బొల్లారంలో పదిరోజుల విడిది 1న తిరుమలకు వెళ్లనున్న ప్రణబ్ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తొలిసారి రాష్ట్రపతి ప్ర...
- బొల్లారంలో పదిరోజుల విడిది
- 1న తిరుమలకు వెళ్లనున్న ప్రణబ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తొలిసారి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్ వస్తున్నారు. పదిరోజుల దక్షిణాది వర్షాకాల విడిదిలో భాగంగా ప్రణబ్ ముఖర్జీ సోమవారం మధ్యాహ్నం 2:05కు ప్రత్యేక విమానంలో హకీంపేట ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్తారు. గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌లు రాష్ట్రపతికి స్వాగతం పలకనున్నారు. 3న జరిగే హరితహారం ప్రారంభోత్సవం, ఇతర కార్యక్రమాలకు రావాలని సీఎం ఈ సందర్భంగా రాష్ట్రపతిని ఆహ్వానించనున్నారు. బుధవారం రాష్ట్రపతి తిరుమల వెళ్తారు. వచ్చేనెల 3న మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు రచించిన 'ఉనికి' పుస్తకాన్ని ఆయన హైదరాబాద్‌లో ఆవిష్కరిస్తారు. జులై 6న బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో 'నక్షత్ర వాటిక'ను ప్రణబ్ ప్రారంభిస్తారు. ఇంకా మరికొన్ని కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. రాష్ట్రపతి రాకపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి సైతం సమాచారం పంపించారు. అందుబాటులో ఉంటే ఆయన కూడా స్వాగత కార్యక్రమానికి హాజరయ్యే అవకాశమున్నట్లు తెలిసింది. రాష్ట్రపతి వాహనశ్రేణి రాకకు సంబంధించి ఇప్పటికే అధికారులు సన్నాహక చర్యలు (రిహార్సల్) పూర్తిచేశారు. వాహనశ్రేణి రాజీవ్ రహదారి, బొల్లారం చెక్‌పోస్టు చౌరస్తా, ఆర్మీగోల్ఫ్ స్డేడియం, రక్షణ శాఖ స్థలాల మీదుగా రాష్ట్రపతి నిలయంలోకి వెళుతుంది. రహదారికి ఇరువైపులా ఉన్న నివాసాలపై ఇప్పటికే పోలీసు అధికారులు గట్టి నిఘాను ఏర్పాటు చేశారు. నిలయం పరిసరాల కాలనీల్లో, రహదారులపై ఆంక్షలు విధించారు. కూడళ్లలో, నిలయానికి చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. గుర్తింపు కార్డులు ఉంటేనే ఆ మార్గం మీదుగా వెళ్లేందుకు అనుమతిస్తున్నారు. ఆదివారం పోలీసు, ఇతర ఉన్నతాధికారులు రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించి ఏర్పాట్లు పర్యవేక్షించారు.1న తిరుమల పర్యటనతిరుమల, న్యూస్‌టుడే: రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ వచ్చే నెల 1న తిరుమలకు రానున్నారు. ఆ పర్యటన ఏర్పాట్లను తితిదేతో పాటు చిత్తూరు జిల్లా అధికార యంత్రాంగం పూర్తి చేసింది. ఇప్పటివరకు అధికారిక నిర్ణయం మేరకు రాష్ట్రపతి ముందుగా తిరుచానూరుకు వెళ్లి పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం తిరుమలకు చేరుకుని మొదటగా శ్రీవరాహస్వామివారిని దర్శించుకుని శ్రీవారి ఆలయానికి చేరుకుంటారు. అనంతరం పద్మావతి విశ్రాంతి సముదాయానికి చేరుకుని విశ్రాంతి తీసుకుని సాయంత్రం 4 గంటలకు తిరుగు ప్రయాణం అవుతారు.