(11 Apr)కొన్నిరోజులుగా రసవత్తరంగా మారిన జిల్లా పరిషత్ రాజకీయాలు మరో మలుపు తిరిగాయి. ఇదివరకు జడ్పీ సీఈఓగా జన్నారం ఎంపీడీఓను నియమిస్తూ జార...
(11 Apr)కొన్నిరోజులుగా రసవత్తరంగా మారిన జిల్లా పరిషత్ రాజకీయాలు మరో మలుపు తిరిగాయి. ఇదివరకు జడ్పీ సీఈఓగా జన్నారం ఎంపీడీఓను నియమిస్తూ జారీచేసిన ఉత్తర్వును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వ కార్యదర్శి రేమండ్ పీటర్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. జడ్పీ రాజకీయాల్లో చివరకు జిల్లాకు చెందిన మంత్రులు అనుకున్నదే నెరవేరింది. ఇక జడ్పీ ఇన్‌ఛార్జి సీఈఓగా జితేందర్‌రెడ్డి కొనసాగనున్నారుజిల్లాపరిషత్ సీఈఓగా అనితాగ్రేస్ పదవీకాలం ఫిబ్రవరి 26న ముగియడంతో జడ్పీలో ఇన్ఛార్జీ గణాంక అధికారిగా పనిచేస్తున్న జితేందర్ రెడ్డికి ఇన్‌ఛార్జి డిప్యూటీ సీఈఓగా పదవి ఇవ్వాలని మంత్రులు జోగురామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి, జడ్పీ అధ్యక్షురాలు శోభారాణిలు పంచాయతిరాజ్ మంత్రి కేటీఆర్‌కు లేఖలిచ్చారు. దీంతో ఆయన ఇన్‌ఛార్జి డిప్యూటీ సీఈఓగా నియమితులయ్యారు. సీఈఓ పదవి ఖాళీ అయితే డిప్యూటీ సీఈఓకు ఇన్ఛార్జీ ఇవ్వవచ్చనే ఉద్దేశంతోనే మంత్రులు ఇలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అనితాగ్రేస్ అనంతరం మార్చి 10వతేదిన జితేందర్‌రెడ్డికి ఇన్ఛార్జీ సీఈఓగా జిల్లా పాలనధికారి జగన్మోహాన్ బాధ్యతలు అప్పగించారు.జన్నారం ఎంపీడీఓగా పనిచేస్తున్న శేషాద్రి తాను ఎంపీడీఓల్లో సీనియర్‌నని పేర్కొంటూ ప్రభుత్వ కార్యదర్శి రేమండ్ పీటర్‌ను ఆశ్రయించారు. దీంతో శేషాద్రిని సీఈఓగా నియమిస్తు ప్రభుత్వ కార్యదర్శి మార్చి 27న జీఓ నం.203 జారీచేశారు. ఇదే సమయంలో జితేందర్‌రెడ్డికి ఇన్‌ఛార్జి డిప్యూటీ సీఈగా జిల్లా పాలనాధికారి ఇచ్చిన ఉత్తర్వులను ఆయన రద్దుచేశారు. అంటే డిప్యూటీ సీఈఓ పదవి కోల్పోతే జితేందర్‌రెడ్డి సీఈఓగా బాధ్యతలనుంచి తప్పుకున్నట్లేనని అర్థం. అయితే శేషాద్రి నియామకం రాజకీయ వేడి పుట్టిచ్చింది. జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు, జడ్పీ అధ్యక్షురాలి భర్త సత్యనారాయణగౌడ్‌లు ఈ విషయంపై పంచాయతిరాజ్ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. గతంలో ఆయన ఆదేశం ప్రకారమే జితేందర్‌రెడ్డికి ఇన్‌ఛార్జి డిప్యూటీ సీఈఓగా పాలనాధికారి పగ్గాలు అప్పగించారనే విషయాన్ని గుర్తుచేశారు. శేషాద్రి నియామకానికి సంబందించి ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని పట్టుబడినట్లు తెలిసింది. ఇదేసమయంలో జితేందర్‌రెడ్డి సీనియర్ అని వారు వివరించినట్లు సమాచారం. మరోపక్క శేషాద్రి సైతం మంత్రులు, జడ్పీ అధ్యక్షురాలి భర్త మద్దతుకోసం ప్రయత్నిస్తూనే హైదరాబాద్‌లో తనకుతెలిసిన మద్దతుదారులతో కేటీఆర్‌ను కలిసి పరిస్థితి వివరించినట్లు సమాచారం.సీఈఓగా శేషాద్రి నియమిస్తు మార్చి 27వతేదినే ఉత్తర్వులను వచ్చినా ఆయనమాత్రం విధుల్లో చేరలేదు. రాజకీయ మద్దతుకోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఇంతకుముందు ప్రభుత్వ కార్యదర్శి రేమండ్‌పీటర్ తాను జారీచేసిన ఉత్తర్వులను ఉప సంహరించుకున్నట్లు ఆయనే కొత్తగా జీఓ నం.238 శుక్రవారం జారీచేయడం గమనార్హం. దీంతో ఇన్ఛార్జీ జడ్పీ సీఈఓగా జితేందర్‌రెడ్డి కొనసాగేందుకు మార్గం సుగమం అయ్యింది. కాగా శేషాద్రికి హైదరాబాద్‌లోని అపార్డ్‌లో పదవి ఇస్తానని కేటీఆర్ భరోసా ఇచ్చినట్లు సమాచారం