ధర్మపురి,: తెలంగాణ ప్రజలు గర్వపడేలా, చరిత్రలో నిలిచిపోయేలా, నూతన రాష్ట్రంలో రానున్న జూలై మాసంలో గోదావరి పుష్కరాలను నిర్వహించ డానికి సిఎం ...
ధర్మపురి,: తెలంగాణ ప్రజలు గర్వపడేలా, చరిత్రలో నిలిచిపోయేలా, నూతన రాష్ట్రంలో రానున్న జూలై మాసంలో గోదావరి పుష్కరాలను నిర్వహించ డానికి సిఎం కేసిఆర్ నేతృత్వంలోని తెరాస ప్రభుత్వం కంకణ ధారియై ఉందని ప్రభుత్వ చీఫ్‌విప్, ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ ఉద్ఘాటించారు. సోమవారం ధర్మపురి క్షేత్రంలో పెద్దపెల్లి ఎంపీ బాల్క సుమన్‌తో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈసందర్భంగా ఈశ్వర్ మాట్లాడుతూ, గత ప్రభుత్వాలు గోదావరి పుష్కరాలంటే రాజమండ్రిలోనే జరుగుతాయని విష ప్రచారం చేసి, తెలంగాణ ప్రాంత గోదావరిని విస్మరించారని ఆరోపించారు. మన ప్రభుత్వం కోట్లాది నిధులతో రానున్న పుష్కరాల కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లను చేసేందుకు సర్వసన్నద్దమై ఉన్నదన్నారు. తెలంగాణలో ఇప్పటికి 500కోట్లు కెటాయించడం జరిగిందని, అవసరమైతే మరో 100కోట్లు విడుదల చేయనున్నారని, ధర్మపురి క్షేత్రానికి 100కోట్లతో వివిధ పనులు చేయనున్నట్లు వివరించారు. కేసిఆర్ ప్రస్తుత పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నారని స్పష్టం చేశారు. ఎంపీ సుమన్ మాట్లాడుతూ, గత పుష్కరాల సమయంలో బాబు నేతృత్వంలోని వలసవాదుల టిడిపి ప్రభుత్వం తెలంగాణప సవతి తల్లి ప్రేమ చూపారని, ప్రస్తుతం తెరాస ప్రభుత్వం భక్తులకు వలసిన సౌకర్యాలు, స్నాన ఘట్టాలు, త్రాగునీరు, రవాణా, అంతర్గత రోడ్లు, భద్రత, అన్ని అంశాలపై కసరత్తు చేస్తున్నదని న భూతో న భవిష్యతిగా నిర్వహించనున్నట్లు వివరించారు. ధర్మపురి ఎంపిపి మమత, జడ్పిటిసి రాజమణి, పిఎసిస్ చైర్మన్ రాజేందర్, ఎంపిపి ఉపాధ్యక్షులు రాజేశ్, మాజీ జడ్పిటిసి శ్రీకాంత్ రెడ్డి, సర్పంచులు తిరుపతి, శంకరయ్య, సత్యం, కవిత, ఎంపిటిసిలు రాజ్యలక్ష్మి, విజయలక్ష్మి, మొండయ్య, రాధ, లావణ్య, నాయకులు లింగన్న, వసంత్, సునిల్, శ్రీనివాస్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.