(15 Apr) - అప్రమత్తమైన ఆరోగ్యశాఖ - వైరస్ విస్తరించకుండా చర్యలు - లక్షన్నర కోళ్లను చంపి.. పూడ్చివేత - రంగారెడ్డి జిల్లా తొర్రూరు ...
(15 Apr) - అప్రమత్తమైన ఆరోగ్యశాఖ
- వైరస్ విస్తరించకుండా చర్యలు
- లక్షన్నర కోళ్లను చంపి.. పూడ్చివేత
- రంగారెడ్డి జిల్లా తొర్రూరు ఫాంలో వైరస్ గుర్తింపు
- ఫాం మూసివేత.. అక్కడి నుంచి సరఫరాలపై ఆరా
- 60 డిగ్రీల వేడితో వండి తింటే ప్రమాదం లేదు
- గుడ్లనూ ఉడికించి తింటే వైరస్రాదన్న వైద్యారోగ్యశాఖ
హైదరాబాద్, హయత్‌నగర్ : రంగారెడ్డి జిల్లా తొర్రూరులో బయటపడిన బర్డ్ ఫ్లూ వ్యాధిపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేవలం ఒక్క పౌల్ట్రీ ఫాంలోనే వైరస్ ఉందని, మిగిలిన ఏ ప్రాంతంలోనూ దీని ఆనవాళ్లు కనిపించలేదని గుర్తించారు. నివారణ చర్యలు చేపడుతున్నామని,ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని వైద్యారోగ్యశాఖ, పశుసంవర్థకశాఖలు ప్రకటించాయి. 70 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద మాంసం లేదా, గుడ్లను ఉడికిస్తే కోడిలో ఉన్న వైరస్ చనిపోతుందని పేర్కొన్నాయి. గుడ్లను నేరుగా పగులకొట్టుకుని తాగడం ప్రస్తుత పరిస్థితిలో మంచిది కాదని సూచించాయి. తొర్రూరులోని వీఎస్ఆర్ పౌల్ట్రీ ఫాంలో పెద్దసంఖ్యలో కోళ్లు చనిపోయాయి. వాటి నమూనాలను పరీక్షించగా.. బర్డ్ ఫ్లూ (ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా) ఉన్నట్లు నిర్థారణ అయింది. సదరు పౌల్ట్రీఫాంను మూసివేశారు. దాని చుట్టుపక్కల కిలోమీటరు పరిధిలోని ఇతర ఫాంలలోని దాదాపు లక్షన్నర కోళ్లను చంపి, పూడ్చిపెడుతున్నారు. వైరస్ సోకిన ఫాంకు కిలోమీటరు పరిధిలోని ప్రాంతాన్ని వ్యాధి సోకిన జోన్‌గా, దాని చుట్టూ పది కి.మీ. ప్రాంతాన్ని నిఘా జోన్‌గా గుర్తించి, నివారణ చర్యలు చేపడుతున్నారు. ఈ ఫాంలోకి వైరస్ ఎలా ప్రవేశించిందనే విషయంపై అధ్యయనం చేస్తున్నారు. రాష్ట్ర ఎపిడమిక్ సెల్ ఇన్చార్జ్ డాక్టర్ శ్రీనివాస్ రంగారెడ్డి జిల్లా వైద్యారోగ్య శాఖను అప్రమత్తం చేసి.. ముందు జాగ్రత్త చర్యలు మొదలుపెట్టారు. పశు సంవర్థక శాఖతో సమన్వయం చేసుకుంటూ తొర్రూరుతో పాటు పరిసర ప్రాంతాల్లో పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తొర్రూరు, సమీప ప్రాంతాల్లో అన్ని ఇండ్లకు సిబ్బందిని పంపి వైద్య పరీక్షలు చేయించాలని ఎపిడమిక్ సెల్ ఇన్చార్జి డాక్టర్ శ్రీనివాస్.. రంగారెడ్డి డీఎంహెచ్‌వోకు సూచించారు. పశు సంవర్థక శాఖ విజ్ఞప్తిమేరకు 2500 టామీఫ్లూ ట్యాబెట్లను వైద్యారోగ్యశాఖ సరఫరా చేసింది. వైరస్‌ను గుర్తించడంతో కేంద్ర ప్రభుత్వంకూడా అప్రమత్తమైంది. సెంట్రల్ ర్యాపిడ్ రెస్పాన్స్ టీం బుధవారం హైదరాబాద్‌కు చేరుకోనుంది. డాక్టర్ ఎస్కే జైన్, డాక్టర్ ప్రణయ్ వర్మను ప్రత్యేకంగా రాష్ర్టానికి పంపేందుకు కేంద్రం నిర్ణయించినట్లు తెలిసింది. ఒక్క ఫాంలోనే వైరస్ ఒక పౌల్ట్రీఫాంలోనే వైరస్ సోకినట్లు తేలిందని, మిగతా ఏ గ్రామంలోనూ దీని జాడలు కనిపించలేదని