ఆదిలాబాద్ టౌన్, ఏప్రిల్ 19: జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న రాంనగర్లో గల రామమందిరాన్ని తొలగించేందకు రెవెన్యూ శాఖ అధికారులు శుక్రవారం రంగం...
ఆదిలాబాద్ టౌన్, ఏప్రిల్ 19: జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న రాంనగర్లో గల రామమందిరాన్ని తొలగించేందకు రెవెన్యూ శాఖ అధికారులు శుక్రవారం రంగం సిద్ధం చేశారు. కాగా మందిరం వద్దకు వెళ్లి రెవెన్యూ సిబ్బంది మందిరం ముందర ఉన్న షెడ్డును తొలగించగా, విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్, బిజెపి నాయకులు అడ్డుకున్నారు. దీంతో రెవెన్యూ శాఖ అధికారుల మద్య విశ్వహిందూ పరిషత్ నాయకుల మద్య వాగ్వివాదం చోటుచేసుకొని ఉద్రిక్తతకు దారితీసింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఇరువురిని శాంతింపచేశారు. ఇదిలా ఉంటే గత 25 ఏళ్లుగా సర్వే నెం. 19/1, ప్లాట్ నెం. 1124/బి స్థలంలో రామమందిరాన్ని నిర్మించారు. కాగా అదే కాలనీకి చెందిన సదరు వ్యక్తి ఆదిల్ ఆ స్థలాన్ని పది సంవత్సరాల క్రితం పట్టా పొందారు. ఆయన తన స్థలాన్ని తనకు కేటాయించాలని ఇటీవలే ఆదిలాబాద్ తహసీల్దార్ సుభాష్ చంద్రకు మోరపెట్టుకోగా, ఆయన మందిరం తొలగించేందుకు రెవెన్యూ శాఖ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారని రెవెన్యూ శాఖ సిబ్బంది తెలిపారు. కాగా విశ్వహిందూపరిషత్, బిజెపి నాయకులు 25 ఏళ్ల నుండి మందిరం ఇక్కడే ఉందని, రెవెన్యూ శాఖ అధికారులు అక్రమంగా పట్టాలను జారీచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. టూటౌన్ సిఐ బుచ్చిరెడ్డి విశ్వహిందూ పరిషత్, బిజెపి నాయకులతో మాట్లాడి తహసీల్దార్‌కు వినతి పత్రాల ద్వారా తమ వివరాలను ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దినేష్ మటోలియా, లాలామున్న, విశ్వహిందూ పరిషత్ నాయకులు, భజరంగ్‌దళ్, బిజెపి నాయకులు ఉన్నారు. క్షయవ్యాధి పూర్తిగా నయమవుతోంది.. ఉట్నూరు, ఏప్రిల్ 17: మందులు క్రమబద్దంగా వాడినట్లయితే క్షయవ్యాధి పూర్తిస్థాయిలో నయమవుతోందని క్షయవాధి నివారణ రాష్ట్ర కోఅర్డినేటర్ కమల్‌చంద్ నాయక్ అన్నారు. శుక్రవారం శుక్రవారం స్థానిక పిహెచ్‌వో కార్యాలయంలో మండలంలోని ఆరోగ్య సిబ్బందితో క్షయవ్యాదిపై సమావేశం నిర్వహించగా, ఆయన పాల్గొని మాట్లాడారు. క్షయవ్యాది అనేది తాత్కలికమని, దానికై స్టెప్నోమైషిన్ ఇంజక్షన్‌తో పాటు క్యాటరిన్ ట్యాబ్లెట్లు, రిఫొసిన్ క్యాప్సల్ను, ఐకోమిజెడ్ అనే ట్యాబెట్లు క్రమబద్దంగా వాడినట్లయితే పూర్తి స్థాయిలో నయమవుతోందని అన్నారు. అదే విధంగా హెచ్ ఐవి వ్యాధి రూపమాపడానికి అందరు కలిసి కట్టుగా కృషి చేయాలని అన్నారు. క్షయవ్యాది సెంటర్లలో మందుల నిల్వలు ఉన్నాయని, ఎవరైన రోగి ఉన్నట్లయితే ఆరోగ్య కార్యకర్తలు వారు ప్రతి రోజు వాడే విధంగా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఅర్డినేటర్ చిన్న మల్లయ్య, హెచ్ ఇవో లక్ష్మరెడ్డి, సిహెచ్‌వో ఉరుకుందబాయి, హెల్త్ సూపర్వైజర్ హిందుమతి, రవి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు ప్రశంసా పత్రాలు పంపిణీ ఉట్నూరు, ఏప్రిల్ 17: గణితంలో శిక్షణ పొంది, ప్రావీణ్యం సాధించిన పలువురు విద్యార్థులకు శుక్రవారం ధృవపత్రాలు అందజేశారు. స్థానిక సన్‌షైన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు చెందిన 200 మంది విద్యార్థులు గణితం విభాగంలో శిక్షణ పొందగా, అందులో ప్రతిభకనబర్చిన వారికి స్కూల్ మేనేజ్మెంట్ తరుపున మెమోంట్తో పాట మెడల్స్, గణిత సబ్జెక్టు బుక్‌లను ఆగ్ని మాపక శాఖ అధికారి పరమేశ్వర్ చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. ఈ సంధర్భంగా గణిత బోధకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ సులువైన పద్దతిలో గణితం నేర్చుకునే విధంగా తాము విద్యార్థులకు బోధించామని, తద్వారా విద్యార్థులు ఎంతో ప్రావిణ్యత సాధించారని అన్నారు. గంటల తరబడి చేసే లెక్కలను కేవలం చేతి వేళ్లతోనే తక్కువ సమయంలోనే లెక్కలు చేస్తున్నారని అన్నారు. ఈ పద్దతిని పూర్తిస్థాయిలో విద్యార్ధులకు బోదిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ షబ్బీర్, ప్రిన్సిపాల్ రాజు తదితరులు పాల్గొన్నారు.