-తేల్చిచెప్పిన తాడిచర్ల నిర్వాసితులు మల్హర్: భూములు, ఇళ్లు త్యాగం చేసిన మమ్మల్ని పుట్టకొకర్ని, చెట్టుకొకర్ని చేయకండి. కాగితాల్లో హామీ...
-తేల్చిచెప్పిన తాడిచర్ల నిర్వాసితులు
మల్హర్: భూములు, ఇళ్లు త్యాగం చేసిన మమ్మల్ని పుట్టకొకర్ని, చెట్టుకొకర్ని చేయకండి. కాగితాల్లో హామీలు చూపడం కాదు. ఇంటికో ఉద్యోగం, అందరికీ ఒకే చోట పునరావాసం కల్పించండి అంటూ తాడిచెర్ల భూ నిర్వాసితులు జెన్కో వారికి, ఆర్డీఓకు విన్నవించారు. ఈ మేరకు అధికారులు మల్హర్ మండలం తాడిచెర్ల నిర్వాసితులతో శనివారం సమావేశమయ్యారు. అంతకుముందు తాడిచెర్ల బొగ్గు బ్లాక్ స్థలాలను మ్యాప్ ద్వారా ఆర్డీఓ, అధికారులు పరిశీలించారు. అనంతరం నిర్వాసితులతో ఆర్డీఓ మాట్లాడారు. ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే బొగ్గు బ్లాక్ తవ్వకాలకు సహకరించాలని కోరారు. నిర్వాసితులు స్పందిస్తూ డిమాండ్లను ఆర్డీఓ ముందుంచారు. ఇప్పటివరకు నిర్వాసితులతో 20 సార్లు సమావేశాలు పెట్టారు తప్పితే డిమాండ్లను నెరవేర్చలేదని ఆరోపించారు. నిర్వాసితులకు ఇంటికి ఒకరికి తాడిచెర్ల బొగ్గు బ్లాకులో ఉద్యోగం ఇవ్వాలని కోరారు. అలాగే మరో 800 ఎకరాల మిగులు భూములను సైతం తీసుకోవాలని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని ప్ర భుత్వ వైద్యశాల వద్ద 18 ఎకరాల భూమి ఖాళీగా ఉందని అక్కడ పునరావాసం కల్పించాలని కోరారు. ఐతే ఆర్డీవో స్పందిస్తూ కనీసం 1088 ఇళ్లకు ఆ భూమి సరిపోదని, 130 ఎకరాల భూమి కోసం సర్వే చేయాలని స్థానిక తహసీల్దార్ తిరుపతికి ఆదేశాలు జారీ చేశారు. కాగా పరిహారం, పునరావాసం విషయాలు తేల్చిన తరువాతనే బొగ్గు బ్లాకు పనులను చేసుకోవాలని నిర్వాసితులు తేల్చి చెప్పారు. సమావేశంలో జెన్కో ఈఈ బాపురావు, ఏఈ అనిల్‌కుమార్, జడ్పీటీసీ గోనె శ్రీనివాసరావు, సర్పంచ్ మల్క మోహన్‌రావు, నిర్వాసితులు పాల్గొన్నారు.