-విద్యుత్ సంస్కరణల సమయంలో అక్రమంగా తిష్ఠ వేశారు.. -మీడియా సమావేశంలో టీఈఈఏ నేత శివాజీ హైదరాబాద్ : విద్యుత్ సంస్కరణల సమయంలో తెలంగాణల...
-విద్యుత్ సంస్కరణల సమయంలో అక్రమంగా తిష్ఠ వేశారు..
-మీడియా సమావేశంలో టీఈఈఏ నేత శివాజీ
హైదరాబాద్ : విద్యుత్ సంస్కరణల సమయంలో తెలంగాణలో పోస్టులు లేకపోయినా సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులను అడ్డంగా నియమించుకుని కొంప ముంచారని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్ శివాజీ ఆరోపించారు. పోస్టులు లేకున్నా అక్రమంగా తెలంగాణలో చేరిన 1250 మంది ఉద్యోగులు ఇప్పుడు.. స్థానికత ఆధారంగా ఆంధ్రాకు వెళ్లాలని చెప్తే, ససేమిరా అనడం దుర్మార్గమని మండిపడ్డారు. నిబంధనల ప్రకారం ఆంధ్రాకు కేటాయించిన ఉద్యోగులు అక్కడికి వెళ్లాలని.. ఆ రాష్ట్రం కూడా అంగీకరించాలన్నారు. అంతేకానీ, కొర్రీలు పెడ్తూ.. కోర్టు కేసులు, ఫిర్యాదులతో రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు.
శుక్రవారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో టీఈఈఏ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ సంస్కరణల సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో పనిచేస్తున్న విద్యుత్ ఉద్యోగులు ఎక్కడైనా ఆప్షన్ ఇవ్వొచ్చని ప్రకటించడంతో సీమాంధ్రకు చెందిన వందలమంది ఉద్యోగులు విద్యుత్ సౌధ, ఆ నాటి సీపీడీసీఎల్‌లో పొస్టులు లేకపొయినా పెద్ద సంఖ్యలో చేరడం జరిగిందన్నారు. ఆ రోజు పొస్టులు లేకపోయినా ఇక్కడ తిష్టవేసిన సీమాంధ్ర ఉద్యోగులు.. రాష్ట్రం విడిపొయిన తర్వాత సైతం ఇక్కడే పని చేస్తామని చెప్పడం దారుణమన్నారు. విద్యుత్ సంస్థల్లో ఏ రోజు కూడా రాష్ట్రపతి ఉత్తర్వులు, 610జీవోను అమలు చేయలేదు. దీనిపై ప్రశ్నిస్తే.. కార్పొరేషన్ కాబట్టి అవి వర్తించవని దబాయించారు.
ప్రస్తుతం స్థానికత ఆధారంగా నిబంధనల ప్రకారం ఉద్యోగులను ఆంధ్రాకు విడుదల చేసినా.. దానిని వ్యతిరేకించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. తెలంగాణ విద్యుత్ యాజమాన్యం గైడ్‌లైన్స్‌పై చర్చించకుండా కోర్టుకు వెళ్లిన వారిని ఎట్లా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. టీఈఈఏ ప్రధాన కార్యదర్శి ఎస్ స్వామిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత పునర్విభజన చట్టం 82 ప్రకారమే స్థానికత ఆధారంగా 1250 మందిని గుర్తించి జూన్ 9న జాబితాను విడుదల చేయడం జరిగిందని తెలిపారు. ఆ సమయంలోనే సీమాంధ్రకు బదిలీ అయిన ఉద్యోగులు యాజమాన్యంతో చర్చించకుండానే.. అహంకారంతో కోర్టుకు వెళ్లారని విమర్శించారు.
నిబంధనల ప్రకారమే వ్యవహరించిన యాజమాన్యం ఈ చర్యతో తాడోపేడో తెల్చుకోవడానికి సిద్ధమైందన్నారు. తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ రెండు రాష్ర్టాలు రెండు కండ్లలాంటివని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు ఒక కన్నును పొడుస్తున్నాడని అని విమర్శించారు. సీమాంధ్ర ఉద్యోగులు సైతం నిబంధనల ప్రకారం వ్యవహరించకుండా.. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, గవర్నర్ నరసింహన్‌కు తప్పుడు సమాచారం ఇస్తూ ఫిర్యాదులు చేయడాన్ని తాము ఖండిస్తున్నామన్నారు. సమావేశంలో తెలంగాణ విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీరస్వామి, ప్రధాన కార్యదర్శి అంజయ్య, కోశాధికారి వెంకటేశ్వర్లు, టీఈఈఏ ప్రతినిధులు సమ్మయ్య, బీ మధుసూదన్‌రెడ్డి, లక్ష్మణ్, నీలకంఠం, నరేందర్‌రెడ్డి, రాజేశ్వర్‌రావు, తిరుపతయ్య, యూసుఫ్ పాల్గొన్నారు.