టీఆర్ఎస్ శ్రేణుల్లో చర్చలు ఎమ్మెల్యే కోటాలో ఆరు స్థానాలకు రేపు నోటిఫికేషన్ హైదరాబాద్: శాసనమండలి ఎన్నికలపై అధికార టీఆర్ఎస్లో ఎడతె...

ఎమ్మెల్యే కోటాలో ఆరు స్థానాలకు రేపు నోటిఫికేషన్
హైదరాబాద్: శాసనమండలి ఎన్నికలపై అధికార టీఆర్ఎస్లో ఎడతెగని చర్చలు సాగుతున్నాయి. గురువారం (14వ తేదీన) ఎమ్మెల్యే కోటాలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. జూన్ ఒకటిన ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఎమ్మెల్సీ అవకాశం ఎవరికి దక్కుతుందనే విషయంలో స్పష్టత రాలేదు. వాస్తవానికి ఈ 6 ఎమ్మెల్సీ స్థానాల్లో నాలుగింటిని ఎలాంటి ఇబ్బందులూ లేకుండానే టీఆర్ఎస్ దక్కించుకోనుంది. ఐదో స్థానానికీ పోటీపడనున్నట్లు సమాచారం. ఇందులో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పేర్లు దాదాపు ఖరారయ్యాయంటున్నారు. మిగతా 2 స్థానాలకు పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఎమ్మెల్యే కోటాలో మిగతా 2 స్థానాలతో పాటు పోటీపడాలని భావిస్తున్న ఐదో స్థానానికి ముగ్గురి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. కె.ఆర్.ఆమోస్, బోడకుంటి వెంకటేశ్వర్లు, కె.యాదవరెడ్డిలలో ఇద్దరికి అవకాశం ఉంటుందంటున్నారు. మరొకరిని ఐదో స్థానానికి పోటీలో పెడతారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
స్థానిక కోటాలో..: స్థానిక సంస్థల కోటాలో కొండా మురళి, తక్కళ్లపల్లి రవీందర్రావు, మర్రి యాదవరెడ్డి పోటీపడుతున్నారు. కరీంనగర్లో 2 స్థానాలకు మాజీ ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, భానుప్రసాద్, ఆదిలాబాద్‌లో పురాణం సతీష్, మెదక్‌లో భూపాల్‌రెడ్డి, ఖమ్మంలో బాలసాని లక్ష్మీనారాయణ, నల్లగొండలో తేరా చిన్నపురెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలో రెండు స్థానాలకు జగదీశ్వర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, రంగారెడ్డి జిల్లాలో2 స్థానాలకు పి.నరేందర్‌రెడ్డి అభ్యర్థిత్వాలు దాదాపు ఖరారయ్యాయని సమాచారం. ఇక్కడ మరో స్థానానికి ఎమ్మెల్యే కోటాలో కె.యాదవరెడ్డి పేరూ ప్రచారంలో ఉంది.