పశ్చిమ మధ్య బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతోపాటు వీటికి నైరుతి రుతుపవనాలు తోడవడంతో వానలు రాష్ర్టాన...
పశ్చిమ మధ్య బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతోపాటు వీటికి నైరుతి రుతుపవనాలు తోడవడంతో వానలు రాష్ర్టాన్ని ముంచెత్తుతున్నాయి. ఖమ్మం జిల్లాలో ఐదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండగా శనివారం రాత్రి నుంచి ఆదివారం రాత్రి వరకు ఖమ్మంతోపాటు వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవగా, మిగిలిన నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది.
-ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షం
-మిగిలిన ఆరు జిల్లాల్లో మోస్తరు వానలు
-ఉప్పొంగుతున్న వాగులు.. నిండుతున్న జలాశయాలు
-పలుచోట్ల ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేత.. ఉరకలేస్తున్న గోదావరి
-తెగిన రోడ్లు.. వందల ఊళ్లకు రాకపోకలు బంద్
-అత్యధికంగా ఏటూరునాగారంలో 18 సెంమీ వర్షపాతం
ఆదివారం అత్యధికంగా వరంగల్ జిల్లా ఏటూరునాగారం, శాయంపేటల్లో 18 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. ఎడతెరిపిలేకుండా వానలతో వాగులు, వంకలు ఉప్పొంగుతుండగా, కడెం, కొమురం భీం, కిన్నెరసాని, తాలిపేరు ప్రాజెక్టులు నిండుకుండలుగా మారాయి. గోదావరి, ప్రాణహిత, పెన్‌గంగ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి 30 అడులు దాటింది. పలుచోట్ల కాజ్‌వేలు నీట మునగగా, కొన్ని చోట్ల రోడ్లు తెగిపోవడంతో పలు గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ముంపులోనే భద్రాద్రి ఏజెన్సీ: ఖమ్మం జిల్లాలో ఐదురోజులుగా కురుస్తున్న వర్షాలకు భద్రాచలం ఏజెన్సీ పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది.
వాజేడు మండలం గుమ్మడిదొడ్డి, చీకుపల్లి గ్రామలమధ్య ఉన్న చీకుపల్లి కాజ్‌వేపైకి వరదనీరు చేరడంతో రెండు రోజులుగా 25 గ్రామలకు రాకపోకలు నీలిచిపోయాయి. గిరిజనులు నాటుపడవలపై ప్రయాణిస్తున్నారు. భద్రాచలం వద్ద ఆదివారం సాయంత్రం గోదావరి నీటిమట్టం 30 అడుగులు దాటింది. భద్రాచలంలో స్నానఘట్టాలు నీటమునిగాయి. బయ్యారం మండలంలోని మసివాగు, పెద్దవాగు, పందిపంపులవాగు, ఉడుముల వాగు, రాళ్లవాగు, అలిగేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
పాల్వంచ మండలంలోని కిన్నెరసాని ప్రాజెక్టుకు 10 గేట్లను ఎత్తి 35వేల క్యూసెక్కుల నీటిని, కిన్నెరసాని రిజర్వాయర్ 10 గేట్లను ఎత్తి నీటిని బయటకు వదిలారు. మధిర మండలం జాలిముడి ప్రాజెక్టులో పనులు చేపడుతూ వైరా నది వరద ఉధృతిలో చిక్కుకున్న ప్రాజెక్టు నిర్మాణ సైట్ ఇంజినీర్ ప్రవీణ్, సూపర్‌వైజర్ కిరణ్, సైట్‌ఇన్‌చార్జి సోమిరెడ్డిలను అధికారులు కాపాడారు.
వరంగల్ జిల్లా గోవిందరావుపేటలోని గుండ్లవాగు పొంగి పొర్లుతున్నది. గుండ్లవాగుకు బుంగ పడటంతో అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. లక్నవరం, పాకాల సరస్సు నీటిమట్టం గంటగంటకు పెరుగుతున్నది. గణపురంలోని మొరంచవాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రధాన చెరువులన్నీ నిండిపోయాయి. రామన్నగూడెం వద్ద గోదావరిలో పుష్కరఘాట్ వరకు నీరు చేరుకుంది. జిల్లావ్యాప్తంగా 100 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
ప్రాజెక్టులకు భారీ వరద: ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్ ప్రాంతంలో ఏజెన్సీ ఏరియాల్లో రవాణా సౌకర్యాలు బంద్ అయ్యాయి. ఆసిఫాబాద్‌లోని కొమురం భీం ప్రాజెక్టు ఎత్తు 243 అడుగులు కాగా 239.4 అడుగులకు చేరడంతో ఐదు గేట్లు ఎత్తి 19 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కడెం ప్రాజెక్టు 700 అడుగుల సామర్థ్యం కాగా, ప్రస్తుతం 679.325 అడుగులకు చేరుకుంది. 25 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. ఆసిఫాబాద్ ప్రాంతంలో వట్టి వాగు ప్రాజెక్టు సామర్థ్యం 239.5 మీటర్లు కాగా 231.15 మీటర్లకు చేరుకుంది.
