(30 Jun) హేతుబద్ధీకరణ పుణ్యమాఅని జిల్లాలో 863 ఉపాధ్యాయ పోస్టులకు ఎసరు రానుంది. ప్రస్తుతం అదనంగా ఉన్న వీరందరినీ హేతుబద్ధీకరణ పేరిట విద్యార...
(30 Jun) హేతుబద్ధీకరణ పుణ్యమాఅని జిల్లాలో 863 ఉపాధ్యాయ పోస్టులకు ఎసరు రానుంది. ప్రస్తుతం అదనంగా ఉన్న వీరందరినీ హేతుబద్ధీకరణ పేరిట విద్యార్థులు ఎక్కువగా ఉన్నచోటికి తరలిస్తుండటం భవిష్యత్తులో నిరుద్యోగులకు నిరాశను మిగల్చనుంది. హేతుబద్ధీకరణ ఫలితంగా కొత్త పోస్టులు మంజూరయ్యే పరిస్థితి కనిపించక పోవడంతో రాబోయే డీఎస్సీలో పోస్టుల కోతకు దారితీయనుంది. ఈ పరిణామం నిరుద్యోగులకు, సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి కారణమవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. హేతుబద్ధీకరణతో జిల్లాలో 863మంది ఉపాధ్యాయులు తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంటుంది. సంబంధీకుల్లోనూ తమకు కౌన్సెలింగ్లో ఎక్కడ చోటు లభిస్తుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. హేతుబద్ధీకరణ కింద మారిన నిబంధన ప్రకారం విద్యాశాఖ అధికారులు పాఠశాలల్లో విద్యార్థులు లేక అదనంగా ఉపాధ్యాయులు ఉన్న వివరాలను తేల్చారు. ఆయా పాఠశాలల్లో అదనంగా ఉన్న ఉపాధ్యాయులను అవసరం ఉన్న చోటికి తరలించనున్నారు. విభాగాల వారీగా తరలించే ఉపాధ్యాయుల వివరాలు ఇలా ఉన్నాయి. స్కూల్అసిస్టెంట్ గణితంలో 47 మంది, ఫిజిక్స్ (భౌతికశాస్త్రం)లో 70 మంది, బయోసైన్సు (జీవశాస్త్రం)లో 44 మంది, ఆంగ్లంలో 78 మంది, సాంఘికశాస్త్రంలో 46 మంది, ఆయా భాషా మాధ్యమాల్లో 99 మంది ఉండగా, వృత్తివిద్యా ఉపాధ్యాయులు 21మంది ఉన్నారు. అత్యధికంగా ద్వితీయ శ్రేణి ఉపాధ్యాయులు(ఎస్జీటీ)లు 455మంది ఉన్న చోటు నుంచి మరో పాఠశాలకు హేతుబద్ధీకరణలో బదిలీ కానున్నారు. మరో ముగ్గురు పీఎస్ హెచ్ఎంలపైనా తప్పనిసరి బదిలీ వేటు పడనుంది.