(8 Apr) కరీంనగర్, ఏప్రిల్ 7: ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన నల్గొండ పోలీస్ అమరవీరులకు జిల్లా పోలీస్ శాఖ మంగళవారం రాత్రి ఘననివాళులర్పించింది...
(8 Apr) కరీంనగర్, ఏప్రిల్ 7: ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన నల్గొండ పోలీస్ అమరవీరులకు జిల్లా పోలీస్ శాఖ మంగళవారం రాత్రి ఘననివాళులర్పించింది. జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని పోలీస్ అమరవీరుల స్మారక చిహ్నం వద్ద జిల్లా ఎస్పీ వి.శివకుమార్‌తో పాటు పోలీస్ అధికారులు, సిబ్బంది సెల్యూట్ చేసి ఘనంగా నివాళులర్పించారు. రెండు నిమిషాల పాటు వౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం జిల్లా కేంద్రంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అమరవీరుల సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ జనార్ధన్ రెడ్డితో పాటు డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, ఎఎస్ఐలు, సిబ్బంది తదితరులు పెద్దఎత్తున పాల్గొన్నారు. అలాగే జిల్లా అంతటా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. అలాగే నగర మేయర్ రవీందర్ సింగ్ నగరంలోని అమరవీరుల స్థూపం వద్ద నల్గొండ పోలీస్ అమరవీరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు, టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లిలో కొవ్వొత్తులతో ర్యాలీ పెద్దపల్లి: మృతిచెందిన పోలీస్ అమరవీరులకు పెద్దపల్లి డిఎస్పీ నల్ల మల్లారెడ్డి, సిఐ ప్రశాంత్‌రెడ్డి, ఎస్ఐలు జగన్మోహన్, రవికుమార్, రవిందర్, బసంత్‌నగర్ ఎస్ఐ రాజ్‌కుమార్‌లతో పట్టణంలోని పలు విద్యార్థి సంఘాలు, ప్రజలు స్థానిక జండాచౌరస్తా వద్ద ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జండాచౌరస్తానుంచి కమాన్కూడలి వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. పోలీస్ అమరవీరులకు జోహార్లు అంటూ నినాదాలు చేశారు.