స్వర్ణ, సాత్నాల, సదర్‌మట్, ఎన్‌టీఆర్ ప్రాజెక్టులు సైతం జలకలను సంతరించుకున్నాయి. జిల్లాలో 84.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. దహెగాం మండలంలో ఎర్రవాగు, బెజ్జూర్ మండలంలో కుశ్నపల్లి వాగు, వేమనపల్లి మండలం గొర్లపల్లి వద్ద వాగు పొంగడంతో 54 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. కరీంనగర్ జిల్లా మహాదేవపూర్, మహాముత్తారం మండలాల్లోని దాదాపు 40కిపైగా గ్రామాలు రెండు రోజులుగా జలదిగ్బంధంలో ఉన్నాయి. మంథని డివిజన్‌లో ఆదివారం 110.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
హుజురాబాద్, జగిత్యాల, పెద్దపల్లి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. మెదక్ జిల్లాలో 6.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా నంగునూర్‌లో 32.6 మి.మీటర్ల వర్షం పడింది. సిద్దిపేట డివిజన్‌లో 13.8, మెదక్ డివిజన్‌లో 5.4, సంగారెడ్డి డివిజన్‌లో 1.6 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. నిజామాబాద్ జిల్లాలో 13.5 మి.మీ వర్షపాతం నమోదైంది.
తెలంగాణ వరప్రదాయిని ఎస్సారెస్పీలోకి 2వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతున్నది. నల్లగొండ జిల్లాలో సాధారణ వర్షపాతం 69.6మి.మీ. కాగా, ఇప్పటి వరకు 172.6మి.మీ. వర్షం కురిసి 148శాతం అధికంగా నమోదైంది. ఆదివారం జిల్లా వ్యాప్తంగా 58మండలాల్లో వర్షం కురిసింది. హైదరాబాద్‌లో ఆదివారం 8.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
-ఆనందోత్సాహాల్లో రైతాంగం
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: వర్షాలు విస్తారంగా కురుస్తుండటం, వర్షపాతం సాధారణ స్థాయి కంటే ఎక్కువ నమోదవుతుండటంతో రైతాంగంలో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. డిమాండ్‌కు అనుగుణంగా రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు సరఫరా చేసేందుకు వ్యవసాయ శాఖ సిద్ధమైంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 10లక్షలకు పైగా ఎకరాల్లో విత్తనాలు నాటారు.
ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి రాష్ర్టానికి జూన్ నెలకు లక్షా 20వేల టన్నుల ఎరువుల కేటాయించగా, ఇప్పటివరకు 60వేల టన్నుల ఎరువులు దిగుమతి అయ్యాయి. మిగిలిన 60వేల టన్నుల ఎరువులను సకాలంలో అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర వ్యవసాయశాఖను కోరింది. ఇతర రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణ వ్యవసాయాధికారులు బాగా పనిచేస్తున్నారని కేంద్రం నుంచి ప్రశంసలు కూడా అందాయి. మరోవైపు నిర్ధేశించిన గడువులోగా అన్ని రాష్ర్టాలకు ఎరువులను సకాలంలో సరఫరా చేయని కంపెనీలపై చర్యలు తీసుకునేందుకు కేంద్రం సిద్ధమైంది.
-48 గంటలు భారీ నుంచి అతి భారీ వర్షాలు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రానున్న 48 గంటల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. ఒడిశాలోని పూరీ-గోపాల్‌పూర్ మధ్య తీరం దాటిన వాయుగుండం బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారినట్లు హైదరాబాలోని వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఇది తెలంగాణలోని ఆరు జిల్లాలపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు. గడిచిన 24 గంటల్లో వరంగల్ జిల్లా ఏటూరునాగారం, శాయంపేటల్లో 18 సెంటీమీటర్ల చొప్పున, ఖానాపూర్, గుండాల, పరకాల,
గూడూరులో 17, ఖమ్మం జిల్లా వెంకటాపురంలో 16, పాల్వంచలో 14, పినపాకలో 13, వరంగల్ జిల్లా వెంకటాపూర్, చెన్నాపూర్‌లో 16, గోవిందరావుపేటలో 15, కాలేశ్వరంలో 15, మహబూబాబాద్, భూపాలపల్లిలో 13,రామగుండం, ఆదిలాబాద్, చెన్నూరులో 11, బయ్యారం, టేకులపల్లి, దుమ్ముగూడెం, కొత్తగూడెం, అసన్‌పర్తి, హుజూరాబాద్, సుల్తానాబాద్‌ల్లో 10, పెద్దపల్లిలో 8, ఇబ్రహీంపట్నంలో 6, నిజామాబాద్ జిల్లా గంగాధర, కమ్మర్‌పల్లిలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.