(8 Apr) *రబీ పంటకు అపార నష్టం *ఆదిలాబాద్ డివిజన్లో జొన్న, మిరప రైతు కుదేలు ఆదిలాబాద్, ఏప్రిల్ 7: ఆదిలాబాద్ జిల్లాలో మంగళవారం సాయంత్...
(8 Apr) *రబీ పంటకు అపార నష్టం
*ఆదిలాబాద్ డివిజన్లో జొన్న, మిరప రైతు కుదేలు
ఆదిలాబాద్, ఏప్రిల్ 7: ఆదిలాబాద్ జిల్లాలో మంగళవారం సాయంత్రం భీకర గాలులతో కురిసిన అకాల వర్షానికి భారీ నష్టం వాటిల్లింది. సాయంత్రం ఉరుములు, మెరుపులతో పెను గాలులు వీయగా, రెండు గంటల పాటు ఏకదాటిగా కురిసిన వర్షానికి ఆదిలాబాద్, గుడిహత్నూర్, ఇచ్చోడ, జైనథ్, తాంసీ, తలమడుగు, బేల, ఇంద్రవెల్లి, ఉట్నూర్ మండలాల్లో పంట చేనుల్లో ఆరబోసిన జొన్న, కంది, మిరప పంటలు తడిసి ముద్దయ్యాయి. వడగళ్ళ వానకు మొక్కజొన్న, గోధుమ పంట, వరి నేలకొరిగి చేతికి రాకుండా పోయాయి. పక్షం రోజుల్లోనే నాలుగుసార్లు సంభవించిన అకాల వర్షంతో రబీ రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ఇటు ఉట్నూర్ డివిజన్లో మంగళవారం రాత్రి కురిసిన వడగళ్ళ వానకు ఊహించని విధంగా రైతుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. నార్నూర్, జైనూర్, సిర్పూర్యు, ఉట్నూర్ మండలాల్లో భారీ వర్షానికి పంట చేనుల్లోని మిరప, కంది, జొన్న పంట పూర్తిగా దెబ్బతిని రైతులను అప్పుల ఊబిలో నెట్టివేసింది. రైతులు కోలుకోని విధంగా దెబ్బతీసిన అకాల వర్షాలు రబీ రైతులను నట్టెట ముంచాయి. మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడిసి ముద్దయి వ్యాపారులు కొనుగోలు చేయకుండా నష్టపోవాల్సి వచ్చింది. ఇదిలావుంటే వడగళ్ల బీ భత్సవంతో ఆదిలాబాద్ డివిజన్లోని పలు చోట్ల భారీ వృక్షాలు నేలకూలగా, ఆదిలాబాద్ పట్టణంలో ద్వారకనగర్, కైలాస్నగర్, విద్యానగర్, కలెక్టర్ ప్రాంగణంలో చెట్లు నేలకూలిన సంఘటనతో విద్యుత్ వైర్లు తెగిపడి ఆదిలాబాద్ పట్టణం అంధకారంగా మారింది. మంగళవారం సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 11గంటల వరకు కరెంటు సరఫరా నిలిచిపోవడంతో పట్టణ ప్రజలు నానా అవస్థలు పడాల్సి వచ్చింది. దీనికితోడు భారీ వర్షం ప్రభావంగా విద్యుత్ పునరుద్దరణకు ఇబ్బందులు తలెత్తాయని ట్రాన్స్కో సిబ్బంది పేర్కొన్నారు. ఇదిలావుంటే అటు కాగజ్నగర్ ప్రాంతంలో సోమవారం అర్దరాత్రి కురిసిన వర్షానికి వరి, మొక్కజొన్న, కంది దెబ్బతినాల్సి వచ్చింది.