-కోయంబత్తూరులో ఘటన న్యూఢిల్లీ, జూన్ 16: నెస్లే కంపెనీ ఉత్పత్తి చేసే మ్యాగీ నూడుల్స్‌లో హానికరమైన సీసం, ఇతర రసాయనాలున్నాయని దేశవ్యాప్తం...
-కోయంబత్తూరులో ఘటన
న్యూఢిల్లీ, జూన్ 16: నెస్లే కంపెనీ ఉత్పత్తి చేసే మ్యాగీ నూడుల్స్‌లో హానికరమైన సీసం, ఇతర రసాయనాలున్నాయని దేశవ్యాప్తంగా ఓ పక్క దుమారం రేగుతుంటే ఆ సంస్థ తయారు చేసే సెరిలాక్ బేబీ ఫుడ్ పౌడర్‌లో సజీవంగా ఉన్న పురుగులు బయటపడ్డాయి. ఒకటిన్నర సంవత్సరాల తన కుమారుడికి ఆహారం అందించడానికి కొనుగోలు చేసిన ఈ ప్యాకెట్లో పురుగులు తిరుగుతుండటం కోయబత్తూరుకు చెందిన ఐటీ ఉద్యోగిని షాక్ గురిచేసింది. కేరళలోని పెరూర్లోని మెడికల్ షాప్ నుంచి శ్రీరాం అనే వినియోగదారుడు నెస్లే సెరిలాక్ ప్యాకెట్‌ను కొనుగోలు చేశాడని, ఆయన భార్య దానిని ఓపెన్ చేయగా గోధుమ, పాల మిశ్రమం పౌడర్‌లో ఎర్రటి రంగులో ఉన్న పురుగులు కనిపించాయని తమిళ పత్రిక వికటన్ తన కథనంలో పేర్కొన్నది. ఈ ఘటనపై నెస్లే కస్టమర్ కేర్ సెంటర్లో ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించగా వారు సరిగా స్పందించలేదని, దాంతో ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశానని బాధితుడు శ్రీరాం మీడియాకు వివరించారు. శ్రీరాం నుంచి ఫిర్యాదు స్వీకరించామని, ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారి కాతీరవన్ పేర్కొన్నారు. వారం కిందట కోయంబత్తూరులోనే నెస్లే నాన్ ప్రో 3 పాలపౌడర్ ప్యాకెట్లో సజీవంగా ఉన్న లార్వా కీటకాన్ని గుర్తించారు. ఎంఎస్‌జీ కలుపలేదు అనే సందేశాన్ని తొలగిస్తాం: ఐటీసీ కేంద్ర ఆహార భద్రతా పర్యవేక్షణ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశాల మేరకు మోనోసోడియం గ్లుటామేట్ (ఎంఎస్‌జీ) అనే రసాయనాన్ని కలుపడం లేదు అనే సందేశాన్ని తొలగించాలని ఐటీసీ కంపెనీ నిర్ణయించింది. తాము తయారుచేస్తున్న సన్‌ఫీస్ట్ యిప్పీ బ్రాండ్ ఇన్స్టంట్ నూడుల్స్‌పై ఈ సందేశాన్ని తొలగిస్తామని తెలిపింది. ఒకవేళ ఉత్పత్తిదారుడు తమ ఉత్పత్తుల్లో ఎంఎస్‌జీని కలిపితే తప్ప అలాంటి సందేశాన్ని ప్రత్యేకంగా ప్రకటించాలని ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ చట్టంలో ఉన్నదన్న విషయాన్ని ఈ సందర్భంగా పేర్కొన్నది.