తె లంగాణాలో అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ సింగరేణిలో తెరాస అనుబంధ తెబొగకాసంలో నాయకత్వ మార్పిడి కోసం పార్టీ అధినాయకత్వం ప్రయత్నాలు చేపట్టింద...

తెలంగాణాలో అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ సింగరేణిలో తెరాస అనుబంధ తెబొగకాసంలో నాయకత్వ మార్పిడి కోసం పార్టీ అధినాయకత్వం ప్రయత్నాలు చేపట్టింది. పార్టీ నాయకత్వమే గుర్తింపు సంఘం పగ్గాలు కొత్తవారికి అప్పగించడం ద్వారా, 2016లో జరుగనున్న కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికల్లో తమ ప్రాభవాన్ని కాపాడుకోవాలనే తలంపుతో ఉన్నట్లు సమాచారం. నాయకత్వాన్ని ఎవరికి అప్పగించాలనే అంశంపై అధిష్ఠానం కొంత మంది ఎమ్మెల్యేలతో ఒక కమిటీని వేసినట్లు తెలిసింది. ప్రస్తుతం ఐఎన్టీయూసీకి నిర్వాహక అధ్యక్షునిగా వ్యవహరిస్తున్న తాజా మాజీ ఎమ్మెల్సీ బి.వెంకట్రావుకు తెబొగకాసం బాధ్యతలు అప్పగిస్తే ఎలా ఉంటుందనే విషయంపై పార్టీలో చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ఐఎన్టీయూసీలో కొనసాగుతూ, తెరాస తీర్థం పుచ్చుకున్న వెంకట్రావుకు తిరిగి ఎమ్మెల్సీ పదవిని కట్టబెడుతూ, తెబొగకాసం బాధ్యతలు అప్పగించాలని ఒక వర్గం ప్రయస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వెంకట్రావు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ విలేకరుల సమావేశాలు నిర్వహిస్తుండటంతో ఈ ప్రచారానికి బలం చేకూరుతోంది. ఈనెలాఖరులోగా తెబొగకాసంపై అధిష్ఠానం ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చట్టప్రకారం తెబొగకాసం కార్మికుల ఓట్లతో గెలుపొందడంతో, నేరుగా వెంకట్రావుకు బాధ్యతలు ఏ విధంగా అప్పగిస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. వెంకట్రావురాకను తెబొగకాసంలోని ఒక వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఆయనకు బాధ్యతలు అప్పగించే పక్షంలో ఐఎన్టీయూసీని తెరాసలో విలీనం చేయనున్నట్లు సమాచారం. ఆ సంఘానికి జాతీయ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్న జి.సంజీవరెడ్డి వెంకట్రావు నేతృత్వం వహిస్తున్న సింగరేణి కోల్‌మైన్స్ లేబర్ యూనియన్ (ఎస్సీఎంఎల్యూ)కు పోటీగా, జనక్‌ప్రసాద్ నేతృత్వంలోని స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్‌కు అనుబంధ హోదా కట్టబెట్టడంతో రెండు వర్గాలుగా ఆ యూనియన్ చీలిపోయింది. ఐఎన్టీయూసీకి అనుబంధంగా సింగరేణిలో రెండు సంఘాలు ఎలా కొనసాగుతాయని వెంకట్రావు వర్గం సంజీవరెడ్డిని ప్రశ్నించినట్లు సమాచారం. కాంగ్రెస్‌పార్టీ భావజాలం ఉన్న సంఘం సింగరేణిలో ఉండాలనే పార్టీ కోరికమేరకు జనక్‌ప్రసాద్ వర్గానికి అనుబంధ హోదా కట్టబెట్టినట్లు సంజీవరెడ్డి సమాధానం చెప్పడంతో, ఇంతకాలం సుస్థిరంగా ఉన్న ఎస్సీఎంఎల్యూలో ముసలం మొదలైంది. భవిష్యత్తులో వేజ్‌బోర్డు సభ్యత్వం ఎవరికి కట్టబెడతారనే చర్చ ఐఎన్‌టీయూసీలోని రెండు వర్గాల్లో సాగుతోంది. సంజీవరెడ్డి పొమ్మనలేక పొగబెట్టిన చందంగా వెంకట్రావును సాగనంపేందుకు రెండు