-బ్లూ ప్రింట్కు మంగళం.. ఎంసెట్ తరహాలో పరీక్షల సరళి -విద్యార్థులను గందరగోళపర్చిన ఎస్సెస్సీ బోర్డు -బాధ్యులపై చర్యలకు ఉపాధ్యాసంఘా...
-బ్లూ ప్రింట్కు మంగళం.. ఎంసెట్ తరహాలో పరీక్షల సరళి
-విద్యార్థులను గందరగోళపర్చిన ఎస్సెస్సీ బోర్డు
-బాధ్యులపై చర్యలకు ఉపాధ్యాసంఘాల డిమాండ్
హైదరాబాద్: నూతనంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి నిర్వహిస్తున్న పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాల్సిందిపోయి ఎస్సెస్సీ బోర్డు తీవ్ర నిర్లక్షంగా వ్యవహరించింది. బ్లూప్రింట్‌ను పక్కన పెట్టి విద్యార్థులను గందరగోళానికి గురిచేసింది. ఇష్టారాజ్యంగా ప్రశ్నాపత్రాలు తయారు చేయడమే కాకుండా.. పదో తరగతిలో ఐఐటీ, ఎంసెట్ తరహాలో ప్రశ్నలు అడగడం ఎంతవరకు సమంజసమని ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఒకపక్క నూతన పరీక్షల విధానం, మరోపక్క నూతన పాఠ్యపుస్తకాలు కావడం వల్ల విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురికావాల్సి వచ్చింది. మారిన పుస్తకాలు, కొత్త పరీక్షల విధానంలో తగిన శిక్షణ లేక పోవడం వల్ల ఇలాంటి గందరగోళ పరిస్థితులు తలెత్తాయని పలు ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ అంశాలపై ప్రభుత్వం తరుపున ఎన్ని ఉపాధ్యాయ శిక్షణ తరగతులు నిర్వహించినప్పటికీ విద్యార్థుళ మానసిక ఒత్తిడి తగ్గించడంలో విద్యా శాఖ అధికారులు విఫలమయ్యారు.
వాస్తవానికి శిక్షణ కార్యక్రమంలో చెప్పినటువంటి అంశాలతో పదో తరగతి ప్రశ్నాపత్రాన్ని పోల్చుకుంటే చాలా తేడాలు ఉన్నాయి. మారిన పాఠ్యాంశాలపై పదో తరగతి పరీక్షలు నిర్వహించడం ఇదే మొదటి సారి. దీంతో ప్రశ్నపత్రాలు రూపొందించడంలో ఎస్సెస్సీ బోర్డు మరిన్ని జాగ్రత్తలు పాటించి ఉండాల్సిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భౌతికశాస్త్రం ప్రశ్నాపత్రం చూస్తే ఎస్సెస్సీ బోర్డు అధికారుల తీరు బయటపడుతుంది. ఆ ప్రశ్నాపత్రాన్ని చూసిన వెంటనే మెరిట్ విద్యార్థులకే పగలే చుక్కలు కనిపించాయి. ఇక సగటు, అంతంత మాత్రమే చదివే విద్యార్థుల సంగతి చెప్పాల్సిన పనేలేదు.
భౌతికశాస్త్రం ప్రశ్నాపత్రంలో ఐఐటీ, ఎంసెట్ స్థాయిలో ప్రశ్నలు అడగడం.. ఎంతవరకు సబబు అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. బ్లూ ప్రింట్ పాటించకుండా ప్రశ్నాపత్రం తయారు చేసినందుకు విద్యార్థులు అన్యాయానికి గురయ్యే పరిస్థితులు వచ్చాయి. పదో తరగతిలో 20 మార్కులతో పాసయ్యే హిందీ సబ్జెక్టులోనూ ఇలాంటి క్లిష్టమైన ప్రశ్నలనే అడిగారు. ఇంతకు ప్రశ్నాపత్రం ద్వితీయ భాష హిందీ విద్యార్థులకా లేదా ప్రథమ భాష విద్యార్థులకా అన్న అనుమానాలు కలిగాయి. పాఠ్యాంశాలతో సంబంధం లేకుండా ప్రశ్నాపత్రాలు రూపొందించిన వారిపై తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యాశాఖ అధికారులను డిమాండ్ చేస్తున్నారు.
