(18 Apr) రేపో మాపో చేతికి వచ్చే పంటలతోపాటు అమ్మకానికి సిద్ధంగా ఉంచిన పంట ఉత్పత్తులను అకాల వర్షం నిండా ముంచింది. రబీ పంటలతో గట్టెక్కుదామని...
(18 Apr) రేపో మాపో చేతికి వచ్చే పంటలతోపాటు అమ్మకానికి సిద్ధంగా ఉంచిన పంట ఉత్పత్తులను అకాల వర్షం నిండా ముంచింది. రబీ పంటలతో గట్టెక్కుదామని ఆశ పడ్డ అన్నదాతలకు అంతులేని విషాదం మిగిలింది. జిల్లాలో మార్చి నెలలో రెండు రోజులు ఈ నెలలో మూడు రోజులు కురిసిన వర్షాల వల్ల 11వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమిక నివేదికలు పంపారు. రైతుల వారీగా సర్వేకు జిల్లా పాలనాధికారి ఆదేశాలు ఇవ్వడంతో గ్రామాల్లో నష్టం లెక్కలు తేల్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అయితే కోయకుండా, చేనులో ఉన్న పంటలకు మాత్రమే పరిహారం వర్తిస్తుందని అధికారులు తెలిపారు. ఇప్పటికే కోతలు పూర్తయి తడిసిపోయిన పంట ఉత్పత్తులు,. పంటలను పరిగణలోకి తీసుకోవడం లేదని రైతులు అంటున్నారు. జిల్లా మొత్తంలో మార్చి నెలలో కురిసిన అకాల వర్షాలకు 1,650 హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లగా, ఈ నెలలో కురిసిన వర్షాలకు 2,800 హెక్టార్లలో పంటలు నష్టపోయారు. రూ.5 కోట్ల విలువ గల ఉత్పత్తులను రైతులు కోల్పోయినట్లు అధికారులు ప్రాథమికంగా నివేదించారు.జిల్లాలో కురిసిన అకాల వర్షాల వల్ల ఎక్కువగా నిర్మల్ డివిజన్లోని మండలాల్లోని రైతులు నష్టపోయారు. ఆయా మండలాల్లో నువ్వులు, మొక్కజొన్న, జొన్న, సజ్జ తదితర పంటలు సాగు చేశారు. కోత దశలో ఉన్న ఈ పంటలు అకాల వర్షం వల్ల దెబ్బతిన్నాయి. ఎక్కువ మంది రైతులు పంట కోత పూర్తి చేసుకొని, నూర్పిడికి సిద్ధంగా ఉంచారు. వూహించని రీతిలో వర్షాలు కురియడంతో కోత పూర్తయిన పంట పోలంలోనే తడిసి ముద్దయింది. ఆర బెట్టుకోవడానికి కూడా సమయం ఇవ్వకుండా వరుసగా మూడు నాలుగు రోజులు వర్షాలు కురియడంతో నువ్వులు, వేరుశనగ బూజు పట్టిపోయింది. జొన్న కంకులు నల్లబారాయి. నూర్పిడి పూర్తి చేసుకొని అమ్మకానికి సిద్ధంగా ఉన్న పసుపు, మొక్కజొన్న, ధాన్యం తదితర పంట ఉత్పత్తులు తడిసి ముద్దయి పోయాయి. కొన్ని మండలాల్లో కేంద్రాల్లో అమ్మకానికి సిద్ధంగా ఉన్న సంచులు తడిసిపోవడంతో గింజలల్లో మొలక వచ్చేసింది.కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం రైతులకు కొంత వూరటనిచ్చింది. గతంలో ఉన్న పరిహారాన్ని కేంద్ర ప్రభుత్వం 50 శాతం పెంచడంతో రైతులకు కొంత మేరకు ప్రయోజనం కలగనుంది. గతంలో కేంద్ర ప్రభుత్వం మెట్ట పంటలకయితే హెక్టారుకు రూ.4000, నీటి ఆధారిత పంటలకయితే రూ.8000 ఇచ్చేది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కొంత జోడించి రైతులకు పంట నష్టం కింద పరిహారం ఇచ్చేవారు అలాంటిది కేంద్ర ప్రభుత్వం గతంలో ఉన్న పరిహారం పై ఏకంగా 50 శాతం పెంచడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉన్న మొత్తానికి అదనంగా కలిపి పరిహారం విడుదల చేసే వీలుంది. గతంలో పంటలు నష్టపోయిన సందర్భంలో సర్వే చేసి ప్రభుత్వానికి పంపితే పరిహారానికి రైతులు ఎదురు చూడాల్సి వచ్చేది. రబీలో సాగు చేసిన పంటలు కూడా అకాల వర్షాలతో దెబ్బతిన్నాయి. ఒక వేళ ప్రభుత్వం పరిహారం మంజూరు చేస్తే తాజాగా పెంచిన మేరకు పరిహారం విడుదలయ్యే అవకాశం ఉంది. గతంలో 50 శాతం కంటే ఎక్కువగా పంటలను నష్టపోతేనే పరిహారం మంజూరుకు లెక్కల్లో తీసుకునేవారు తాజాగా కేంద్ర ప్రభుత్వం పంటలో 33 శాతం నష్టపోయినా పరిగణలోకి తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. దీంతో 90 శాతం మంది రైతులు పరిహారం జాబితాలోకి వచ్చే వీలుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మేరకు నష్టాన్ని లెక్కించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. తాజాగా కేంద్రం పెంచిన దాని ప్రకారం మెట్టపంటలకు రూ.6800 చొప్పున నీటి ఆధారిత పంటలకయితే రూ.13500 చొప్పున పరిహారం మంజూరు అవుతుంది.