వర్గాలను ప్రోత్సహిస్తున్నారనే సంకేతాలు అందుతున్నాయి. సంజీవరెడ్డి ఏ వర్గంవైపో తేల్చుకోవాలని వెంకట్రావు వర్గం అల్టిమేటం జారీ చేస్తూ, ఈనెలాఖరు వరకు గడువు విధించింది. వెంకట్రావు తెరాసలో చేరి, ఐఎన్టీయూసీలో కొనసాగడంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్రుగా ఉన్నారు. వారు సంజీవరెడ్డిపై ఒత్తిడి పెంచడంతో క్రమంగా జనక్‌ప్రసాద్ వర్గం ఐఎన్టీయూసీలో పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఫలితంగా వెంకట్రావు అనివార్యంగా ఐఎన్టీయూసీని వీడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో తెబొగకాసంలో నెలకొన్న అనిశ్చితి ఆయనకు కలిసివచ్చే అంశంగా మారింది. వెంకట్రావు నేతృత్వంలోని ఐఎన్టీయూసీని తెరాసలో విలీనం చేయడం ఒక మార్గంకాగా, ఇప్పుడున్న తెబొగకాసం పేరును మార్చి కొత్త పేరుతో 2016 నాటికి పాత కొత్తల కలయికతో తెరాస అనుబంధ కార్మిక సంఘం తెరపైకి తేవడం మరో మార్గంగా కనిపిస్తోంది. తెబొగకాసంలోని రెండు వర్గాలను పిలిచి, వెంకట్రావు నేతృత్వంలోని ఐఎన్టీయూసీని కలుపుకొని సింగరేణిలో పనిచేయడం నూతన కమిటీలో రెండుగా చీలిన వర్గాలకు ప్రాధాన్యం కల్పించడం మరో ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. పార్టీ నాయకత్వం నియమించిన కమిటీ నివేదికపై తెబొగకాసం భవితవ్యం ఆధారపడి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.2012 జూన్ 28న జరిగిన కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికల్లో తొలిసారిగా తెబొగకాసంకు సింగరేణి కార్మికులు పట్టంగట్టారు. తెలంగాణావాదంతో గెలిచిన మూడు నెలలకే సంఘంలో ఆధిపత్యపోరు మొదలైంది. ఏడాదిలోపే సంఘంలో చీలిక వచ్చింది. హైకోర్టు తీర్పు మేరకు గత ఏడాది ఫిబ్రవరి 23న తెబొగకాసంలోని రెండు వర్గాల కోసం నిర్వహించిన సంస్థాగత ఎన్నికల్లో కార్మికవర్గం మిర్యాల రాజిరెడ్డి వర్గానికి పట్టం కట్టింది. ఆధిపత్య పోరుతో కోర్టుల చుట్టూ తిరగడంతో కార్మికుల నుంచి సభ్యత్వం రూపంలో వసూలైన 91 లక్షలు మిర్యాల రాజిరెడ్డి వర్గానికి అందాయి. వచ్చిన సొమ్మును ఒకేసారి నేతల వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్లించడం, ఆ సొమ్ముతో ఇద్దరు అగ్రనేతలు సంఘం పేరిట రెండు వాహనాలు కొనుగోలు చేయడం జరిగాయి. కార్మికుల సొమ్మును ఇష్టారాజ్యంగా వాడుకున్నారని, వ్యక్తిగత ఖాతాల్లో జమచేయడం చట్టవిరుద్ధమని ఆరోపిస్తూ ప్రత్యర్థివర్గం కోర్టును ఆశ్రయించింది. కోర్టు జోక్యంతో కొత్తగూడెం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ)లోసి సెక్షన్ 420, 406, 120బీ, 409, 477ఏ కింద మిర్యాల రాజిరెడ్డి, ఆకునూరి కనకరాజు, వై.సారంగపాణిలపై కేసు పెట్టారు. నిధుల దుర్వినియోగం జరిగిందని కొత్తగూడెం ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేటు తీర్పు నిచ్చారు. నాయకులపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో తెరాస ప్రతిష్ఠ మసకబారిందనే ఉద్దేశంతో తెబొగకాసంలో సంస్కరణలకు అధిష్ఠానం శ్రీకారం చుట్టింది.