నిధుల దుర్వినియోగం కేసులో మిర్యాల, కనకరాజు, సారంగపాణి జైలుపాలు Aakunuri Kanakaraju Miriyala Rajireddy మంచిర్యాల: ...
నిధుల దుర్వినియోగం కేసులో మిర్యాల, కనకరాజు, సారంగపాణి జైలుపాలు
![]() |
| Aakunuri Kanakaraju |
![]() |
| Miriyala Rajireddy |
మంచిర్యాల: సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్ అధ్యక్షుడు ఆకునూరి కనకరాజు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి మరో నేత సారంగపాణిని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముగ్గురిని ఎక్కడికక్కడే అరెస్టు చేసి కొత్తగూ డెం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా పధ్నాలుగు రోజులు రిమాండ్ విధించారు. ముగ్గురిని ఖమ్మం సబ్‌జైలుకు తరలించారు.
ఇంతకీ ఏం జరిగిందంటే: గతంలో టీబీజీకేఎస్ అధ్యక్షుడిగా ఉన్న కెంగర్ల మల్లయ్య, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి మధ్య వర్గపోరు భగ్గుమని మళ్లీ గుర్తింపు ఎన్నికలకు దారితీసింది. ఈ సందర్భంగా గత ఏడాది ఇటు యాజమాన్యం, అటు బ్యాంకర్లు టీబీజీకేఎస్ ఖాతాను ఫ్రీజ్ చేశారు. యూనియన్ నిధుల్లో 80 శాతం ఖర్చులకు ఇవ్వాలని డివిజన్ల కమిటీల్లో ఉన్న మల్లయ్య వర్గం నేతలు డిమాండ్ చేస్తూ కోర్టుకు వెళ్లారు. కేసు తేలేవరకు బ్యాంకు లావాదేవీలు నిలిపివేయాలంటూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. మళ్లీ ఎన్నికల తర్వాత టీబీజీకేఎస్ అధ్యక్షుడిగా ఎన్నికైన ఆకునూరి కనకరాజు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, మరో నేత సారంగపాణిలు యూనియన్ నిధుల విషయమై సింగరేణి అధికారులతో అవగాహన కుదుర్చుకున్నారు. రూ.91,06,700 చెక్కులను గోదావరిఖనిలో టీబీజీకేఎస్ ఖాతాలో జమచేయాల్సి ఉండగా కొత్తగూడెంలో కొత్తగా ఖాతా తెరిచి జమచేశారు. అందులో కూడా డబ్బు ఉంచకుండా సొంత ఖాతాల్లోకి మిర్యాల రాజిరెడ్డి రూ.50 లక్షలు, కనకరాజు రూ.40 లక్షలు మళ్లించుకున్నారు.
ఈ విషయాన్ని గ్రహించిన కెంగర్ల మల్లయ్య వర్గం సమాచారహక్కు చట్టం కింద కొత్తగూడెం బ్యాంకులో దరఖాస్తు చేసుకున్నారు. అప్పని శ్రీనివాస్(భూపాలపల్లి), జీకే సంపత్‌కుమార్(కొత్తగూడెం), బంటు సారయ్య(శ్రీరాంపూర్)లు కొత్తగూడెం కోర్టులో ఫిర్యాదు చేశారు. పూర్తిస్థాయి విచారణ జరపాలని వన్‌టౌన్ పోలీసులను కోర్టు ఆదేశించింది. విచారణ సరిగా జరగడంలేదని, రాజకీయ జోక్యం ఉందంటూ 405, 477(ఏ) కింద పిటిషన్ దాఖలు చేశారు.
హైకోర్టుకు చేరిన కేసు: ఈ కేసు విషయంలో ఆకునూరి కనకరాజు, మిర్యాల రాజిరెడ్డి హైకోర్టులో స్కాష్ పిటిషన్ దాఖలు చేశారు. సెక్షన్ ఆఫ్ లా కింద ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్‌కు విచారించే అధికారం లేదని, నిధుల దుర్వినియోగం జరగలేదని కోర్టుకు విన్నవించారు. కెంగర్ల మల్లయ్య వర్గం కేసులో ఇంప్లీడ్ అయ్యి తగిన ఆధారాలు సమర్పించారు. దీంతో మిర్యాల రాజిరెడ్డి వర్గం వేసిన స్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. వారిని అరెస్టు చేసి చట్టపరంగా విచారించాలని కెంగర్ల వర్గం మరో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసు తీర్పు రాకముందే పోలీసులు బుధవారం మిర్యాల రాజిరెడ్డి, ఆకునూరి కనకరాజు, సారంగపాణిని అరెస్టు చేశారు.

