(19 Apr) రామకృష్ణాపూర్, న్యూస్‌టుడే: ఉద్యోగులుగా మన బాధ్యతలను మనం సక్రమంగా నిర్వహిస్తే బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధన మార్గం సులువవుతుందని...
(19 Apr) రామకృష్ణాపూర్, న్యూస్‌టుడే: ఉద్యోగులుగా మన బాధ్యతలను మనం సక్రమంగా నిర్వహిస్తే బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధన మార్గం సులువవుతుందని మందమర్రి ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ జి.వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. జీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి శనివారం ఏరియాలోని రామకృష్ణాపూర్ ఉపరితల గనిని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గడిచిన మూడు నెలల్లో అత్యధిక ఉత్పత్తికి తోడ్పడిన షావల్, డంపర్ ఆపరేటర్లు, వివిధ విభాగాల ఉద్యోగులకు నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేసి అభినందించారు. అనంతరం గని ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ నిర్ణీత సమయంలో రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తిని ఎంత సాధించామన్నది ప్రతిరోజు బేరీజు వేసుకోవాలన్నారు. తద్వారా వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సులభంగా చేరుకోవచ్చన్నారు. గనిలో ఏ ఉద్యోగి బాధ్యత ఆ ఉద్యోగి సక్రమంగా సమయానుకూలంగా చేసుకోవాలని, వృత్తిపరంగా ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే తన దృష్టికి తీసుకురావాలన్నారు. రామకృష్ణాపూర్తో తనకు అనుబంధం ఉందన్నారు. మందమర్రి ఏరియాలో కొత్తగా పలు ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే సింగరేణిలో ఏరియా బొగ్గు ఉత్పత్తిలో మణిహారంగా మారనుందన్నారు. సంస్థ మనుగడకు ఓసీపీలు అవసరం తప్పనిసరియన్నారు. ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోవాల్సిన అవసరంఉందన్నారు. రక్షణతో కూడిన నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి అవసరమన్నారు. అంతకు ముందు సింగరేణి గుర్తింపు సంఘం తెబొగకాసం ఏరియా ఉపాధ్యాక్షుడు మేడిపల్లి సంపత్ మాట్లాడుతూ తమ సంఘం కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. అనంతరం జీఎం వెంకటేశ్వర్‌రెడ్డి, పీవో సురేష్‌లతో కలిసి ఓసీపీ గని పనిస్థలాలను పరిశీలించారు. గని ఉద్యోగులచే రక్షణ ప్రతిజ్ఞ చేయించారు. గడిచిన మూడు నెలల్లో అత్యధిక ఉత్పత్తికి తోడ్పడిన ఆర్కేపీ ఓసీపీ ఉద్యోగులకు జీఎం వెంకటేశ్వర్ ్రెడ్డి నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తికి కృషి చేసిన షావల్, డంపరు ఆపరేటర్లను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ఆర్కేపీ ఉపరితలగని ప్రాజెక్టు అధికారి పి.సురేష్, గని మేనేజర్ రాంచందర్, రక్షణాధికారి జి.శంకర్, తెబొగకాసం ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్, పిట్ కార్యదర్శి కె.రాజ్‌కుమార్, ఇప్ప సమ్మయ్య, బొంగోని శంకర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
రామకృష్ణాపూర్: మందమర్రి ఏరియాలో రానున్న కాలంలో అందుబాటులోకి వచ్చే కొత్త ప్రాజెక్టులతో ఏరియాకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచుకోవాల్సిన అవసరం ఉందని మందమర్రి ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ జి.వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. శనివారం ఏరియా రామకృష్ణాపూర్ ఉపరితలగని ప్రాజెక్టు అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏరియాలోని శాంతిఖని, ఆర్కే-1ఏ భూగర్భగనులు నష్టాల్లో నడుస్తున్నాయని, టన్ను బొగ్గు వెలికితీయడానికి సుమారు రూ.10 నుంచి 12 వేల వరకు వెచ్చించాల్సి వస్తోందన్నారు. దీన్ని తగ్గించుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై కసరత్తు చేస్తునట్లు చెప్పారు. శాంతిఖనిలో లాంగ్వాల్ ప్రతిపాదన ఉందన్నారు. కె.కె-ఓసీపీ, శ్రావణపల్లి గనులను అందుబాటులోకి తీసుకురావాల్సి ఉందన్నారు. ఆర్కేపీ ఓసీపీ, కె.కె-ఓసీపీ, శ్రావణపల్లి గనులకు సంబంధించిన బొగ్గు జైపూర్ విద్యుత్తు ప్రాజెక్టుకు సరఫరా అవుతుందన్నారు. కాసీపేట-2 గని టన్నెల్ పనులు ప్రారంభించామని తెలిపారు. ఆర్కేపీ ఓసీపీలో ఈ ఆర్థిక సంవత్సరం నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 16 లక్షల టన్నులుగా నిర్ధరించినా 20 లక్షల టన్నులను తీయడమే ముందున్న లక్ష్యమన్నారు. ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకొని రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తికి అందరూ సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా తెబొగకాసం ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్ మాట్లాడుతూ రామకృష్ణాపూర్ పట్టణ అభివృద్ధికి చొరవచూపాలని, ఓసీపీ సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేయాలని కోరారు. సమావేశంలో ఓసీపీ ప్రాజెక్టు అధికారి పి.సురేష్, మేనేజర్ రాంచందర్, రక్షణాధికారి జి.శంకర్, గుర్తింపు సంఘం పిట్ కార్యదర్శి రాజ్‌కుమార్, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
