(19 Apr) -రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంఘించారని ఆరోపణలు హైదరాబాద్: కార్మికశాఖలో అసిస్టెంట్ లేబర్ కమిషనర్ పోస్టును రాష్ట్రస్థాయి క్యాడర్ ...
(19 Apr) -రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంఘించారని ఆరోపణలు
హైదరాబాద్: కార్మికశాఖలో అసిస్టెంట్ లేబర్ కమిషనర్ పోస్టును రాష్ట్రస్థాయి క్యాడర్ పోస్టుగా కాకుండా మల్టీ జోనల్ పోస్టుగా చూపుతూ ఉన్నతాధికారులు నిర్ణయించడం వివాదాస్పదమవుతున్నది. సహాయ కమిషనర్ పోస్టును రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంఘించి మల్టీ జోనల్ స్థాయికి దిగజార్చారని కొందరు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ విషయం కేఆర్ కమల్‌నాథన్ దృష్టికి రాకపోవడం దురదృష్టకరమని వారు ఆవేదన చెందుతున్నారు. వాస్తవానికి కొన్ని రకాల గెజిటెడ్ పోస్టులను మాత్రమే ప్రత్యేక క్యాడర్ పోస్టులుగా పేర్కొంటూ రాష్ట్రపతి ఉత్తర్వులు అనుబంధం-3లో నోటిఫై చేశారు. కార్మికశాఖకు సంబంధించిన ఏ పోస్టులను కూడా రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరించలేదు. కానీ రాష్ట్రస్థాయి పోస్టుగా ఉన్న సహాయకార్మిక కమిషనర్ పోస్టును మల్టీజోనల్ పోస్టుగా చూపిన ఘనత కార్మికశాఖకే దక్కిందని ఆంధ్రప్రాంతంలో పని చేస్తున్న కార్మిక శాఖ అధికారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ఉల్లంఘన కారణంగానే రాష్ట్ర విభజన జరిగినా అధికారుల్లో ఇంకా మార్పు రావడం లేదని వారంటున్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులలో ఏ యే పోస్టులను జోనల్, మల్టీ జోనల్, స్టేట్ క్యాడర్‌గా పేర్కొన్నారో పరిశీలించకుండానే, ఏ పోస్టులను ఏ క్యాడర్లో చేర్చారనే విషయాన్ని పరిగణలోకి తీసుకోకుండానే గుడ్డిగా సహాయకమిషనర్ స్థాయిని మార్చారని విమర్శిస్తున్నారు. రెండు రాష్ర్టాల మధ్య ఉద్యోగుల పంపిణీ కోసం ఏర్పాటు చేసిన కమల్‌నాథన్ కమిటీ కూడా అది జారీచేసిన మార్గదర్శకాలు అమలవుతున్నాయా లేదా అన్నది నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. కార్మిక శాఖలో జరుగుతున్న అన్యాయాన్ని పరిశీలించి తమకు నాయ్యం చేయాలని ఆంధ్రప్రాంతానికి చెందిన కార్మిక శాఖ అధికారులు కోరుతున్నారు.