ఆశించిన స్థాయిలో నీళ్లు రాకపోతే జిల్లాలో గోదావరిలో పుష్కర స్నానాలు ఆచరించడానికి అవకాశాలు అంతంత మాత్రమే కానున్నాయి. ప్రస్తుతానికి నీరులేక ...
ఆశించిన స్థాయిలో నీళ్లు రాకపోతే జిల్లాలో గోదావరిలో పుష్కర స్నానాలు ఆచరించడానికి అవకాశాలు అంతంత మాత్రమే కానున్నాయి. ప్రస్తుతానికి నీరులేక నది బోసిపోతూ కనిపిస్తోంది. గతేడాది వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ పరిస్థితి తలెత్తింది. మరో నెల రోజుల్లో గోదావరి పుష్కర ఉత్సవాలు ప్రారంభమవుతాయి. జిల్లాలో మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నా గోదావరి నదిలోకి ఇంకా నీరు రాలేదు. ఎగువ ప్రాంతమైన మహారాష్ట్రలో వర్షాలు లేకపోవడమే ఇందుకు కారణం. జులై 14 నుంచి 25 వరకు జరిగే ఈ పుష్కరాల వరకైనా తల్లి గోదారి కరుణ చూపాలంటూ భక్తులు ప్రార్థిిస్తున్నారు. రుతు పవనాలు ప్రవేశించి వర్షాలు పడుతున్నా ఆ సారి వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఒకవేళ పరిస్థితులు అనుకూలించకపోతే ఏం చేయాలనే దానిపై అధికారులు కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించారు.జిల్లాలో బాసరలో గోదావరి నది ప్రవేశిస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో 34 పుష్కరఘాట్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఎక్కడి భక్తులు అక్కడే పుష్కర పుణ్యస్నానాలు ఆచరించడానికి ఎక్కువ పుష్కరఘాట్ల నిర్మిస్తున్నారు. అంతటా పనులు ప్రారంభం కావడంతో పుష్కర సందడి నెలకొంది. నెల రోజుల (జులై 14) ప్రారంభం కానున్న నేపథ్యంలో పుణ్య స్నానాలు చేసేందుకు నదిలో నీరు ఉంటుందో.. లేదోననే విషయమే అంతటా చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో దిగువ ప్రాంతమైన ఖానాపూర్, జన్నారం, ద్వారక, మంచిర్యాల, చెన్నూరు, వేలాల తదితర ప్రాంతాల్లో ప్రవహించే గోదావరి నదిలో చుక్క నీరు లేక బోసిపోతూ కనిపిస్తోంది. పుష్కరాలు ప్రారంభమయ్యే వరకు నీరొస్తుందని భక్తులు భావిస్తున్నారు.గోదావరి నది ఎగువ ప్రాంతమైన బాసర మినహాయిస్తే లోకేశ్వరం మండలంలోని బ్రహ్మేశ్వరం, దిలావర్పూర్ మండలం టెంబుర్ణి, సాంగ్వి, నిర్మల్ మండలం సోన్, లక్ష్మణచాంద మండలం కూచన్‌పెల్లి, మునిపెల్లి, పీచర, ధర్మారం, పార్పెల్లి, చింతల్‌చాంద, మామడ మండలం కమల్‌కోట్ గోదావరి పరివాహక ప్రాంతంలో నీరుంది. ఇక్కడ లోతు ఎక్కువగా ఉండటం వల్ల నీరు నిలిచి ఉంది. దిలావర్పూర్ మండలం టెంబుర్ణి, సాంగ్వి పుష్కరఘాట్లకు కొద్ది దూరంలోనే శ్రీరాంసాగర్ జలాశయం వెనుక జలాలు (బ్యాక్‌వాటర్) ఉన్నాయి. సోన్ మాదాపూర్, మామడ మండలం పొన్కల్ పుష్కరఘాట్లకు కొద్ది దూరంలో ఆశించినంత మేరకు నీరుంది. నెల రోజుల వరకు వర్షాలు కురవకపోతే ఆ నీటిని పుష్కరఘాట్ల వరకు కాలువ ద్వారా మళ్లించేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు.దక్షిణ భారతదేశంలో సరస్వతిమాత కొలువుదీరిన క్షేత్రం బాసర. ప్రస్తుత ఇక్కడ పుష్కరఘాట్ల వద్ద నీరు లేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో ఈ సారి బాసరలో పుష్కరస్నానం ఆచరించేందుకు 50 లక్షల వరకు భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ప్రభుత్వం కూడా అందుకుతగ్గ ఏర్పాట్లు చేస్తోంది. ఏకంగా 600 మీటర్ల పొడవు పుష్కరఘాట్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రహదారుల వెడల్పు పనులు పూర్తవుతున్నాయి. అయితే ఎగువ ప్రాంతమైన మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిస్తేనే బాబ్లీ జలాశయం నిండి గోదావరి నదిలోకి నీరు వచ్చే అవకాశం ఉంది. మహారాష్ట్రలో వరుణుడు కరుణిస్తే పుష్కరస్నానాలకు ఇబ్బందులు తలెత్తవు.నిర్మల్‌కు 15 కిలోమీటర్ల దూరంలో గోదావరినదిపై శ్రీరాంసాగర్ జలాశయం నిర్మించారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని గోదావరి నదిలో పుష్కరస్నానం ఆచరించడానికి ముందస్తుగా అధికారులు జలాయశంలో నాలుగు టీఎంసీల నీటిని నిల్వ ఉంచారు. రబీలో వారబందీ పద్దతిని నీటిని విడుదల చేసినా.. పుష్కర సమయానికి వర్షాలు కురియకుంటే ఈ జలాశయంలో నిల్వ చేసిన నాలుగు టీఎంసీల నీటిని దిగువకు వదులుతారు. ఈ జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు (90 టీఎంసీలు) ఉండగా ప్రస్తుతం 1057.60 అడుగులు (11 టీఎంసీల) నీరు ఉంది.2003లో జులై 30 నుంచి ఆగస్టు 10 వరకు గోదావరి పుష్కరాలు జరిగాయి. ఆ సమయంలోనూ తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. పుష్కరాల ప్రారంభానికి వారం రోజుల ముందువరకు భారీ వర్షాలు కురియలేదు. గోదావరి నదిలో నీరు లేక బోసిపోయింది. పుష్కర స్నానాలకు ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు కనిపించాయి. అయితే నాలుగురోజులు ముందుగా రెండు రోజులు భారీ వర్షాలు పడటంతో ఒక్కసారిగా గోదావరి నది జలకళను సంతరించుకుంది. పుష్కర స్నానాలకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడలేదు. ఈ సారి కూడా పుష్కరాలు ప్రారంభమయ్యేనాటికి గోదావరి నదిలో పుష్కలంగా నీరు వచ్చి చేరుతుందని భక్తులు భావిస్తున్నారు.