(3 May) ఉప్పల్, మే 2: విశ్వనగరంలా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్‌లో అధునాతన టెక్నాలజీతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మెట్రోరైలు ప్రాజెక్టు...
(3 May) ఉప్పల్, మే 2: విశ్వనగరంలా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్‌లో అధునాతన టెక్నాలజీతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మెట్రోరైలు ప్రాజెక్టు అద్భుతంగా ఉందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అభివర్ణించారు. శనివారం ఉప్పల్ నాగోల్ రోడ్డులో మెట్రోరైలు నిర్మాణం జరుగుతున్న విధానం, పనుల పురోగతిపై స్థానిక ఎంపి సిహెచ్.మల్లారెడ్డి, ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్‌తో కలిసి మెట్రోరైలు ఎండి ఎన్వీఎస్ రెడ్డి, ఎల్‌అండ్‌టి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముందుగా రైల్వేస్టేషన్, డిపోను సందర్శించి ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. రైలుఎక్కి అందులో ఎంత మంది ప్రయాణిస్తారో, ఎంత వేగంగా వెళ్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు తదితర విషయాలను క్లుప్తంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి విలేఖరులతో మాట్లాడుతూ నగరాన్ని పట్టిపీడిస్తున్న ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి మెట్రో రైలు ప్రాజెక్టుకు 2002లో పనులు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్ధిక సహాయంతో ఇతర బ్యాంకులు, సంస్థల సహకారంతో 14వేల 590 కోట్లతో ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఎనర్జీ సేవింగ్‌తో కాలుష్యరహితంగా సులువైన ప్రయాణంకోసం జరిగే ఇట్టి పనులను ఇతర ప్రాంతాలలోకి విస్తరించి త్వరితగతిన పూర్తిచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మరింత చొరవ చూపాల్సిన అవసరం ఉందన్నారు. తక్కువ సమయంలో త్వరగా ఆయా గమ్యాలకు సురక్షితంగా చేరుకోవడానికి ఏర్పాటు చేసిన మెట్రో రైలులో రోజుకు 60వేల మంది ప్రయాణించడానికి అంచనా వేసినట్లు తెలిపారు. మెట్రో రైలు ప్రాజెక్టుతో భూములు కోల్పోయిన రైతులకు సత్వర న్యాయం చేయడానికి త్వరలో సిఎంతో ప్రత్యేక చర్చలు జరుపనున్నట్లు వివరించారు. త్వరితగతిన పూర్తయితే మెట్రో రైలు డిపో, స్టేషన్లను వచ్చే దసరా పండుగ నాటికి ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. మెట్రో ప్రాజెక్టులో వివిధ విభాగాలలో పనిచేయడానికి చేపట్టే ఉద్యోగ నియామకాల్లో నైపుణ్యం కలిగిన స్ధానికులకే ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అంతకు ముందు స్థానిక రైతులు ఉప్పల్ రైతులు ఇచ్చిన భూములలో నిర్మించిన మెట్రో రైలు డిపో పేరును నాగోల్ అని పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు. మెట్రో రైలు డిపోకు పెట్టిన నాగోల్ పేరు స్థానంలో ఉప్పల్ డిపోగా మార్చినట్లు పేర్కొన్నారు. అయితే చివరి రైల్వే స్టేషన్‌కు మాత్రం నాగోల్ అని పేరు ఉండటాన్ని అభ్యంతరం వ్యక్తం చేశారు. మల్కాజిగిరి ఎంపి సిహెచ్.మల్లారెడ్డి మాట్లాడుతూ విలువైన భూములు కోల్పోయిన నిరుపేద రైతు కుటుంబాలలో ఒక్కొక్కరికి మెట్రో రైలు ప్రాజెక్టులో ఉద్యోగం ఇవ్వాలని అధికారులను కోరారు. ఎమ్మెల్యే ప్రభాకర్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రోరైలు ప్రాజెక్టు ఇక్కడ నిర్మించడం ఉప్పల్ ప్రజల అదృష్టమని పేర్కొన్నారు. భూములు కోల్పోయిన రైతులకు సత్వర న్యాయం అందించి, ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో బిజెపి నేతలు గొరిగె కృష్ణ, మంకాల లక్ష్మణ్, నిధానకవి బొమ్మల శ్రీరాములు, డి.బాల్‌చందర్, యు.బలవంతాచారి, గాదె శ్రీనివాస్, కాంతాల నారాయణరెడ్డి, బాలకృష్ణగౌడ్, రేవెల్లి రాజు, బొంగు రమేశ్‌గౌడ్, ఉమేశ్‌సింగ్, కళ్యాణం గీతారాణి, జె.శ్రీలత, టిడిపి నేతలు కందికంటి అశోక్‌కుమార్‌గౌడ్, బన్నాల ప్రవీణ్‌రాజ్, ఎం.మధుసూదన్‌రెడ్డి, సర్వ సత్తయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు మెట్రో రైలు ప్రాజెక్టు డిపో లోపలికి వెళ్లేందుకు అనుమతించలేదని అధికారుల తీరుపై విలేఖరులు నిరసన తెలిపారు. మెయిన్ గేట్ ఎదుట ఆందోళన చేశారు. పిఆర్ఓ జోక్యం చేసుకుని లోపలికి పంపించడంతో గొడవ సద్దుమణిగింది. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు * ప్రతి రైలు స్టేషన్లో రూ.2కోట్లతో బ్యూటిఫికేషన్ పనులు మెట్రో రైలు ఎండి ఎన్వీఎస్ రెడ్డి ఉప్పల్, మే 2: మెట్రో రైలులో ప్రయాణించే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను కల్పించనున్నట్లు మెట్రో రైలు ప్రాజెక్టు ఎండి ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. అధునాతనమైన టెక్నాలజీతో అద్భుతంగా నిర్మిస్తున్న మెట్రో రైలు పనులను ఎన్ని అవాంతరాలు ఎదురవుతున్నా అధిగమించి పనులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. శనివారం ఉప్పల్ నాగోల్ రోడ్డులో మెట్రోరైలు నిర్మాణం జరుగుతున్న విధానం, పనుల పురోగతిపై మెట్రోరైలు ఎండి ఎన్వీఎస్ రెడ్డి, ఎల్‌అండ్‌టి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మెట్టుగూడ ఆలుగడ్డబాయి వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులు, ఒలిఫెంటా బ్రిడ్జి పనులను సకాలంలో పూర్తి చేయడానికి చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఉప్పల్, మియాపూర్ ప్రాంతాలలో నిర్మించిన ప్రతి రైలు స్టేషన్లో రూ.2కోట్లతో బ్యూటిఫికేషన్, ఇతర సౌకర్యాలను కల్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రైలు ప్రయాణీకులకోసం ప్రతి స్టేషన్ వద్ద వెహికిల్ పార్కింగ్, ఆటోలు లేదా బస్సులలో వెళ్లేందుకు ప్రత్యేక ఏర్పాట్లను చేపట్టనున్నట్లు తెలిపారు. అయితే మెట్రో ప్రాజెక్టు నిర్మాణం పనులు దసరా నాటికి పూర్తికావని, వచ్చే సంవత్సరం వరకు పూర్తి చేయనున్నట్లు వివరించారు. ఎప్పుడు ప్రారంభిస్తారన్న విషయం తదుపరి ప్రకటిస్తామని, మెట్రో రైలు ప్రారంభమై వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తెలిపారు.