(12 May) ఎదులాపురం : ఆహారం వికటించి అస్వస్థతకు గురైన యాపల్‌గూడ బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఆదిలాబాద్ మండలంలోని యాపల్‌గూడలో శుక్రవారం...
(12 May) ఎదులాపురం : ఆహారం వికటించి అస్వస్థతకు గురైన యాపల్‌గూడ బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఆదిలాబాద్ మండలంలోని యాపల్‌గూడలో శుక్రవారం వివాహం జరిగింది. రెండోరోజు శనివారం ఏర్పాటు చేసిన విందులో మామిడి రసంతోపాటు భోజనం ఏర్పాట్లు చేశారు. అయితే కేవలం మామడిరసం తిన్నవారు మాత్రమే ఆదివారం మధ్యాహ్నం నుంచి అస్వస్థతకు గురైయ్యారు. జ్వరంతోపాటు కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి. దీంతో స్థానికంగా ఉండే ఆర్ఎంపీ వైద్యుడిని బాధితులు ఆశ్రయించారు. ఆయన పరిస్థితి గమనించి ఆదిలాబాద్ రిమ్స్‌కు వెళ్లాలని సూచించారు. ఆదివారం రాత్రి 8గంటల వరకు 22 మంది బాధితులు రిమ్స్ ఆసుపత్రిలో చేరారు. అర్ధరాత్రి వరకు మరో 35మంది చేరారు. దీంతో ఈసంఖ్య 57కి చేరింది. సోమవారం ఉదయం మరో 15మంది బాధితులు ఆసుపత్రిలో చేరారు. సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నాయి. కొందరు ప్రైవేట్‌లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.విషహారం వికటించిన సంఘటనలు ఇదివరకు రెండు చోటు చేసుకున్నాయి. జైనథ్ మండలం గిమ్మలో 11 మంది, బేల మండలం సాంగిడిలో దాదాపు 150 మంది విందు భోజనాలు తిన్నవారు ఆహారం వికటించి అస్వస్థతకు గురయ్యారు. దీంతో యాపల్‌గూడ సంఘటన నేపథ్యంలో రిమ్స్ ఆసుపత్రి వైద్యులు బాధితులకు ప్రత్యేకంగా వార్డు కేటాయించారు. వార్డులో పూర్తిసిబ్బందిని ఉంచి వైద్యసేవలు ప్రారంభించారు. రిమ్స్ నిర్వాహకుడు డాక్టర్ అశోక్ ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి ఒంటి గంట వరకు అక్కడే ఉండి వైద్యసేవలు సక్రమంగా అందించడానికి కృషి చేశారు.బాధితుల సంఖ్య పెరిగిపోతుండటంతో వార్డుల్లో ఏర్పాటు చేసిన మంచాలు (బెడ్లు) సరిపోలేదు. దీంతో ఒకే బెడ్‌పై ఇద్దరేసి బాధితులకు చికిత్సలను అందించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వార్డు సరిపోకపోవడంతో మొదటి అంతస్తులోని వార్డుకు బాధితులను తరలించారు. పిల్లలను రెండో అంతస్తులోని పిల్లల వార్డుకు తరలించి చికిత్సలు అందించారు.ఆహారం వికటించి అస్వస్థతకు గురైన బాధితులంతా కోలుకుంటున్నారని రిమ్స్ నిర్వాహకుడు డాక్టర్ అశోక్ తెలిపారు. బాధితులు ఎటువంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. ఆరోగ్యం కుదుటపడ్డా కొంత నీరసంగా ఉంటుందని కంగారు పడాల్సిన పనిలేదన్నారు. కొంత విశ్రాంతి తీసుకొని పూర్తిస్థాయిలో చికిత్స తీసుకుంటే పూర్తిగా నయమవుతుందన్నారు. విందు సందర్భంగా పెద్దమొత్తంలో తయారు చేసిన మామిడిరసంలో ఏదైనా తేడా ఏర్పడటంతో దాన్ని తిన్నవారు అస్వస్థతకు గురై ఉండొచ్చన్నారు.
