(4 Apr) ఖమ్మం, ఏప్రిల్ 3: అధికార తెలంగాణ రాష్ట్ర సమితిలో వివాదాలు ముదురుతున్నాయి. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నవారికి, పార్టీ అధికారంలోకి ...
(4 Apr) ఖమ్మం, ఏప్రిల్ 3: అధికార తెలంగాణ రాష్ట్ర సమితిలో వివాదాలు ముదురుతున్నాయి. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నవారికి, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో చేరిన వారికి మధ్య జరుగుతున్న వివాదాలు పార్టీ నాయకత్వానికి తలనొప్పులుగా మారాయి. వీటికి తోడు ఖమ్మం జిల్లాలో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకట్రావు వర్గాల మధ్య విబేధాలు మరింత అధికమయ్యాయి. మెజార్టీ మండలాల్లో పార్టీ రెండు వర్గాలుగా విడిపోయి పని చేస్తోంది. తాజాగా పార్టీ సంస్థాగత ఎన్నికల్లో ఈ వివాదాలు బహిర్గతమవుతున్నాయి. భద్రాచలంలో రెండు రోజుల కిందట జరిగిన నియోజకవర్గ సమావేశంలో నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి బాహాబాహీకి పాల్పడ్డారు. మరో వైపు చండ్రుగొండ మండలంలో కమిటీలను ఏకపక్షంగా ప్రకటిస్తే పార్టీకి రాజీనామా చేస్తామని కొంతమంది సర్పంచ్లు, ఎంపిటిసిలు బహిరంగంగానే ప్రకటించారు. ఇటీవల పార్టీలో చేరిన వారు తమను పార్టీ నుంచి బయటకు పంపించేందుకు ప్రయత్నిస్తున్నారని చర్ల మండల పార్టీ మాజీ అధ్యక్షులు ఆరోపణలు గుప్పించారు. గడిచిన ఎన్నికల తర్వాత వివిధ పార్టీల నుంచి అధికార పార్టీలో చేరిన వారిని అందలం ఎక్కిస్తున్నారని, దశాబ్దకాలంగా పార్టీనే నమ్ముకొని ఉద్యమంలో పాల్గొన్న వారిని ఇప్పుడు పట్టించుకోవటం లేదని వ్యవస్థాపక సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా తుమ్మల, జలగం వర్గాల మధ్య విబేధాలు కెసిఆర్ దృష్టికి కూడా వెళ్ళినట్లు తెలుస్తోంది. ఇటీవల భద్రాచలంలో జరిగిన శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్సవానికి రోడ్డు మార్గం ద్వారా ముఖ్యమంత్రి హాజరు కాగా, ఆయనకు స్వాగతం చెప్పేందుకు కొత్తగూడెం, పాల్వంచలలో తుమ్మల, జలగం వర్గాల నేతలు భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ఇరువర్గాల మధ్య విబేధాలు పొడచూపి ఒకరి ఫ్లెక్సీలను ఒకరు చింపుకున్నారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య ఘర్షణ కూడా కొనసాగింది. ఈ తరహా పరిస్థితే భద్రాచలం, మణుగూరు, ఖమ్మంలలో కూడా ఏర్పడింది. ఇక సత్తుపల్లి ఇద్దరు నేతలకు సొంత నియోజకవర్గం కావటంతో ఎవరికి వారు తమ బలాన్ని నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కాగా ఖమ్మం జిల్లా పార్టీలో ఏర్పడిన విబేధాలు పరిష్కరించేందుకు నాయకత్వం చొరవ చూపటం లేదనే విమర్శలున్నాయి. ఇరువురు నేతల మధ్య దశాబ్దాల కాలంగా ఉన్న వైరుద్ధ్యం ఒక్క రోజుతో పోదని మాత్రమే చెప్పుకొస్తున్నారు. కానీ జిల్లా అభివృద్ధిపై కూడా విబేధాల ప్రభావం కన్పిస్తున్నది. అధికారులతో సమీక్ష సమావేశాలకు ఒకరు హాజరైతే మరొకరు హాజరుకాకపోవటం, ఒకరి తర్వాత మరొకరు సమీక్షలు నిర్వహించటం ఇబ్బంది కలిగిస్తుందని అధికారులే బాహాటంగా చెప్పుకొస్తున్నారు. పార్టీలో ఏర్పడిన విబేధాలను పరిష్కరించకపోతే అధికార పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని ఇప్పటికే ఇంటలిజెన్స్ వర్గాలు కూడా నివేదికలు సమర్పించారు. పాత, కొత్త నేతల మధ్య ఉన్న విబేధాలతో పాటు తుమ్మల, జలగం వర్గాలుగా పార్టీ విడిపోవటం ఇతర పార్టీలకు లాభం చేకూరుస్తుందని వారు పేర్కొన్నారు. అధినాయకత్వం వెంటనే నాయకుల సయోధ్య కుదర్చటంతో పాటు పాత నేతలకు ప్రాధాన్యం కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని ఆ పార్టీకే చెందిన వ్యవస్థాపక సభ్యులు పేర్కొంటున్నారు.
