(14 Apr) చిగురుమామిడి, ఏప్రిల్ 13: చిన్న రాష్ట్రాల ఏర్పాటు స్పూర్థి ప్రధాత అంబేద్కర్ అని, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ దేశానిక...
(14 Apr) చిగురుమామిడి, ఏప్రిల్ 13: చిన్న రాష్ట్రాల ఏర్పాటు స్పూర్థి ప్రధాత అంబేద్కర్ అని, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ దేశానికి అదించిన సేవలు చిరస్మరణీయమని కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బోయినిపల్లి వినోద్ కుమార్ అన్నారు. సోమవారం చిగురుమామిడి మండలంలోని కొండాపూర్, సుందరగిరి, చిగురుమామిడి మండల కేంద్రంలో నెలకొల్పిన భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఆయన విగ్రహాలను ఎంపి వినోద్, పార్లమెంటరీ కార్యదర్శి విద్యాశాఖ, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ తులా ఉమాలతో కలిసి సంయుక్తంగా ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన మూడు గ్రామాల్లో నిర్వహించిన సభల్లో ఎంపి వినోద్ కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ దళిత కులంలో జన్మించినప్పటికి కులం, మతం తేడాలేని నవ సమాజ నిర్మాణానికి అహర్నిషలు కృషి చేశారని చెప్పారు. రాజ్యాంగాన్ని రచించి దేశ సార్వభౌమత్వానికి బాటలు వేశారని, ఆయన సేవలు నేటికి చిరస్మరణీయంగా మిగిలి ఉన్నాయని అన్నారు. సమానత్వమే హక్కుగా అంబేద్కర్ చేసిన ఉద్యమం గొప్పదని అన్నారు. సమాజంలో అందరూ అంబేద్కర్‌ను ఆదర్శంగా తీసుకొని పనిచేయాలని కోరారు. తెలంగాణలో టిఆర్ఎస్ ఆవిర్భావానికి ముందు ఎన్కౌంటర్లు, రైతుల ఆత్మహత్యలు తప్ప ఏంకన్పించేవి కాదన్నారు. తెలంగాణ రైతు వర్షాభావ పరిస్థితుల కారణంగా బలంగా వ్యవసాయం చేసేవాడు కాదని అన్నారు. ఇందుకు కారణం వర్షం పడ్డప్పుడు చెరువులు పూడికతో నిండి నీరు నిల్వ ఉండకపోవడమేనని అన్నారు. నీరు వృథాగా పోతే చెరువులు త్వరగా ఎండుతాయని, భూగర్భ జలాలు త్వరగా అడుగంటిపోతాయన్నారు. వాటర్‌గ్రిడ్ ద్వారా 10వేల గ్రామాలకు త్రాగునీరు అందించే బృహత్తర కార్యక్రమం కొనసాగుతోందని అన్నారు. రాబోయే ఏడాది 1200 మెగావాట్ల కరెంట్ ఉత్పత్తి అవుటకు ప్రాజెక్ట్‌లు త్వరగా నిర్మాణం పూర్తిచేసుకోనున్నాయన్నారు. వచ్చే రెండేళ్లలో కరెంట్ సమస్యను అదిగమిస్తామన్నారు. నల్గొండ జిల్లా దామచర్లలో నిర్మించే పవర్‌ప్లాంట్‌కు పర్యావరణ అనుమతులు వస్తుయన్నారు. అవినీతి రహిత తెలంగాణే ధ్యేయంగా ముఖ్యమంత్రి కెసిఆర్ పనిచేస్తున్నారని చెప్పారు. సిఎం క్యాంప్ ఆఫీస్‌కు అవినీతి మచ్చ లేదని అన్నారు. మిషన్ కాకతీయ పనుల్లో నాణ్యతను మరిస్తే అధికారులు, కాంట్రాక్టర్లు బాధ్యులు అవుతారని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. విద్య, వైద్యంపై ఖర్చులు తగ్గించాలనే ఆలోచనతో ప్రభుత్వం ఈరెండు సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి సారించిందన్నారు. ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు అందరు కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. టిఆర్ఎస్ ప్రభుత్వం సమానత్వమే హక్కుగా సేవలందిస్తోందని అన్నారు. జిల్లాలో త్రాగునీటికి 27 కోట్ల రూపాయలను సిఎం కేటాయించారని, అందులో హుస్నాబాద్ నియోజకవర్గానికి 5కోట్ల రూపాయలను కేటాయించాలని కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపిచామన్నారు. కొత్త బోర్లు, పైపులైన్లు, మోటార్ల కోసం 70 లక్షల సిడిఎఫ్ నిధులను సైతం కేటాయించి తాగునీటి అవసరాలను తీరుస్తున్నామన్నారు. కోటి 60 లక్షల పైపులైన్‌తో లోయర్ మానేరు డ్యాం ద్వారా నీరు రప్పించి 39 గ్రామాలకు తాగునీరు అందిస్తున్నామన్నారు. రామంచ గ్రామంలో స్థానిక జడ్పీ పాఠశాలలో మినీ గ్రంథాలయాన్ని ఎంపి, ఎమ్మెల్యే, జడ్పీ చైర్మెన్లు ప్రారంభించారు. ఈకార్యక్రమంలో జడ్పీ చైర్మెన్ తులా ఉమా, జడ్పీ వైస్‌చైర్మెన్ రాజారెడ్డి, ఎంపిపి కిష్టయ్య, జడ్పీటిసి చంద్రయ్య, వైస్ ఎంపిపి భవానీ, టిఆర్ఎస్ సీనియర్ నేత పన్యాల భూపతిరెడ్డి, సర్పంచ్‌లు గీకురు రవీందర్, తిరుపతిరావు, వెంకటస్వామి, కొత్త వీరవ్వ-కైలాసం, పెద్దపల్లి సరోజన-రవీందర్, ఎంపిటిసిలు అందె సుజాత-పోచన్న, కానవేని కరుణ-శ్రీనివాస్, మైనార్టీ నేత ఎస్కె సిరాజ్పాషా, ఎంపిడివో కుమారస్వామి, తహశీల్దార్ రాజు, టిఆర్ఎస్ నేతలు దేవసాని శ్రీనివాస్‌రెడ్డి, సాంబారి కొంరయ్య, ముస్కు మహేందర్‌రెడ్డి, కొమ్మేర భూపతిరెడ్డి, సర్వర్‌పాషా, బుర్ర శ్రీనివాస్, భాషవేణి రమేష్, భూపతిరెడ్డి తదితరులు పాల్గోన్నారు.
