బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా తూర్పు డివిజన్లో కురుస్తున్న వర్షం ఆదివారం కాస్త తగ్గు ముఖంపట్టింది. కానీ తుంపర తుంపరగా కురుస్త...
పెద్దంపేట వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పెద్దంపేట, లెంకలగడ్డ, సర్వాయిపేట, పంకెన, పలిమెల, నీలంపల్లి, ముకునూరు, బోడాయిగూడెం, తిప్పాయిగూడెం, మోదేడు గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. మహాముత్తారం మండలంలో పెద్దవాగు పొంగిపొర్లడంతో మూడు రోజులుగా పెగడపల్లి, బోర్లగూడెం, రేగులగూడెం, సింగారం, నర్సింగాపూర్, కంపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దౌతుపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో కాటారం-మహాముత్తారం, యామన్‌పల్లి గ్రామాల మధ్య సంబంధాలు తెగిపోయాయి. సింగంపల్లి వాగువల్ల నిమ్మగూడెం, కనుకునూరు, రెడ్డిపల్లి, యత్నారం గ్రామాలకు రవాణా నిలిచిపోయింది. వర్షం ధాటికి మల్హర్ మండలం తాడిచర్ల గ్రామంలో కొల్పూరి పోచయ్యకు చెందిన, కాటారం మండలం బూడిదిపల్లిలో మంథని రాజయ్యకు చెందిన ఇళ్లు నేల మట్టమయ్యాయి. కాటారం మండలం గోపాల్‌పూర్‌కు వెళ్లే రహదారి వరద నీటితో పలు చోట్ల కోతకు గురైంది. ప్రాణహిత నది కాళేశ్వరం వద్ద ఉధృతంగా ప్రవహిస్తూ గోదావరిలో కలుస్తుండడంతో కాళేశ్వరం వద్ద మెట్ల వరకూ గోదావరి నీరు ప్రవహిస్తున్నది. మంథని బొక్కలవాగు, గోదావరి, మానేరు నదుల్లో వరద నీటి ప్రవాహం పెరుగుతూ వస్తున్నది.
పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా, పెట్రోల్‌బంక్ చౌరస్తా, దుబ్బగూడెం జలమయమయ్యాయి. ఆర్అండ్బీ, తహసీల్దార్, మండల విద్యా వనరుల కేంద్రంలో వర్షపు నీరు ప్రవహిస్తున్నది. బస్టాండ్ జలమయంకావడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. డివిజన్లోని మహాముత్తారం, మహదేవపూర్ మండలంలోని దాదాపు 50 వరకు లోతట్టు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో అక్కడ ఎలాంటి అనారోగ్యం సంభవించినా ప్రమాదపుటంచుల్లో వాగులు, వంకలు దాటి ఇటు మహాదేవపూర్, కాటారం, వరంగల్ జిల్లా ఏటూరు నాగారానికి చేరుకోవాల్సి ఉంటుంది.
లోతట్టు గ్రామాలకు సరుకులు: ఆర్డీఓ
మహాదేవపూర్, మహాముత్తారం మండలంలోని వరద ప్రభావిత లోతట్టు గ్రామాలకు నిత్యావసర సరుకులను ఇప్పటికే చేరవేశామని మంథని ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ నెల ఆరంభంలోనే జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌కు సంబంధించి పంపిణీ చేయాల్సిన రేషన్ సరుకులు, మందులు, ఇతర వస్తువులను చేర్చినట్లు చెప్పారు. వైద్య సిబ్బంది వద్ద అదనపు మందులు ఉంచామన్నారు.
పొంగిన వాగులు, వంకలు
మహాముత్తారం: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షాలకు జనజీవనం అతలాకుతలమైంది. మండల కేంద్రానికి సమీపంలోని కోనంపేటవాగు, యామన్‌పల్లి, దౌతుపల్లి గ్రామాల మధ్య అలుగు వాగు, పెగడపల్లి కేశవాపూర్ గ్రామాల మధ్య పెద్ద వాగు, సింగంపల్లి వద్ద పెద్దవాగు పొంగి పొర్లుతున్నాయి. మండలంలోని కనుకునూర్, రెడ్డిపల్లి, సింగంపల్లి తదితర గ్రామాలకు మండలకేంద్రంతో సంబంధాలు తెగిపోయాయి. విద్యుత్ సౌకర్యం నిలిచిపోయి, అటవీ గ్రామాలు అంధకారంలో మగ్గుతున్నాయి. మహాముత్తారం, బోర్లగూడెం, పెగడపల్లి, మీనాజీపేట, రేగులగూడెం, గండికామారం, కనుకునూర్, యామన్‌పల్లి, జీలపల్లి, స్తంభంపల్లి(పీపీ), పోలారం, కొర్లకుంట పంచాయతీల పరిధి గ్రామాల్లోని ఇళ్లల్లో నీరుచేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని ఆయా గ్రామాల్లో వర్షపు నీటి తాకిడి చాలా గ్రామాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. మహాముత్తారంలో గట్టు లక్ష్మీనారాయణ, వాసంపల్లి లచ్చయ్యకు చెందిన ఇంటి గోడలు కూలిపోయాయి.