(15 Apr)ఆదిలాబాద్ పట్టణం : తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తూర్పు, పశ్చిమ జిల్లాల అధ్యక్షుల ఎంపిక ఉత్కంఠ రేపుతోంది. ఆ పార్టీ ఆదేశానుసారం పాత...
(15 Apr)ఆదిలాబాద్ పట్టణం : తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తూర్పు, పశ్చిమ జిల్లాల అధ్యక్షుల ఎంపిక ఉత్కంఠ రేపుతోంది. ఆ పార్టీ ఆదేశానుసారం పాతవారిపై దృష్టిపెట్టినా.. మరికొందరు చాపకింద నీరులా ఆ పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా తూర్పు జిల్లాలో ఈ రాజకీయ సందడి ఎక్కువగా కన్పిస్తోంది. ఆదిలాబాద్ పట్టణంలోని షాదిఖానాలో బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఈ ఎంపిక నిర్వహించే పార్టీ యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. పశ్చిమ జిల్లాకు మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తూర్పు జిల్లాకు ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ఇన్‌ఛార్జులుగా వ్యవహరిస్తారు.తెరాస అధికారంలో ఉండటంతోనే జిల్లా కమిటీల ఎంపికకు డిమాండ్ ఏర్పడింది. ఇటీవల పట్టణ, మండల కమిటీల ఎంపికలో చాలచోట్ల తీవ్రంగా పోటీ ఉండటంవల్లనే కమిటీల ఎంపిక నిలిచిపోయింది. ఇలాంటి కమిటీలన్నింటిని బుధవారం ఆదిలాబాద్‌లో జరిగే సమావేశంలో ప్రకటించనున్నారు. ప్రస్తుతమున్న తూర్పు, పశ్చిమ జిల్లా అధ్యక్షులు పురాణం సతీష్, లోక భూమారెడ్డి ఇద్దరూ ఓసీ వర్గానికి చెందినవారు కావడంతో ఎదో ఒక చోట ఆ పదవీ బీసీ వర్గానికి కట్టబెట్టాలని ఆ వర్గీయులు జిల్లాలోని ఇద్దరు మంత్రుల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. పశ్చిమ జిల్లా కన్వీనర్‌గా ఉన్న లోక భూమారెడ్డి మళ్లీ ఇదే పదవిపై ఆశలు పెట్టుకున్నట్లు సమాచారం. పశ్చిమ జిల్లాలోని ఇద్దరు మంత్రులతో పాటు ప్రజాప్రతినిధులంతా ఆయనకే సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు తెలుస్తోంది. తెరాసలో సీనియర్ నాయకుడైన బాలురి గోవర్థన్‌రెడ్డి అధ్యక్షపదవిపై ఆసక్తి చూపుతున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. లోక భూమారెడ్డికి నామినెటేడ్ పదవీ ఇస్తే తనకు అధ్యక్ష పదవి ఇవ్వాలని ప్రజాప్రతినిధులను కోరుతున్నారు. తూర్పుజిల్లా కన్వీనర్ పురణం సతీష్‌కే మళ్లీ అధ్యక్ష పదవీ వస్తుందని ప్రచారం జరుగుతోంది. ఇక్కడ బీసీ వర్గానికే చెందిన, ఇటీవల తెరాసలో చేరిన మాజీ తెదేపా జిల్లా అధ్యక్షుడు అరిగెల నాగేశ్వర్రావు, కాగజ్‌నగర్ మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్యలు కూడా అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు చేస్తుండటం ఉత్కంఠకు దారి తీసింది. పార్టీ అధిష్ఠానం సూచన మేరకు బుధవారం ఆదిలాబాద్‌లో పార్టీ జిల్లా ఇన్‌ఛార్జులు వేర్వేరుగా తూర్పు, పశ్చిమ ప్రాంతాల ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశమై అభిప్రాయాలు సేకరించి ఎన్నికను ప్రకటిస్తారు. మరో పక్క పార్టీ అధిష్ఠానం సైతం ఇదివరకే ఈ ఇన్ఛార్జీలకు ఎవరిని అధ్యక్షులుగా నియమించాలనేదీ సూచించినట్లు పార్టీవర్గాల్లో ప్రచారం సాగుతోంది. అధ్యక్షుల ఎంపిక అనంతరం పార్టీ తూర్పు, పశ్చిమ కార్యవర్గాలు, అనుబంధ సంఘాల అధ్యక్షుల ఎంపిక ఉండటంతో వాటికి పోటీపడేవారి సంఖ్య అధికంగానే ఉంది.