(8 Apr) చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న ఎస్పీ సుమతి సంగారెడ్డి, ఏప్రిల్ 7: వారం రోజులుగా రాష్ట్ర...
(8 Apr) చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న ఎస్పీ సుమతి సంగారెడ్డి, ఏప్రిల్ 7: వారం రోజులుగా రాష్ట్రంలో ముష్కరులను మట్టుబెట్టే పరంపర కొనసాగుతుండటంతో జిల్లాలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించి తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఎస్పీ బి.సుమతి నేతృత్వంలో పకడ్బందీ నిఘా ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను అనుసంధానం చేస్తూ 44, 65వ నంబరు జాతీయ రహదారులతో పాటు హైదరాబాద్-కరీంనగర్ రాజీవ్ రహదారి, హైదరాబాద్-అకోల జాతీయ రహదారులపై ప్రధాన ప్రాంతాలను ఎంపిక చేసి చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి వాహనాలను ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. వాహనాలను తనిఖీలు చేస్తున్న క్రమంలోనే నల్గొండ జిల్లాలో సిమి ఉగ్రవాదులు పోలీసులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి సంచలనం రేకెత్తించడంతో వారిని పట్టుకోవడానికి పోలీసులు చేసిన ప్రయత్నాల్లో ఎదురెదురుగా తారసపడిన సంఘటనలో ముష్కరులు జరిపిన కాల్పుల్లో కానిస్టేబుల్ సహా, ఎస్ఐ సిద్దయ్యలు మృతి చెందిన విషయం తెలిసిందే. వరంగల్ జైలు నుంచి హైదరాబాద్‌కు తీసుకువస్తున్న ఉగ్రవాదులు వికారుద్దీన్ ముఠా సభ్యులు తప్పించుకోవడానికి పోలీసులపై దాడికి పాల్పడటంతో జరిగిన ఎన్కౌంటర్లో వికారుద్దీన్ సహా ఐదుగురు ఉగ్రవాదులు మృతి చెందడంతో జిల్లా పోలీసులు మరిన్ని చర్యలకు ఉపక్రమించారు. వారం రోజులుగా ఆయా ప్రధాన రహదారులపై సోదాలు నిర్వహిస్తుండగా మంగళవారం మరిన్ని పటిష్ట చర్యలు చేపట్టారు. జిల్లా సరిహద్దుకు ఆనుకుని ఉన్న మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల నుంచి అనుమానితులు ప్రవేశించేందుకు ఎంత మాత్రం అవకాశం కల్పించకుండా విస్తృతంగా వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా పూర్తిస్థాయి ఆయుధాలను దగ్గర ఉంచుకుని నిశిత సోదాలు చేస్తున్నారు. గజ్వేల్ నుంచి వచ్చే వాహనాలను నాచరం వద్ద తనిఖీలు చేస్తున్నారు. 65వ జాతీయ రహదారిపై సంగారెడ్డి మండలం కంది, పటన్‌చెరు టోల్గేట్, మెదక్‌లో రాందాస్ చౌరస్తా, నాగ్‌పూర్ రోడ్డులో చేగుంట, కరీంనగర్ రోడ్డులో సిద్దిపేట వద్ద చెర్యాల క్రాస్ రోడ్డు వద్ద చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న వారు ట్రాఫిక్ పోలీసులకు పట్టుపడుతుండగా, అక్రమంగా తరలిస్తున్న గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు, పెద్ద మొత్తంలో డబ్బు తరలింపు తదితర అక్రమ రవాణా వెలుగు చూస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లోని కాండ్వ జైలు నుంచి తప్పించుకుని తిరుగుతున్న ఐదుగురు ముఠా సభ్యులు రామచంద్రాపూర్‌లోని ముత్తూట్ ఫైనాన్స్‌లో చోరికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తూ ప్రధాన పట్టణాల్లో సైతం గస్తీని ముమ్మరం చేసారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఎస్పీ సుమతి పర్యవేక్షిస్తూ పోలీసులకు ఎప్పటికప్పుడు తగిన సలహాలు, సూచనలు ఇస్తున్నారు. గతంలో జిల్లాలోని సదాశివపేట, జహీరాబాద్ ప్రాంతాల్లో ఉగ్రవాదులను పోలీసులు పట్టుకున్న నేపథ్యంలో ఎంత మాత్రం నిర్లక్ష్యం చేయకూడదని కింది స్థాయి సిబ్బందికి ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో పోలీసులు తగిన చర్యలు చేపట్టి శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తున్నారని చెప్పవచ్చు. మరోవైపు కరుడుగట్టిన ఉగ్రవాదులతో జరిగిన పోరాటంలో మృతి చెందిన పోలీసులకు ఘన నివాళులు అర్పించేందుకు ఎస్పీ తనదైన శైలీలో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సోమవారం రాత్రి కొవ్వొత్తుల ప్రదర్శన చేసి శాంతి ర్యాలీ నిర్వహించారు. మృతి చెందిన పోలీసులకు నివాళులు అర్పించి వారి త్యాగస్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ప్రజారక్షణకు సిద్దం కావాలని పోలీసులకు పిలుపునిచ్చారు. పోలీసులు చేస్తున్న తనిఖీల ద్వారా దొంగతనాలు కూడా తగ్గుతాయన్న అభిప్రాయం నెలకొంటుంది.