రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులకు ప్రభుత్వం శుభవార్తనందించింది. తెలంగాణ ఉద్యమంలో ఉద్యమనేత కెసిఆర్ ఇచ్చిన హామీ తెలంగాణ ఇంక్రిమెంట్ అ...
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులకు ప్రభుత్వం శుభవార్తనందించింది. తెలంగాణ ఉద్యమంలో ఉద్యమనేత కెసిఆర్ ఇచ్చిన హామీ తెలంగాణ ఇంక్రిమెంట్ అమలుచేస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఏప్రిల్ 1 నుంచే ఇంక్రిమెంట్ కార్మికులకు అందేలా ఉత్తర్వుల్లో పేర్కొనగా, జిల్లాలోని ఆర్టీసీ కార్మికుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం ఊపందుకున్న రోజుల్లో కొనసాగిన అనేక ఆందోళనల్లో ఆర్టీసీ కార్మికులు కూడా భాగస్వాములవటం, రాష్ట్ర విభజనకోసం 42 రోజులపాటు నిర్వహించిన సకల జనుల సమ్మెలో తమ విధులు బహిష్కరించిన ఆర్టీసీ కార్మికులు సమ్మెలో భాగస్వాములై, తెలంగాణ ఏర్పాటు కాంక్షను ప్రజల్లో రగిలించటంలో తమ వంతు కృషిచేశారు. అనంతరం జరిగిన పరిణామాలు, కొత్త రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించటం, ఆ వెంటనే జరిగిన ఎన్నికల్లో ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ ఇంక్రిమెంట్ ప్రకటిస్తానంటూ కెసిఆర్ హామీ ఇచ్చిన నేపథ్యంలో కార్మికులకు ఇచ్చిన హామీ అమలుచేసే క్రమంలోనే దీనికి సంబంధించిన ఉత్తర్వులు గురువారం విడుదల చేయటం ఆ సంస్థ కార్మికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
