(8 Apr) బొగ్గు నిల్వలు ఖాళీ చేయకపోవడమే కారణం రామగుండం, ఏప్రిల్ 7: కరీంనగర్ జిల్లా రామగుండం బి.థర్మల్ విద్యుత్ కేంద్రంలోని బంకర్లో బొగ్...
(8 Apr) బొగ్గు నిల్వలు ఖాళీ చేయకపోవడమే కారణం
రామగుండం, ఏప్రిల్ 7: కరీంనగర్ జిల్లా రామగుండం బి.థర్మల్ విద్యుత్ కేంద్రంలోని బంకర్లో బొగ్గు నిల్వల నుంచి మంటలు చెలరేగాయి. సోమవారం రాత్రి విద్యుత్ కేంద్రంలోని బంకర్లో ఈ సంఘటన చోటుచేసుకున్నట్టు తెలిసింది. గడిచిన ఏడు నెలలుగా బి.్థర్మల్ విద్యుత్ కేంద్రం ఉత్పత్తిలో లేదు. ఆధునీకరణ పనుల కోసం గత సంవత్సరం సెప్టెంబర్లో విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తిని నిలిపివేసి పనులను చేపట్టారు. ఐతే ఆధునీకరణ పనులు పూర్తయిన తరువాత ఉత్పత్తిని ప్రారంభించేందుకు అంతా సిద్ధం చేసినప్పటికీ సాంకేతిక లోపం కారణంగా గంటల వ్యవధిలోనే ప్లాంట్ ట్రిప్ అయింది. అలా కొద్ది రోజులు ప్లాంట్లో సాంకేతిక లోపాలు తలెత్తుతూనే ఉండడం వల్ల మరమ్మతు పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో బంకర్లోని బొగ్గు నిల్వలను తొలగించాల్సి ఉంది. ఉత్పత్తి దశలో లేనప్పుడు ప్లాంట్లోని బంకర్లో నిల్వ ఉంచిన బొగ్గు నిల్వలను వెంటనే తొలగించాల్సినప్పటికీ అధికారులు ఆ దిశగా ప్రయత్నాలు చేయకపోవడంతో ఈ సంఘటన చోటు చేసుకున్నట్టు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే రామగుండం విద్యుత్ కేంద్రం గత ఏడు నెలలుగా మూసిఉండడంతో జెన్కో కోట్లాది రూపాయల నష్టాన్ని ఎదుర్కొంటోంది. మరమ్మతులు పూర్తి చేసి ఉత్పత్తి దశలోకి వస్తుందని అందరూ ఎదురు చూస్తున్న క్రమంలో ప్లాంట్లో బొగ్గు నిల్వలకు ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడం అందరిని ఆందోళనకు గురిచేస్తుండగా గడిచిన ఎనిమిది నెలల నుండి బొగ్గు నిల్వలు తొలగించే ప్రయత్నాలు చేయకుండా సంఘటన జరిగిన తరువాత మంగళవారం ఆ బంకర్లలోని బొగ్గు నిల్వలను తొలగించే ప్రయత్నం చేపడుతున్నారు. ఇదిలాఉండగా బంకర్లో 90 టన్నుల బొగ్గు ఉన్నట్టు తెలుస్తోంది. సంఘటనకు సంబంధించి వివరాలను సంబంధిత జెన్కో ఉన్నతాధికారుల నుండి వివరణ కోరే ప్రయత్నం చేయగా అందుబాటులోకి రాలేదు. ఐతే బొగ్గు నిల్వలను తొలగించేందుకు టెండర్ ప్రక్రియ చేపట్టాల్సి ఉన్నప్పటికీ అలా చేపట్టకుండా నామినేషన్ ద్వారానే పనులు చేపట్టేందుకు ఇచ్చినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.