(8 Apr) * జడ్పీ సమావేశంలో కలెక్టర్‌తో పాటు ప్రజాప్రతినిధుల సంతాపం * గ్రామగ్రామాన కొవ్వొత్తులతో నివాళులు మహబూబ్‌నగర్, ఏప్రిల్ 7: నల్గ...
(8 Apr) * జడ్పీ సమావేశంలో కలెక్టర్‌తో పాటు ప్రజాప్రతినిధుల సంతాపం
* గ్రామగ్రామాన కొవ్వొత్తులతో నివాళులు
మహబూబ్‌నగర్, ఏప్రిల్ 7: నల్గొండ జిల్లా జానకిపురంలో గత ఐదు రోజుల క్రితం సిమి ఉగ్రవాదుల ఎదురు కాల్పుల్లో గాయపడి చికిత్స పొందుతున్న జిల్లా వాసి ఎస్సై సిద్దయ్య మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో మృతి చెందాడని సమాచారం అందడంతో ఒక్కసారిగా జిల్లాలో విషాదం అలుముకుంది. జిల్లాకు చెందిన ఎస్సై సిద్దయ్య ఉగ్రవాదుల దాడుల్లో గాయపడి కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడి తుదిశ్వాస విడవడంతో తన సొంత గ్రామమైన జడ్చర్లలో తీవ్ర విషాదం అలుముకుంది. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు సిద్దయ్య మృతిని జీర్ణించుకోలేక పోతున్నారు. జిల్లాపరిషత్ అత్యవసర సమావేశం కొనసాగుతున్న సమయంలో పలువురు పత్రికా విలేఖరులు కలెక్టర్ టికె శ్రీదేవికి సిద్దయ్య మృతి చెందిన విషయాన్ని తెలిపారు. దాంతో సమావేశాన్ని నిలిపివేసి ఎస్సై సిద్దయ్యకు సంతాప సూచకంగా రెండు నిమిషాలు వౌనం పాటించి ఆయన త్యాగాన్ని గుర్తుచేశారు. సిద్దయ్య మృతి చెందారని కలెక్టర్ సమావేశంలో తెలపడంతో ఎమ్మెల్యేలు, జడ్పీటిసిలు, ఎంపిపిలు అయ్యో పాపం అంటూ ఒక్కసారిగా సమావేశం మందిరమంతా నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు సైతం ఎస్సై సిద్దయ్య మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలు స్వచ్చందంగా సిద్దయ్య మృతి పట్ల కొవ్వొత్తులతో నివాళులు అర్పించి సంతాపం తెలిపారు. కాగా సిమి ఉగ్రవాదుల కాల్పుల్లో గాయపడి మృతి చెందిన ఎస్సై సిద్దయ్య కుటుంబం గత 20 ఏళ్ల క్రితం కర్నూల్ జిల్లా చాగలమర్రి మండలం చింతలచెరువు గ్రామం నుండి వచ్చి మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో స్థిరపడ్డారు. జడ్చర్లలోనే సిద్దయ్య విద్యాభ్యాసం కొనసాగింది. సిద్దయ్య తల్లి దస్తగిరమ్మ, తండ్రి చిన్న దస్తగిరిలకు ముగ్గురు కుమారులు. అందులో సిద్దయ్య మూడవ కుమారుడు. 2012లో ఎస్సైగా విధుల్లో చేరాడు. గత ఏడాది క్రితమే ధరనిషాతో వివాహం జరిగింది. కాగా ఉగ్రవాదుల కాల్పులు జరిగిన రోజే కామినేని ఆసుపత్రిలో ఒకపక్క సిద్దయ్య చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడుతున్న నేపథ్యంలోనే ఆయన భార్య ధరనిషాకు పురిటి నొప్పులు రావడం, అంతలోనే కామినేని ఆసుపత్రిలోనే మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ తరుణంలో సిద్దయ్య మృతి చెందడం ఆయన కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. జడ్చర్లలో సిద్దయ్య మృతి పట్ల ఆయన స్నేహితులు తీవ్ర దుఖానికి గురయ్యారు. ఏమైనా సిద్దయ్య మృతితో జిల్లాలో విషాదఛాయలు అలుముకున్నాయి.