(30 Jun) నగరానికి చేరుకున్న రాష్ట్రపతి.. సాదర స్వాగతం పలికిన సర్కారు హైదరాబాద్, జూన్ 29: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్...
(30 Jun)
- నగరానికి చేరుకున్న రాష్ట్రపతి..
- సాదర స్వాగతం పలికిన సర్కారు
హైదరాబాద్, జూన్ 29: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్ చేరుకున్నారు. పది రోజులపాటు ఆయన ఇక్కడే విశ్రాంతి తీసుకోనున్నారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన బోయింగ్ బిజినెస్ జెట్ (బీబీజే)లో సోమవారం మధ్యాహ్నం 2.05 గంటలకు ఆయన హకీంపేట ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు చేరుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆయనకు సాదరంగా స్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా విమానం దగ్గరకే వెళ్లారు. అక్కడే కేసీఆర్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పాదాభివందనం చేశారు. వినమ్రంగా రాష్ట్రపతి కాళ్లకు మొక్కారు. చిరు దరహాసంతో రాష్ట్రపతి ఆయనను దీవించారు. అక్కడి నుంచి ప్రత్యేక టెంటు వరకు రాష్ట్రపతిని కేసీఆర్ తోడ్కొని వచ్చారు. గవర్నర్ నరసింహన్ కూడా వారి వెంట ఉన్నారు. అనంతరం స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, సీఎస్ రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మలతోపాటు ఎంపీ కవిత, మంత్రులను ప్రణబ్‌కు సీఎం కేసీఆర్ పరిచయం చేశారు. రాష్ట్రపతి ఒక్క నిమిషంపాటు తెలంగాణ ప్రజా ప్రతినిధులతో గడిపారు. వాస్తవానికి, రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో మధ్యాహ్నం 1.30 గంటలకే సీఎం కేసీఆర్ హకీంపేటకు చేరుకున్నారు. ప్రణబ్ రాక కోసం వేచి చూశారు. అక్కడ సైనిక, రాష్ట్రపతి భవన్, తెలంగాణ ప్రభుత్వ అధికారులతో మాట్లాడారు. పది రోజులపాటు రాష్ట్రపతి మకాం చేయనుండటంతో అతిథి మర్యాదలకు ఏ లోటూ రానీయవద్దని ఆయన స్పష్టం చేశారు. మొత్తంమీద ఐదు నిమిషాలపాటు ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో ఉన్న రాష్ట్రపతి అక్కడి నుంచి బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌కు చేరుకొని విశ్రాంతికి ఉపక్రమించారు. నేడు గవర్నర్, 7న రాష్ట్రపతి విందు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి గవర్నర్ నరసింహన్ మంగళవారం రాత్రి 8 గంటలకు రాజ్‌భవన్‌లో విందు ఇవ్వనున్నారు. దీనికి ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్, రెండు రాషా్ట్రల మంత్రివర్గ సహచరులు, సీఎ్‌సలు, డీజీపీలు హాజరుకానున్నారు. కాగా, ఇరు రాషా్ట్రల సీఎంలు, గవర్నర్‌కు జూలై 7వ తేదీన రాష్ట్రపతి విందు ఇవ్వనున్నారు. బుధవారం ఆయన తిరుమలలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. ఉదయం 9.20 గంటలకు బయలుదేరి.. దర్శనం చేసుకొని, పద్మావతి గెస్ట్‌హౌ్‌సలో బస చేస్తారు. ఈ మేరకు తిరుమలలో కట్టుదిట్టమైన భద్రతాఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, హకీంపేట వస్తుండగా కౌకూర్ చౌరస్తా వద్ద పోలీసులు ఎమ్మెల్యే బాబూమోహన్ ఇన్నోవాను నిలిపి వేశారు. తాను రాష్ట్రపతికి స్వాగతం చెప్పడానికి వెళుతున్నానని చెప్పినా వినలేదు. అప్పటికే రాష్ట్రపతి కాన్వాయ్ వస్తోందని పోలీసులు చెప్పారు. దాంతో బాబూమోహన్ రోడ్డుపైనే కారులోనే ఉండిపోయారు. ప్రతిపక్షాలకు ఆహ్వానమేదీ?: పొంగులేటి రాష్ట్రపతికి ఆహ్వానం పలికే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా టీఆర్‌ఎస్ కార్యక్రమంగా నిర్వహించిందని కాంగ్రెస్ నేత పి.సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. ప్రొటోకాల్ ప్రకారం శాసనసభ, మండలిలో విపక్ష నేతలకు ఆహ్వానం పంపాలని, కానీ, సీఎం కేసీఆర్, మంత్రులు, టీఆర్‌ఎస్ నేతలే వెళ్లారని, అదేమన్నా టీఆర్‌ఎస్ పార్టీ కార్యక్రమమా అని నిలదీశారు. దీనిపై ఉభయ సభల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. ప్రణబ్ జీ.. అపాయింట్‌మెంట్ ఇవ్వండి: రఘువీరా రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న పరిస్థితులను, టీడీపీ ప్రభుత్వ పాలనలో ఎదురువుతోన్న సమస్యలను వివరించేందుకు వీలుగా తమకు సమయం కేటాయించాలని కోరుతూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరా రెడ్డి లేఖ రాశారు. హైదరాబాద్‌లో విడిదిలో ఉన్న రాష్ట్రపతికి ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు తమకు అపాయింట్‌మెంట్ ఇవ్వాలని ఆయన అభ్యర్థించారు