కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని, ఉద్యోగ భద్రత లేకుండా పోతోందని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి విలాస్ అ...
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని, ఉద్యోగ భద్రత లేకుండా పోతోందని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి విలాస్ అన్నారు. శుక్రవారం ఆర్అండ్బీ విశ్రాంతి భవనం వద్ద ఏర్పాటు చేసిన కార్మికుల దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై ఆయన ప్రసంగించారు. అంతకు ముందు విలాస్ అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ప్రపంచంలోని కార్మికులు పెట్టుబడి విధానానికి వ్యతిరేకంగా తమ హక్కుల రక్షణ కోసం మేడే ఒక ఆవకాశం కల్పించిందని అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలోని కెసిఆర్ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని అన్నారు. దేశంలో పాలకవర్గాలు కార్మికుల హక్కులపై సాగిస్తున్న దాడులకు వ్యతిరేకంగా మేడే కార్యక్రమాలు కార్మిక వర్గం చేపట్టాల్సి ఉందన్నారు. భారత దేశంలో వాచ్పెయి ప్రభుత్వం వచ్చిన తర్వాత చిన్న పరిశ్రమలు మూత పడ్డాయని, ఆదిలాబాద్ జిల్లాలోని సిమెంట్కార్పొరేషన్ ఇండియా, సిర్పూర్ పేపర్‌మిల్లు మూత పడడంతో నాలుగు వేల మంది కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాయని అన్నారు. కార్పొరేట్ శక్తులకు లొంగిపోయిన బిజెపి ప్రభుత్వం కార్మికులను మోసం చేస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి కెసి ఆర్ ఉన్న పరిశ్రమలను మూసి వేసి కొత్త పరిశ్రమలను స్థాపిస్తామని చెప్పడం సమంజసం కాదన్నారు. రిమ్స్‌లో పనిచేస్తున్న కార్మికులతో పాటు మధ్యాహ్న భోజన కార్మికులు, ఆశవర్కర్లు, మున్సిపల్ వర్కర్లకు కానీస వేతనాల కోసం పోరాటాలు చేస్తున్నప్పటికి పెండింగ్‌లో ఉన్న వేతనాలు ఇవ్వడంలో ప్రభుత్వం స్పందించడం లేదని, జిల్లా కేంద్రంలోని డిసిఎల్ కార్యాలయం ఎదుట ధర్నాలు చేస్తున్నప్పటికి సమస్యల గురించి పట్టించుకునే వారే కరువయ్యారని అన్నారు. భవన నిర్మాణ కార్మికులకు రూ. 3వేల పింఛన్, రిటైర్మెంట్ అయిన ప్రతి కార్మికునికి పింఛన్ ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన నిర్వాహక జిల్లా కార్యదర్శి రాధకుమారి, నారాయణ, నితిష్, కాంతరావు, రాజన్న, నహిమ్, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. మే 27న న్యూఢిల్లీలో సదస్సు కార్మికుల హక్కులు, ఉద్యోగ భద్రత, భవిష్యత్తు కార్యచరణపై త్వరలో ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసి, పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని విలాస్ అన్నారు. మే 27న ఢిల్లీలో జరిగే కార్మిక సదస్సును విజయవంతం చేయాలని ఏఐటియూసి జిల్లా ప్రధాన కార్యదర్శి విలాస్ అన్నారు.
