- కేంద్రానికి కలెక్టర్ నీతూప్రసాద్ విజ్ఞప్తి హైదరాబాద్ : కరీంనగర్జిల్లాలోని సుప్రసిద్ధ శైవక్షేత్రం వేములరాజరాజేశ్వరస్వామి దేవస్ధానాన...
- కేంద్రానికి కలెక్టర్ నీతూప్రసాద్ విజ్ఞప్తి
హైదరాబాద్ : కరీంనగర్జిల్లాలోని సుప్రసిద్ధ శైవక్షేత్రం వేములరాజరాజేశ్వరస్వామి దేవస్ధానాన్ని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దేందుకు నిధులను మంజూరుచేయాలని కేంద్ర ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ నీతుప్రసాద్ విజ్ఞప్తి చేశారు. వేములవాడను పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దేందుకు రూ.38 కోట్లు అవసరమని పేర్కొంటూ ఆమె నమూనా ప్రాజెక్టును కేంద్రానికి పంపారు. అందులో వేములవాడ క్షేత్ర వైభవం, చారిత్రక విశిష్టతలను వివరించారు. వేములవాడ క్షేత్రం దక్షిణ కాశిగా, హరిహర క్షేత్రంగా భాసిల్లుతున్నదని తెలిపారు. ఈ దేవస్థానం, సమీపంలోని చెరువును అభివృద్ధిచేస్తే వేములవాడ వేములవాడ ఆహ్లాదకర పర్యాటక ప్రదేశంగా విలసిల్లడానికి అవకాశం ఉందన్నారు.
వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థాన సమీపంలోనే ముస్లింల ప్రార్థనా మందిరం కూడా ఉన్నదని పేర్కొన్నారు. కనుక ఈ పుణ్యక్షేత్రం హిందూ - ముస్లిం సమైక్యతకు చిహ్నమని ఆ నివేదికలో తెలిపారు. దీనిపై రాష్ట్ర పర్యాటకశాఖ డైరెక్టర్ చొరవ చూపి, కేంద్రానికి సిఫారసు చేయాలని కోరారు. వేములవాడ శైవక్షేత్రమే కాకుండా జైనిజంకు గొప్ప కేంద్రంగా ఉండేదని ఆమె తన నివేదికలో వివరించారు. ఈ ప్రాంతం చారిత్రాత్మక ప్రదేశమని, 8వ, 9వ శతాబ్దంలో చాళుక్య రాజులు వేములవాడ రాజధానిగా పరిపాలన సాగించారని తెలిపారు.
