రామకృష్ణాపూర్, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఇతర రాష్ట్రంలోని బొగ్గు బ్లాకును సింగరేణికి కేటాయించడం సంస్థకు అందిరానుంది. బొగ్గు ఉ...
రామకృష్ణాపూర్, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఇతర రాష్ట్రంలోని బొగ్గు బ్లాకును సింగరేణికి కేటాయించడం సంస్థకు అందిరానుంది. బొగ్గు ఉత్పత్తి అనుభవాన్ని గుర్తించిన కేంద్రం ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాకును కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయంతో బొగ్గు ఉత్పత్తి పెంపుదలకు అవకాశం ఉంది. వంద సంవత్సరాల అనుభవమున్న సింగరేణి సంస్థ మొదటిసారి ఇతర రాష్ట్రంలో బొగ్గు బ్లాకును తవ్వే అవకాశం వచ్చింది. రానున్న ఐదేళ్లలో 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సామర్థ్యం పెంచుకోవాలని సింగరేణి ప్రణాళికలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం ఇతర రాష్ట్రాల్లోని బొగ్గు బ్లాకులను దక్కించుకోవడానికి కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల సింగరేణి ఇతర రాష్ట్రాల్లోని బొగ్గు క్షేత్రాలు దక్కించుకోవడానికి దరఖాస్తు చేసుకుంది. ఆరు క్షేత్రాల్ని కేటాయించాలని కేంద్రానికి దరఖాస్తు చేసుకోగా కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ బొగ్గు పరిశ్రమలకు కొత్తగా బొగ్గు బ్లాకులు కేటాయించడానికి సానుకూలంగా స్పందించింది.500 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు: సింగరేణి సంస్థకు ఒడిశా రాష్ట్రంలోని నైనీ బొగ్గు క్షేత్రాన్ని కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. సింగరేణి సంస్థ గతంలో ఇతర సంస్థకు కేటాయించిన బొగ్గు క్షేత్రాల్లో బొగ్గు వెలికితీత పనులు చేపట్టేందుకు సదరు సంస్థ భాగస్వామ్యంతో పనిచేసింది. నేరుగా ఇతర రాష్ట్రాల్లో బొగ్గు బ్లాకును దక్కించుకొని ఉత్పత్తి చేసిన దాఖలాలు లేవు. బొగ్గు ఉత్పత్తిలో వంద సంవత్సరాల అనుభవమున్న సింగరేణి మొదటిసారి నేరుగా మరో రాష్ట్రంలో బొగ్గు బ్లాకును దక్కించుకుంది. బొగ్గు బ్లాకులను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి సింగరేణి సంస్థ ఇటీవల ఆరు బొగ్గు బ్లాకుల కోసం దరఖాస్తు చేసుకోగా అందులో ఒడిశాకు చెందిన నైనీ బ్లాకు ఒకటి. ఈ బ్లాకులో సుమారు 500 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలున్నాయి. ఆ బ్లాకు అందుబాటులోకి వస్తే సింగరేణిలో పనిచేసే ఉద్యోగులు, అధికారులకు అక్కడ విధులు కల్పించే అవకాశంతోపాటు బొగ్గు ఉత్పత్తిని మరింతగా విస్తరించేందుకు వీలవుతుంది. మరోవైపు ఆ గని నుంచి ఉత్పత్తి చేసే బొగ్గు జైపూర్‌లో సింగరేణి నిర్మిస్తున్న విద్యుత్తు కేంద్రానికి సరఫరా చేయనున్నట్లు దరఖాస్తులో పేర్కొంది. గతంలో మధ్యప్రదేశ్‌లోని తలాయిపల్లి బొగ్గు బ్లాకును దక్కించుకోవడానికి చేసిన యత్నం కొద్దిలో చేజారింది. తలాయిపల్లి బ్లాకులో బొగ్గును వెలికితీసేందుకు సింగరేణి ప్రాథమిక స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసుకుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఆ బొగ్గు బ్లాకును రద్దుచేసింది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా పశ్చిమ్‌బంగ, ఛత్తీస్గడ్, ఝార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లోని 38 బొగ్గు బ్లాకులను ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించగా.. ఇందులో ఒడిశాలోని నైనీ బ్లాకును సింగరేణి దక్కించుకుంది.ఒక టన్ను బొగ్గుకు ఆరు రెట్ల మట్టి తొలగింపు పనులతో(1:6 స్ట్రిప్ రేషియో) సతమతమవుతున్న సింగరేణికి నైనీ బ్లాకు ఓ ఆశాదీపంగా నిలవనుంది. ఈ బ్లాకులో ఒక టన్ను బొగ్గు ఉత్పత్తికి మూడు రెట్ల మట్టిని మాత్రమే తీస్తే సరిపోతుంది. నైనీ బ్లాకు ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్‌కు 180 కిలో మీటర్ల దూరంలో ఉంది. దీనికి తోడు గతంలో జెన్కోకు కేటాయించిన కరీంనగర్ జిల్లా తాడిచెర్ల బ్లాకును తిరిగి అదే సంస్థకు కేటాయించడం సింగరేణికి కలిసి రానుంది. ఆ బ్లాకులో బొగ్గు ఉత్పత్తి ప్రక్రియను సింగరేణి సంస్థనే చేపట్టనుంది. ఇందుకు తెలంగాణ జెన్కో సంస్థ బొగ్గు ఉత్పత్తి చేపట్టేందుకు సింగరేణితో ఒప్పందం కుదుర్చుకుంది.