పశుసంవర్థక శాఖ సంచాలకులు డాక్టర్ వెంకటేశ్వర్లు స్పష్టంచేశారు. ఆందోళన చెందాల్సిన పని లేదని చెప్పారు. మంగళవారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తొర్రూరులోని బాలకృష్ణారెడ్డి అనే రైతు పౌల్ట్రీ ఫాంలో 70వేల కోళ్లు పెంచుతుండగా.. కొన్ని కోళ్లు చనిపోవటంతో అనుమానంవచ్చిందని, భోపాల్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైసెక్యూరిటీ ఏనిమల్ డిసీజ్ (ఐకార్ సంస్థ) ల్యాబ్‌కు 10శాంపిళ్లు పంపితే.. అందులో ఐదు పాజిటివ్ కేసులు తేలాయని తెలిపారు. వ్యాధి సోకిన జోన్లో కోళ్లను నాశనం చేసేందుకు ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలు పని చేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో 6.91 కోట్ల కోళ్లు వేల గ్రామాల్లోని పౌల్ట్రీ ఫాంలలో ఉంటే.. కేవలం ఒక్క ఫాంలోనే వైరస్ వచ్చిందన్నారు. మిగతాచోట్లకు చెందిన పౌల్ట్రీ ఉత్పత్తులు ప్రజలు తినవచ్చని స్పష్టంచేశారు. 70డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద 20నిమిషాలు ఉడికిస్తే వైరస్ చనిపోతుందని.. ఉడికించిన గుడ్లు, చికెన్ తింటే రాదని తెలిపారు. ఈ విషయంలో ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ప్రస్తుతం వ్యాధి సోకిన పౌల్ట్రీ గుడ్ల కోసం ఉందని.. మాంసం మార్కెట్‌కు వెళ్లలేదని చెప్పారు. గత 20రోజుల నుంచి గుడ్లు ఎక్కడెక్కడికి వెళ్లాయనే వివరాలు సేకరిస్తున్నామన్నారు. బర్డ్‌ప్లూ సోకిన కోళ్లను నిర్మూలించినందుకుగాను నష్టపోయిన రైతుకు ఒక్క కోడికి రూ.90లు, కోడిపిల్లకు రూ.20 చొప్పున నష్ట పరిహారం అందజేయనున్నట్లు పశుసంవర్ధక శాఖ అడిషనల్ డైరెక్టర్ తిరుపతయ్య తెలిపారు. అయితే బాధిత రైతుకు కోడికి కనీసం రూ.250-300 వరకు, కోడి పిల్లకు రూ.170-200 వరకు నష్టపరిహారం చెల్లించాలని తెలంగాణ ఫౌల్ట్రీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి జక్క రాంరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న హేచరీస్ నిర్వాహకుల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఎలాంటి ఆందోళనకర పరిస్థితులు లేవు మున్ముందు పరిస్థితులు చేజారకుండా ఉండేందుకు మాత్రమే ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటామేగానీ... ప్రస్తుతం పరిస్థితి చాలా సాధారణంగా ఉందని రాష్ట్ర ఎపిడమిక్ సెల్ ఇన్చార్జ్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. పక్షులనుంచి మనుషులకు వ్యాపించే ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా లక్షణాలు కూడా ైస్లెన్ఫ్లూ మాదిరిగానే ఉంటాయన్నారు. తీవ్రత మాత్రం ఎక్కువగా ఉంటుందన్నారు. 105 డిగ్రీల సెల్సియస్ వరకు తీవ్ర జ్వరం, జలుబు, గొంతు నొప్పివంటి లక్షణాలు ఉంటాయన్నారు. దీనికి కూడా ఐసోలేటెడ్ గదుల్లో ఉంచి వైద్య సేవలు అందించాలన్నారు. చికెన్, కోడిగుడ్డు తినడంవల్ల ఇది వస్తుందనేది అపోహ మాత్రమేనన్నారు. హీట్ సెన్సిటివ్ వైరస్ అయినందున ఏమాత్రం ఉష్ణోగ్రతలో కూడా ఇది మనుగడ సాధించదన్నారు.