరాల్లో ఆరబెట్టిన పసుపు దెబ్బతింది. మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను సర్వే చేయాలని మంగళవారం రాష్ట్ర న్యాయ, గృహనిర్మాణ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి వ్యవసాయశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈమేరకు అధికారులు మండలాల వారిగా ఏ పంట ఎంత నష్టం జరిగింది.. వివరాలు తెలుసుకునేందుకు సర్వే మొదలుపెట్టారు. కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన మక్కలు తడిసిపోవడంతో ప్రభుత్వం మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని, పంట చేలల్లో దెబ్బతిన్న పంటలకు పరిహారం ఇప్పించాలని రైతులు కోరుతున్నారు.