(14 Apr) - నీటి సంరక్షణకు ఇలాంటి పథకాలు అవశ్యమని ప్రశంస - మూడు వారాల్లో చెరువు పరిరక్షణ కమిటీల ఏర్పాటుకు ఆదేశం హైదరాబాద్, :రాష్ట్రంలో ...
(14 Apr) - నీటి సంరక్షణకు ఇలాంటి పథకాలు అవశ్యమని ప్రశంస - మూడు వారాల్లో చెరువు పరిరక్షణ కమిటీల ఏర్పాటుకు ఆదేశం
హైదరాబాద్, :రాష్ట్రంలో చెరువులు, కుంటల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ ప్రాజెక్టును ఉమ్మడి హైకోర్టు అభినందించింది. నీటి వనరులను పెంపొందించేందుకు ప్రభుత్వం చేపడుతున్న మిషన్ కాకతీయ పనులు ఉపయోగకరమవుతాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యా ణ్ జ్యోతి సేన్ గుప్తా, జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్‌ల ధర్మాసనం సోమవారం పేర్కొంది. చెరువులు, కుంటల్లో నీటిని ఒడిసిపడితే.. బోరు బావుల మీద ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుందని వ్యాఖ్యానించింది. నీటికొరత పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని ధర్మాసనం పేర్కొంది. నీరు, భూమి, చెట్టు చట్టం(వాల్టా) కింద రాష్ట్రంలోని చెరువులు, కుంటలను రక్షించేందుకు కమిటీలను ఏర్పాటు చేయడంలో జాప్యాన్ని సవాల్ చేస్తూ గత ఏడాది ఆగస్టులో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో చెరువులు, కుంటల పరిరక్షణకు అధికారులు, నిపుణులతో కూడిన కమిటీలను ఏర్పాటుచేసే ఆనవాయితీ ఉందని, గత ఆరేండ్లుగా కమిటీలను ఏర్పాటు చేయడం లేదంటూ రంగారెడ్డి జిల్లాకు చెందిన చెరువుల పరిరక్షణ సమితి మాజీ అధ్యక్షుడు కరుణాకర్ హైకోర్టును ఆశ్రయించారు. కమిటీలను ఏర్పాటు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ ఆయన తరఫు న్యాయవాది కేఎస్ మూర్తి కోర్టుకు నివేదించారు. ఈ పిటిషన్‌ను గత ఏడాది ఆగస్టులో ధర్మాసనం విచారణకు స్వీకరించింది. తాజాగా సోమవారం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. వాల్టా చట్టం ప్రకారం చెరువులు, కుంటల పరిరక్షణకు కమిటీల ఏర్పాటు అవశ్యమని, కమిటీల ఏర్పాటులో జాప్యం జరుగుతున్నదని న్యాయవాది కేఎస్ మూర్తి వివరించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున రెవెన్యూ శాఖ న్యాయవాది సీవీ భాస్కర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. చెరువులు, కుంటల పరిరక్షణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ పనులను ప్రారంభించిందని తెలిపారు. ఈ పనులతో బిజీగా ఉన్నందున కమిటీల ఏర్పాటుపై దృష్టి సారించలేకపోయినట్లు తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ పనులకు కితాబునిచ్చింది. మిషన్ కాకతీయ పనులతోపాటు చెరువులు, కుంటల పరిరక్షణకు వాల్టా చట్టం ప్రకారం ఏర్పాటు చేయాల్సిన కమిటీలను మూడు వారాల్లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. అందుకు ఆవసరమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వ న్యాయవాది సీవీ భాస్కర్‌రెడ్డిని ఆదేశించింది.