హోటళ్లు, కార్లకు అక్రమంగా సరఫరా దాడులు జరిగినా ఆగని వైనం మంచిర్యాల: జిల్లాలోని గ్యాస్ దందా మూడుపువ్వులు ఆరుకాయలుగా సాగు తుంది. విని య...
హోటళ్లు, కార్లకు అక్రమంగా సరఫరా
దాడులు జరిగినా ఆగని వైనం
మంచిర్యాల: జిల్లాలోని గ్యాస్ దందా మూడుపువ్వులు ఆరుకాయలుగా సాగు తుంది. విని యోగదారులు గ్యాస్ బుక్ చేస్తే నిరీక్షణ తప్పడం లేదు. ఏజెన్సీల నిర్వాహకులు రేపుమాపు అంటూ తిప్పించుకుంటున్నారు. వంట చేసుకోవడానికి కూడా గ్యాస్ దొరకడం లేదంటే పదిస్థితి అర్థం చేసుకోవచ్చు. కానీ అక్రమంగా దుకాణాల్లో గ్యాస్ సిలిండర్లు అమ్మే వారి వద్దకు వేళ్తే ఐదు నిమిషాల్లోనే గ్యాస్ లభిస్తుంది. కార్లు, హోటళ్లు, చిరు వ్యాపారులకు మాత్రం సబ్సిడీ సిలిండర్లు ఎప్పుడంటే అప్పుడు అందుబాటులో ఉంటున్నాయి. సివిల్ సప్లయ్ విజిలెన్స్ అధికారులు అడపాదడపా దాడులు చేస్తూ కేసులు నమోదు చేస్తున్నారే తప్పా చర్యలు తీసుకోవడం లేదనే అరోపణలు ఉన్నాయి.
ఇలా పక్కదారి:
జిల్లాలోని 52 మండలాల్లో 3.63.718 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. సరఫరా సమయంలో దొరికిన అవకాశాన్ని అదునుగా తీసుకోవడంతో ఈ తతంగం కొనసాగుతోంది. డోర్‌లాక్ లాంటి వాటి విషయాలను దళారులు తమకణుగుణంగా మార్చుకుంటున్నారు.ఇందులో సరఫరా సమయంలో అవకాశం లభించడంతో అవకాశాన్ని డ్వాక్రా గ్రూపు, డోర్‌లాక్ ఉన్న వినియోగదారుల సిలిండర్లు వక్రమార్గం పట్టిస్తున్నారు. కొంతమంది వ్యాపారుల గూటికి సిలిండర్లు చేరుతున్నాయి. అడిగిన వెంటనే అక్రమ వ్యాపారులు సిలిండర్‌ను ఇస్తున్నారు. మంచిర్యా లలో సుమారు 15 మంది వరకు ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా చిన్నచిన్న సిలిండర్లలో సబ్సిడీ గ్యాస్‌ను నింపుతూ పెద్దఎత్తున వ్యాపారం సాగిస్తున్నారు. హోటళ్లు, బార్‌షాపులు, రహదారుల పక్కన చిరు వ్యాపారులు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ల్ల నిర్వాహకులు సబ్సిడీ సిలిండర్లనే వాడుతున్నారు. ఎందుకంటే కమర్షియల్ సిలిండర్ ధర గిట్టుబాటు అయ్యేలా కనబడకపోవడంతో చిరు వ్యాపారులు ఆర్థికంగా కలిసి వస్తుందని సబ్సిడీ సిలిండర్ల బాటపట్టారు. వారానికి రెండు సిలిండర్ల వరకు అవసరమయ్యే వ్యాపారులకు డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. సబ్సిడీ సిలిండర్లు వినియోగిస్తున్న వ్యాపారులపై విజిలెన్స్ అధికారులు దాడులు చేస్తుండడంతో వ్యాపారస్థులు అప్రమత్తమయ్యారు. ప్రత్యేక పరికరం ద్వారా కమర్షియల్ సిలిండర్లోనికి సబ్సిడీ సిలిండర్‌ను నింపుతారు. పైకిచూస్తే కమర్షియల్ సిలిండర్ వాడుతున్నట్లుగా ఉంటుంది. కానీ అందులో గ్యాస్ మాత్రం సబ్సిడీదే ఉంటుంది. వ్యాపారులు ఆ రకంగా ప్రభుత్వ అధికారులను బురిడీ కొట్టిస్తున్నారు.
కార్లలో సబ్సిడీ గ్యాస్:
పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరగడంతో కార్ల యజమానులు గ్యాస్ కిట్లను వాడుతున్నారు. పెట్రోల్, డీజిల్ కంటే గ్యాస్ వాడకం చౌకగా ఉండడంతో ఈ మధ్యకాలంలో కార్ల యజమానులు గ్యాస్కిట్లను అమర్చుకుంటున్నారు. ఒక్క సిలిండర్ 300 కిలోమీటర్ వరకు వస్తుంది. దాంతో సబ్సిడీ సిలిండర్ల కోసం కార్ల యజమానులు పరుగులు తీస్తున్నారు. గతంలో రూ 600లకే కార్ల గ్యారేజి నిర్వాహకులు నింపేవారు ప్రస్తుతం, సబ్సిడీ తదితరాల కారణంగా ఈ ధర కూడా పెంచారు. అయితే కొంతమంది గ్యారేజీ నిర్వాహకులు వ్యాపా రానికి చరమగీతం పాడగా మరికొందరు మాత్రం దర్జాగా కొనసాగిస్తున్నారు. సిలిండర్ తీసుకెళ్తే ప్రత్యేక పరికరంతో గ్యాస్‌ను కార్లలోని కిట్లలో నింపుతున్నారు. ప్రతి ప్రధాన పట్లణాల్లో సిలిండర్లు లభిస్తుండటంతో కార్ల యజమానులు పెట్రోల్, డీజిల్ కంటే గ్యాస్‌నే నమ్ముకుంటున్నారు. ఇలా సబ్సిడీ గ్యాస్ పక్కదారి పడుతుండగా అధికారులు మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు. దాడులు చేసిన సమయంలో ఒకటి, రెండు రోజులు కమర్షియల్ సిలిండర్లు వాడుతున్నప్పటికి ఆ తర్వాత షరామామూలుగానే మారింది. ముఖ్యంగా రెస్టారెంట్లు, ప్రధాన హోటళ్లలో సబ్సిడీ సిలిండర్ల వినిమోగం ఎక్కువగానే జరుగుతుంది. వాటిపై సివిల్ సప్లయ్ విజిలెన్స్ అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతో ఉంది.