(23 Jun) తెలంగాణకు కలిసిరానున్న పదవీ విరమణలు హైదరాబాద్ : రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు జరుగుతున్న రాష్ట్...
(23 Jun) తెలంగాణకు కలిసిరానున్న పదవీ విరమణలు
హైదరాబాద్ : రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు జరుగుతున్న రాష్ట్ర స్థాయి ఉద్యోగుల కేటాయింపుల్లో... ఇప్పటివరకు యువత సహా నడివయసు ఉద్యోగుల్లో ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్‌లో నియమితులయ్యారు. ఇప్పటివరకూ ప్రాథమికంగా కేటాయింపులు జరిపిన శాఖల్లో మొత్తం 10,717 మంది ఉద్యోగులను ఇరు రాష్ర్టాలకు కేటాయించగా, వారిలో 19-30 ఏళ్ల ఉద్యోగుల్లో 604 మంది ఆంధ్రప్రదేశ్ కోటాకు రాగా.. 557 మంది ఉద్యోగులు తెలంగాణ కోటాకు వచ్చారు. అలాగే, 31-40 మధ్య వయసున్న వారిలో 1,089 మందిని ఆంధ్రప్రదేశ్‌కు, 1,017 మందిని తెలంగాణకు.. 41-50 మధ్య వయస్కుల్లో 1,587 మందిని ఆంధ్రప్రదేశ్‌కు, 1,541 మందిని తెలంగాణకు.. 51-60 మధ్య వయసున్న ఉద్యోగులలో 2,364 మందిని ఆంధ్రప్రదేశ్‌కు, 1,958 మందిని తెలంగాణకు కేటాయించారు. ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తి స్థాయిలో జరిగేటప్పటికి.. యువ ఉద్యోగులలో ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్ కోటాలోకే వచ్చే పరిస్థితి ఉంటుందని ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ పరిస్థితి తెలంగాణ రాష్ర్టానికి కలిసి వస్తుందని.. రానున్న సంవత్సరాల్లో ఎంత ఎక్కువగా పదవీ విరమణలు జరిగితే, అంత ఎక్కువ మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయన్న భావన సంబంధిత వర్గాల్లో నెలకొంది.