(29 Jun) పండుగలను అత్యుత్సాహంగా జరుపుకోవడం హైదరాబాద్ ప్రత్యేకత. హైదరాబాద్ నగర నిర్మాత, తెలుగు ఉర్దూ భాషల్లో కవి, మహారాజు కులీ కుతుబ్ షా ప...
(29 Jun) పండుగలను అత్యుత్సాహంగా జరుపుకోవడం హైదరాబాద్ ప్రత్యేకత. హైదరాబాద్ నగర నిర్మాత, తెలుగు ఉర్దూ భాషల్లో కవి, మహారాజు కులీ కుతుబ్ షా ప్రేమకథ హైదరాబాద్‌లో గంగా జమునా తెహజీబ్‌కు పునాదులు వేసింది. హిందువులైనా, ముస్లిములైనా ఇక్కడ అందరూ హైదరాబాదీలే. హిందువుల సంక్రాంతి, దసరా పండుగలైనా, ముస్లిముల ఈద్ పండుగైనా అత్యుత్సాహంగా జరుపుకోవడం మన హైదరాబాద్ ప్రత్యేకత. ముఖ్యంగా రంజాన్ మాసంలో ఈ సంసృ్కతి మరింత స్పష్టంగా కనబడుతుంది. హైదరాబాద్ పాతనగరం కిటకిటలాడిపోతుంది. రాత్రుళ్లు లైట్ల కాంతిలో మెరిసిపోతాయి. నగరం నిద్ర మరిచిపోతుంది. ఒకవైపు మసీదుల నుంచి రంజాన్ ఉపవాసాలకు సంబంధించిన సమయాలను గుర్తుచేసే సైరన్లు, మరోవైపు పండుగ షాపింగ్‌ల సందడి హైదరాబాద్ అంతటా పెద్ద పండగ వాతావరణమే. చార్మినార్ వద్ద రంజాన్ నెల పొడవునా షాపింగ్ చేసేవారిలో హిందూ ముస్లిములన్న తేడా ఉండదు. అందరూ ఎంతో ఉత్సాహంగా మార్కెట్లకు వస్తుంటారు. రంజాన్ ప్రారంభంతోనే వాతావరణంలో ఈ మార్పు కనబడుతుంది. ఒకవైపు నమాజు చేసేవారితో మసీదులు కిటకిటలాడుతుంటాయి. రాత్రుల ప్రత్యేక ప్రార్థనలు, తరావీ నమాజులు కొనసాగుతుంటాయి. మరోవైపు చార్మినార్ వద్ద బజారులు కిక్కిరిసిపోతుంటాయి. రంజాన్ మాసం చివరి రోజుల్లో అయితే చార్మినార్ వద్ద నడవడానికి కూడా చోటుండనంత జనసమ్మర్ధం. వారిలో అన్ని వర్గాల ప్రజలూ కనబడతారు. నిజానికి చార్మినార్ వద్ద రంజాన్ మాసంలో రాత్రి పగలు అనే తేడా కూడా కనబడదు. మూసీ నది దాటి పాతనగరంలోకి ప్రవేశించగానే రుచికరమైన రంజాన్ ప్రత్యేక వంటకం హలీమ్ గుబాళింపు పలకరిస్తుంది. మదీనా జంక్షన్, హైకోర్టు రోడ్డులోని వివిధ హోటళ్ళలో ఈ నెలలో హలీమ్ అమ్మకాలు ప్రత్యేక ఆకర్షణ.హైదరాబాద్‌లో రంజాన్ గురించి మాట్లాడుతున్నామంటే హలీమ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిందే. అరబ్బులకు చెందిన ఈ వంటకం ఇరాన్, ఆఫ్ఘనిస్థాన్ల నుంచి మన దేశానికి వచ్చిందంటారు. నేడు హైదరాబాదీ హలీమ్ ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. నిజామ్ కాలంలో హైదరాబాద్‌కు వచ్చిన హలీమ్ స్ధానిక రుచులకు అనుగుణంగా సుగంధద్రవ్యాలతో కొత్త రుచిని సంతరించుకుంది. పద్నాలుగు, పదిహేను గంటల ఉపవాసం తర్వాత తక్షణం శక్తినిచ్చే ఆహారంగా దీన్ని చాలామంది ఇష్టపడతారు. ఇండియన్ జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజీస్ట్రీ ఆఫీసు 2010లో హైదరాబాదీ హలీమ్‌కు జియోగ్రాఫికల్ ఇండికేషన్ స్టేటస్ ఇచ్చింది. హలీమ్ వండాలంటే 12 గంటల సుదీర్ఘ సమయం పడుతుంది. హోటళ్ళలో తెల్లవారుజాము నుంచే దీని వండటం మొదలు పెడతారు. సాయంత్రానికి సిద్ధమవుతుంది. మాంసం, గోధుమలు, డ్రై ఫ్రూట్స్ వగైరాలతో హలీమ్ తయారుచేస్తారు. పూర్తి వెజిటేరియన్ హలీమ్ కూడా ఈ మధ్య తయారవుతోంది. మదీనా, చార్మినార్ రోడ్డు మామూలు రోజుల్లోనే చాలా ట్రాఫిక్‌గా ఉంటుంది. ఇక రంజాన్ మాసంలో ట్రాఫిక్ పదిరెట్లు పెరుగుతుంది. అందువల్లే రంజాన్ చివరి రోజుల్లో షాపింగ్ రద్దీ దృష్ట్యా ఇక్కడ వాహనాల రాకపోకలను నిలిపివేస్తారు. అప్పుడు చార్మినార్‌లో