(14 Apr) హైదరాబాద్, ఏప్రిల్ 13: నల్లగొండ జిల్లా సూర్యాపేట బస్టాండ్‌లో కాల్పులకు పాల్పడిన సిమి ఉగ్రవాదులను పట్టుకునేందుకు పోలీసులు వీరోచితం...
(14 Apr) హైదరాబాద్, ఏప్రిల్ 13: నల్లగొండ జిల్లా సూర్యాపేట బస్టాండ్‌లో కాల్పులకు పాల్పడిన సిమి ఉగ్రవాదులను పట్టుకునేందుకు పోలీసులు వీరోచితంగా పోరాడారని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి కొనియాడారు. ఈ విషయంలో రాష్ట్ర పోలీసులను కేంద్రం కూడా ప్రశంసించిందన్నారు. ప్రాణాలకు తెగించి కాల్పులు జరిగిన రెండు రోజుల్లోనే ముష్కరులను కనుగొన్నారని, ఈ క్రమంలో దురదృష్టవశాత్తు నలుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లాలో సిమి ఉగ్రవాదుల కాల్పుల్లో వీరమరణం పొందిన ఎస్ఐ సిద్దయ్య, కానిస్టేబుళ్లు నాగరాజు, లింగయ్య, హోంగార్డు మహేష్‌లపై రచించిన 'పోలీస్ టైగర్స్' అనే పుస్తకాన్ని సోమవారం మధ్యాహ్నం సచివాలయంలో నాయిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నల్లగొండ జిల్లా జానకీపురం ఎన్‌కౌంటర్‌పై విచారణ కొనసాగుతోందని చెప్పారు. సూర్యాపేట బస్టాండ్‌లో జరిగిన కాల్పుల్లో మూడో వ్యక్తి ఉన్నట్లు అనుమానాలున్నాయని, అయితే ఇప్పటి వరకు ఆ మూడో వ్యక్తి సమాచారం లేదని చెప్పారు. ఒకవేళ మూడో దుండగుడు ఉన్నా అతడు రాష్ట్రం నుంచి తప్పించుకుపోలేడని స్పష్టం చేశారు. ఎన్కౌంటర్ ఘటనా స్థలంలో దొరికిన ఢిల్లీ రైల్వే టికెట్‌పైనా పోలీసు దర్యాప్తు కొనసాగుతోందని, ఇది మూడో వ్యక్తిదా? లేదా? అన్నది దర్యాప్తులో తేలుతుందని చెప్పారు. వికారుద్దీన్ ఎన్కౌంటర్ కేసు విచారణలో ఉన్నందున దాని గురించి మాట్లాడడం సరికాదని నాయిని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. పోలీసులపై ఎన్ని ఆరోపణలున్నా విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు చాకచక్యంగా తమ ధీరత్వాన్ని ప్రదర్శిస్తారని కొనియాడారు. ముష్కరులతో జరిగిన పోరులో తీవ్ర గాయాలపాలైన ఎస్ఐ సిద్దయ్యను కాపాడేందుకు వైద్యులు ఎంతో శ్రమపడ్డారని చెప్పారు. కనీసం కుమారుడి కోసమైనా కోలుకుంటాడని అనుకున్నామని, కాని దురదృష్టవశాత్తు సిద్దయ్య చనిపోయాడని నాయిని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాల్పుల ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని చెప్పారు.