దళారీలతో అధికారుల కుమ్మక్కు పట్టించుకోని ఉన్నతాధికారులు నేడు జిల్లాకు రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి రాక ఆర్టిఎ కార్యాలయం...
- దళారీలతో అధికారుల కుమ్మక్కు
- పట్టించుకోని ఉన్నతాధికారులు
- నేడు జిల్లాకు రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి రాక
ఆర్టిఎ కార్యాలయంలో అవినీతి పెరిగింది! అధికారులున్నా, అన్లైన్ సేవలున్నా దళారీ వ్యవస్థ హవానే కొనసాగుతోంది! వారు చెప్పిందే వేదం, చేసిందే చట్టంగా మారింది! ఒక్కో పనికి ఒక్కో రేటు నిర్ణయించింది! అర్హత లేకున్నా సరే వీరిని ఆశ్రయిస్తే చాలు వెంటనే పని పూర్తవుతోంది! కాదు, కూడదని ముందుకెళ్తే రోజుల్లో కావాల్సిన మీ పని వారాలు, నెలలు గడిచినా అలాగే ఉంటోంది! అడిగితే అధికారి స్పందనా కరువవుతోంది!
వరంగల్ : రవాణా శాఖ (ఆర్టిఎ)లో అవినీతి పెచ్చరిల్లిపోతోంది. ఇక్కడ మాముళ్ళులేనిదే ఏ పనికావడంలేదు. అధికారికంగా మధ్య దళారీ వ్యవస్థను రద్దు చేసినప్పటికీ యధేచ్ఛగా కొనసాగుతోంది. ప్రతీపనికి రేటు చొప్పున చెల్లించాల్సిందే. లేకుంటే కావాల్సిన పని నిలిచిపోతోంది. ఇదీ వరంగల్ ఆర్టిఎలో నిత్యం సాగుతున్న దందా. రిజిస్ట్రేషన్, వాహనాల ఫిట్నెస్, పన్ను చెల్లింపుల నుంచి అన్నింటికి కొంత మొత్తంలో చెల్లించాల్సి వస్తుందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక డ్రైవింగ్ లైసెన్సుల విషయంలో పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంటుంది. లెర్నింగ్, పర్మినెంట్, హెవీ లైసెన్సుల వరకు చేతులు తడపనిదే పనికాని పరిస్థితి నెలకొంది. పేరుకు ఆన్లైన్ సేవలున్నప్పటికీ మధ్య దళారీల పాత్ర లేకుండా అధికారులు స్పందించే పరిస్థితేలేదు. రొక్కం ముడితేనే పని మరో అడుగు కదులుతుంది. ఎవరైనా అమాయకంగా ఆన్లైన్కదా? అని భావిస్తే రోజుల తరబడి వేచిచూడాల్సిందే.
ప్రతి పనికీ ఓ రేటు
* లైసెన్స్‌కు శాఖకు చెల్లించాల్సినవిపోగా అదనంగా రూ.1500, టాక్సీ వాహనాల ఫిట్‌నెస్‌కు రూ.1000 నుంచి 3వేల వరకు చేతులు తడపాల్సిందే. ఇక కౌంటర్లలో రూ.100 నుంచి 200 చెల్లించక తప్పదు. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌కు రూ.500ల నుంచి రూ.3వేలు తీసుకుంటున్నారు. కొందరు ఎంవిఐలకు ప్రత్యేక దళారీలున్నారంటే అవినీతి ఏ రకంగా ఉందో చెప్పకనే అర్థం చేసుకోవచ్చు. ఇలా వచ్చిన సొమ్ములో అధికారులందరికీ వాటాలున్నట్లు సమాచారం.
అక్రమ రిజిస్ట్రేషన్లు
* రోజువారీ పనుల్లో అక్రమార్జనకు తోడు కొందరు అవినీతి అధికారులు అక్రమ రిజిస్ట్రేషన్లకు అండదం డలందిస్తున్నారు. వాహనాలకు తప్పుడు ఫైనాన్స్ క్లియ రెన్స్లివ్వడంలో ఆరితేరినట్లు ఇటీవల వెలుగు చూసిన సంఘటనతో తేలింది. ఈ విషయాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేశారు. పాత్రదారులెవరనేదానిపై విచారణ సాగుతోంది.
వినియోగదారులకు తప్పని కష్టాలు
* ఆర్టిఎ కార్యాలయంలో తరుచూ స్టేషనరీ కొరత ఏర్పడుతోంది. అన్నింటినీ అధిగమించి తీరా లైసె న్సులు, రిజిస్ట్రేషన్లు చేతికొస్తాయనుకునే సమ యంలో స్టేషనరీ లేదంటూ చేతులెత్తేస్తున్నారు. ఏ శాఖకు లేనంత ఆదాయం ఉన్నప్పటికీ వినియోగదారులకు సకాలంలో సేవలందించడంలో నిర్లక్షం చేస్తున్నారు. సాధారణ స్థాయి అధికారుల నుంచి సిబ్బంది వరకు చేయితడపనిదే పని ముందుకు సాగడంలేదు. ఇక దళారీల పాత్ర విపరీతంగా పెరిగిపోయింది. దళా రీలకు అధికారులకు మధ్య సత్సంబంధా లుండడంతో ఈ వ్యవహారం లక్షల్లో సాగుతోంది. కార్యాలయంలో వీరి హవా సాగుతున్న విషయం ఉన్నతాధికారులకు తెలిసినా కనీసం స్పందించడం లేదు. అసలు వినియోగదారులు, వాహన దారులకంటే వీరి ఆధిపత్యమే కనిపిస్తుందనడంలో ఆశ్చర్యమేమీ లేదు.
మొక్కుబడిగా దాడులు
* విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే ప్రైవేటు విద్యాసంస్థలపై మొక్కుబడి దాడులు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారు. ఏదైనా ప్రమాదం సంభవించిన సందర్భాల్లో హడావుడి చేస్తున్నారు. వాహనాల ఫిట్నెస్, అనుభవజులైన డ్రైవర్లు, ఇతరత్రా అంశాలను పట్టించుకోకుండా తూతూ మంత్రంగా కేసులు నమోదు చేసి, జరిమానాలు వసూలు చేస్తున్నారు. తర్వాత ఈ అంశాలను పట్టించుకోవడ ంలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక చెక్‌పోస్టుల్లో జరిగే తతంగం అంతాఇంతా కాదు. వసూళ్ల కోసమే ఈ వ్యవహారం సాగుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారాలపై మంత్రి మహేందర్‌రెడ్డి దృష్టిపెట్టి ప్రక్షాళన చేయాలని వినయోగదారులు, ప్రజలు కోరుతున్నారు.