-తెలంగాణ ప్రభుత్వంపై భరోసా ఉంది: ఎంపీ అసదుద్దీన్ హైదరాబాద్: నల్లగొండ జిల్లా ఎన్‌కౌంటర్‌పై తగిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కే ...
హైదరాబాద్: నల్లగొండ జిల్లా ఎన్‌కౌంటర్‌పై తగిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చారని ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. గురువారం సీఎంను కలిసిన తర్వాత మీడియాపాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. ముస్లిం మతపెద్దలు, మేధావులు, రాజకీయ నాయకుల అందరూ ప్రతినిధిబృందంగా ఏర్పడి సీఎంను కలిశామని తెలిపారు. ఒక్క బుల్లెట్ పేలకుండా శాంతియుతంగా తెలంగాణాను సాధించిన కేసీఆర్‌పై తమకెంతో ఆశ, గౌరవం ఉందని అన్నారు. కానీ, నల్లగొండ ఎన్కౌంటర్ తమ వర్గాలను భయపెట్టిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్‌కౌంటర్‌పై పోలీసుల మాటలు వాస్తవదూరంగా ఉన్నాయన్నారు. ఈ ఘటనపై సీబీఐతోగానీ స్వతంత్రంగా ఒక కమిటీనిగానీ వేసి విచారణ జరిపించాలని కోరామని తెలిపారు. నల్లగొండ జిల్లా సూర్యాపేటలో సిమి ఉగ్రవాదుల ఘటనపై తాము స్పందించి.. ఉగ్ర చర్యను ఖండించామని తెలిపారు. తమ ఫిర్యాదుపై సీఎం సానుకూలంగా స్పందించారని రెండు, మూడు రోజుల్లో సంఘటనపై చర్య తీసుకుంటామని హామీ ఇచ్చారని చెప్పారు. ముఖ్యమంత్రిపై తమకు భరోసా ఉందని తెలిపారు. ప్రతినిధి బృంధంలో యుఎంఎఫ్ జేఏసీ అధ్యక్షుడు అబ్దుల్ రహీం ఖురేషి, సయ్యద్ అక్బర్ నిజాముద్దీన్, సయ్యద్ ఖుబూల్పాషా, యాఫర్పాషా, సయ్యద్ అవుల్యా ఉన్నారు. కాగా, నల్లగొండ ఎన్‌కౌంటర్‌పై విచారణ జరిపించాలని జమాతే ఇస్లామీ హింద్ అధ్యక్షుడు ఎంకేఎం జాఫర్, కార్యదర్శి యుఎస్ జాకీలు ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. గురువారం మీడియాపాయింట్ వద్ద మాట్లాడుతూ బూటకపు ఎన్కౌంటర్లు ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీస్తాయని పేర్కొన్నారు.
