(3 May) -ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్లి ఉగ్రవాది అవతారం -మార్చి 15న ఎదురుకాల్పుల్లో మృతి -విషయం దాచిపెట్టిన కుటుంబీకులు -రంగంలోక...
(3 May) -ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్లి ఉగ్రవాది అవతారం
-మార్చి 15న ఎదురుకాల్పుల్లో మృతి
-విషయం దాచిపెట్టిన కుటుంబీకులు
-రంగంలోకి సీఐ సెల్, ఐబీ, దర్యాప్తు సంస్థలు
-రిక్రూట్మెంట్లు చేసి ఉంటాడని అనుమానం
ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలకు చెందిన ఎంఎస్ విద్యార్థి ఒకరు విదేశాల్లో ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ కార్యకలాపాల్లో పాల్గొంటూ మృతి చెందిన విషయం వెలుగులోకి వచ్చింది. నిఘావర్గాల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ విద్యార్థి కుటుంబీకులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంచిర్యాలకు చెందిన హఫీజ్ అనే విద్యార్థి ఎంఎస్ చదివేందుకు మూడేండ్ల క్రితం అమెరికా వెళ్లాడు. అక్కడ ఆన్లైన్, సోషల్ మీడియా ద్వారా ఐఎస్ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా) ఉగ్రవాదులతో సంబంధాలు పెంచుకున్నాడు. తర్వాత పలు దేశాల్లో ఆ సంస్థ కార్యకలాపాల్లో నేరుగా పాల్గొని ఆయుధాలతో కాల్పులకు తెగబడ్డాడని నిఘా వర్గాలకు సమాచారం వచ్చింది. ఈ విషయాలేవీ కుటుంబీకులకు, బంధువులు, స్నేహితులకు తెలియదు. నాలుగునెలల క్రితం హఫీజ్ స్వస్థలం మంచిర్యాలకు వచ్చాడు. తల్లిదండ్రుల కోరిక మేరకు ఒక అమ్మాయితో నిశ్చితార్థం జరిగిన తర్వాత అమెరికా వెళ్లిపోయాడు. మార్చి 15న తల్లిదండ్రులకు ఐఎస్ఐఎస్ సంస్థ నుంచి ఫోన్ వచ్చింది. కాల్పులు, ఎదురుకాల్పుల్లో హఫీజ్ చనిపోయాడని వారు సమాచారం అందించారు. అయితే ఈ విషయాన్ని కుటుంబీకులు బయటకు పొక్కనివ్వలేదు. చదువుకునేందుకు వెళ్లిన కొడుకు ఉగ్రవాద సంస్థలో చేరుతాడని అనుకోలేదని వారు చెప్తున్నా నిఘా వర్గాలు మాత్రం హఫీజ్ ఐఎస్ఐఎస్లో చేరిన విషయం కుటుంబీకులకు తెలుసని అంటున్నాయి. పసిగట్టిన నిఘా సంస్థలు.. హఫీజ్ మరణించిన విషయం గప్‌చుప్‌గా ఉంటుందని కుటుంబీకులు భావించినా నిఘా వర్గాలు పసిగట్టాయి. కౌంటర్ ఇంటెలిజెన్స్, ఇంటెలిజెన్స్ బ్యూరో, దర్యాప్తు సంస్థలు, నిత్యం వివిధ దేశాల్లోని దర్యాప్తు సంస్థలతో టచ్‌లో ఉండే నిఘావర్గాల సమాచార విశ్లేషణలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రెండురోజుల క్రితం ఈ విషయాన్ని రాష్ట్ర నిఘావర్గాలకు తెలియ చేయడంతో వారు హుటాహుటిన హఫీజ్ తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. హఫీజ్ ఐఎస్ఐఎస్ సానుభూతిపరుడిగా ఎప్పుడు మారాడు? ఏయే దేశాల్లో కార్యకలాపాలు సాగించాడన్న సమాచారాన్ని సేకరిస్తున్నారు. రిక్రూట్మెంట్ చేశాడా..? హఫీజ్ కేవలం ఐఎస్ఐఎస్ కార్యకలాపాలకే పరిమితం కాకుండా మరింత మందిని ఆ సంస్థలో రిక్రూట్ చేసి ఉంటాడా? అనే కోణంలో నిఘావర్గాలు దర్యాప్తు జరుపుతున్నాయి. హఫీజ్ అమెరికా వెళ్లిన తర్వాత జరిగిన పరిణామాలక్రమాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాయి. అతనితో సంబంధాలు కొనసాగించిన స్నేహితులు, బంధువులపై నిఘా పెట్టారు. హఫీజ్ కుటుంబీకుల ఫోన్‌డేటా విశ్లేషిస్తున్నారు. హఫీజ్ ఉదంతాన్ని నిఘావర్గాలు తీవ్రంగా తీసుకుంటున్నాయి. గతంలో ఐఎస్ఐఎస్ వైపు మళ్లిన చాలామంది యువతీయువకులను రాష్ట్ర నిఘావర్గాలు పసిగట్టి కౌన్సెలింగ్ ఇచ్చాయి. ఉగ్రవాదం వైపు దృష్టి సారిస్తున్నారన్న అనుమానితుల కదలికలపై నిఘా పెడుతున్నాయి. తాజాగా హఫీజ్ వ్యవహారం బయటకు పొక్కడంతో నిఘావర్గాలు మరింత అప్రమత్తమయ్యాయి.