షాపింగ్‌కు వెళ్ళాలంటే కేవలం నడిచి వెళ్ళవలసిందే. కాస్త దూరాన, సాలార్జంగ్ మ్యూజియం వద్ద, లేదా పురానీ హవేలీ వద్ద వాహనాలు పార్కింగ్ చేసుకుని నడిచి వెళ్ళక తప్పదు. చార్మినార్ రోడ్డు పొడవునా దుకాణాలు, రోడ్డుపై తాత్కాలిక షాపులు, తోపుడు బళ్ళు, దుస్తులు మొదలు హెయిర్ పిన్నుల వరకు అన్నీ దొరుకుతాయి. మదీనా, పత్తర్‌గట్టీ, పటేల్ మార్కెట్, గుల్జార్ హౌస్, లాడ్ బజార్ ఎక్కడ చూసినా జనసందోహమే. వస్త్రాలు, రెడీమేడ్ దుస్తులు, చెప్పులు, గాజులు, కర్టెన్లు, క్రాకరీ, కట్లరీ, ముత్యాలు, అత్తర్లు, ఆభరణాలు ఒక్కటేమిటి? షాపింగ్‌లతో చార్మినారే ధగధగలాడిపోతుంది. చార్మినార్ వద్ద నైట్ బజారు ఏర్పాటు చేయాలని అధికారులు ఆలోచిస్తున్నారో లేదో తెలియదు కానీ, రంజాన్‌లో చార్మినార్ నైట్ బజారుగా మారిపోతుంది. షాపింగ్‌కు వచ్చేవారిలో ముస్లిములు, హిందువులు, టూరిస్టులు అందరూ ఉంటారు. చిరునవ్వులతో పలకరించే దుకాణదారులు. రండి.చూడండి.. చూడ్డానికి డబ్బులక్కరలేదు.. చూడ్డం ఉచితమే అంటూ ఉత్సాహంగా, హాస్యమాడుతూ మాట్లాడతారు. పాతబస్తీలోని ఈ ప్రత్యేకమైన సెన్సాఫ్ హ్యుమర్ కొత్తవారిని సరికొత్త ప్రపంచంలోకి తీసుకుపోతుంది. చార్మినార్ షాపింగ్‌లో ఎక్కువగా మహిళలే కనబడతారు. ఉపవాసం పాటిస్తున్న మహిళలు, ఇఫ్తార్ సమయం అంటే (ఉపవాస విరమణ సమయం) సమీపించగానే షాపింగ్ కాసేపు ఆపేసి ఉపవాస విరమణకు బ్రేక్ తీసుకుంటారు. కొన్ని షాపుల్లో ఇఫ్తార్‌కు ఏర్పాట్లు కూడా చేస్తారు. కొందరు ఉపవాస విరమణకు మక్కామసీదు చేరుకుంటారు. మక్కా మసీదు ఆవరణలో ఉపవాస విరమణ కోసం ఏర్పాట్లు ఉంటాయి. రంజాన్ ప్రత్యేక వంటకాల్లో హలీమ్ తర్వాత చెప్పుకోదగ్గది దహీ వడా లేదా పెరుగు వడలు. ఉపవాస విరమణలో హలీమ్ లేదా దహీవడతో తిరిగి శక్తిపుంజుకుని, నమాజులు ముగించిన వెంటనే మళ్ళీ షాపింగ్ కొనసాగుతుంది. ధరలు ఎంత ఆకాశంలో ఎగురుతున్నప్పటికీ రంజాన్ మాసంలో అమ్మకాలు తగ్గవు. కొనుగోలు దారులు వెనుకంజవేయరు. రంజాన్ మాసంలో జరిగినంత అమ్మకాలు సంవత్సరంలో మరెప్పుడు జరగవు. నగరంలో ఈ మధ్యకాలంలో అనేక షాపింగ్ మాల్స్ వచ్చినా హైదరాబాద్‌కు ప్రత్యేకమైన చార్మినార్ షాపింగ్ ఆకర్షణ తగ్గలేదు. రంజాన్ మాసంలో చార్మినార్ వద్ద షాపింగ్ కోసం హైదరాబాద్ వాసులే కాదు, పక్క జిల్లాల ప్రజలు, మహారాష్ర్ట, కర్నాటక వంటి పొరుగు రాష్ట్రాల వారు కూడా వస్తుంటారు. ఈద్ సందర్భంగా ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్కరు కొత్త దుస్తులు, పాదరక్షలు, గాజులు వగైరా తప్పనిసరిగా కొంటారు. సంపన్నులు పేదలకు జకాత్, ఫిత్రాలు చెల్లిస్తారు, కాబట్టి ఆర్థికంగా స్థోమత లేనివారికి కూడా షాపింగ్ చేసే వెసులుబాటు లభిస్తుంది. రంజాన్ సందర్భంగా హైదరాబాద్ రోడ్లపై కనబడే మరో ప్రత్యేకత ఖర్జూరం అమ్మే తోపుడు బండ్లు. ఉపవాస విరమణకు ఖర్జూరం ఉపయోగిస్తారు. అలాగే, ఈ నెలలో పండ్లు, ఫలాల మార్కెట్లు కూడా కళకళలాడతాయి. ప్రతి ఇఫ్తార్ వద్ద పండ్లు ఫలాలు కనబడతాయి. రంజాన్ సందర్భంగా షాపింగ్ యావత్తు అవ్యవస్థీకృత రంగంలో జరిగే చిన్న వ్యాపారుల ద్వారానే జరుగుతుంటుంది. దాదాపు 2,000 కోట్ల రూపాయల వరకు ఈ నెలలో బిజినెస్ జరుగుతుందని కొన్ని సంవత్సరాల క్రితం అంచనా వేశారు. నేడు ఈ బిజినెస్ ఇంకా చాలా ఎక్కువ ఉండవచ్చు.