-కారుబాంబుతో దాడి.. ఆపై కాల్పులు -ఒక చిన్నారి, మహిళ మృతి.. 31మందికి గాయాలు -ఆరుగురు సాయుధులను మట్టుబెట్టిన భద్రతాదళాలు -ఎంపీలు సు...
-కారుబాంబుతో దాడి.. ఆపై కాల్పులు
-ఒక చిన్నారి, మహిళ మృతి.. 31మందికి గాయాలు
-ఆరుగురు సాయుధులను మట్టుబెట్టిన భద్రతాదళాలు
-ఎంపీలు సురక్షితం: ఆఫ్ఘన్ హోం మంత్రిత్వ శాఖ
-దాడికి పాల్పడింది తామేనని తాలిబన్ ప్రకటన
-దాడిని ఖండించిన ప్రధాని నరేంద్రమోదీ
కాబుల్, జూన్ 22: ఆఫ్ఘనిస్థాన్ నెత్తురోడింది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఉగ్రవాదులు ఆ దేశ పార్లమెంట్‌పై దాడికి తెగబడ్డారు. తుపాకులు, బాంబులతో సోమవారం పార్లమెంట్ ఆవరణలోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. తక్షణమే స్పందించిన ఆఫ్ఘన్ భద్రతాదళాలు ఎదురుకాల్పులు జరుపుతూ వారిని మట్టుబెట్టాయి. ఈ ఘటనలో ఏడుగురు ఉగ్రవాదులు.. ఒక చిన్నారి, మహిళ మృతిచెందారు. 31మంది పౌరులు గాయపడ్డారు. ఉగ్రదాడి జరుగుతున్న సమయంలోనే పార్లమెంట్‌లోని ఎంపీలందరినీ సురక్షితంగా తరలించినట్లు ఆఫ్ఘన్ హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దాడికి పాల్పడింది తామేనని తాలిబన్ ప్రకటించుకుంది. ఆఫ్ఘన్ పార్లమెంట్‌పై దాడిని ప్రధాని నరేంద్రమోదీ తీవ్రంగా ఖండించారు.
కొద్దిరోజుల క్రితం ఆఫ్ఘన్ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగా, సోమవారం కొత్త రక్షణమంత్రి మాసూమ్ స్తానెక్జాయ్ని ఎంపీలకు పరిచయం చేస్తున్నారు. ఇంతలో ఒక్కసారిగా బాంబులతో నిండి ఉన్న ఓ కారు వేగంగా వచ్చి పార్లమెంట్ ఉన్న దారుల్ అమాన్‌లో రోడ్డుపై పేలిపోయింది. ఆ పేలుడు తీవ్రతకు పార్లమెంట్ భవనంతోపాటు సమీపంలోనున్న భవనాలు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. బాంబు పేలుడుతో సభలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఎంపీలందరూ తలో దిక్కుకు పరుగులు తీశారు. ఆ తర్వాత కొద్ది నిమిషాలకే సాయుధులైన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ పార్లమెంట్ ఆవరణలోకి ప్రవేశించారు. బాంబులు విసురుతూ, రాకెట్ దాడులు చేస్తూ.. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న చాంబర్ సమీపానికి ఉగ్రవాదులు వెళ్లగలిగారు. అప్పటికే అప్రమత్తమైన భద్రతా దళాలు ఎదురుదాడికి దిగాయి. ఉగ్రవాదులను నిలువరిస్తూనే పార్లమెంట్ సమావేశమందిరం నుంచి ఎంపీలు, జర్నలిస్టులను సురక్షితంగా తరలించాయి. రెండు గంటలపాటు జరిగిన ఈ కాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులను హతమార్చినట్లు హోం మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి సెదిఖ్, సెదిఖి ట్వీట్ చేశారు. బాంబు దాడులతో పార్లమెంట్ భవనం మొత్తం పొగ ఆవరించింది. ఈ భీతావహ దృశ్యాలన్నీ సీసీటీవీ కెమరాల్లో రికార్డు అయ్యాయి. కారులో బాంబులను నింపుకుని వచ్చి పేల్చుకున్న ఉగ్రవాది అక్కడికక్కడే మృతిచెందగా.. ఈ ఘటనలో ఓ చిన్నారి, మహిళ మృతిచెందారు. మరో 31మంది గాయపడ్డారు.
దాడికి పాల్పడింది మేమే: తాలిబన్
ఘటన తర్వాత కొద్దిసేపటికే తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ స్పందించారు. దాడికి పాల్పడింది తామేనని ప్రకటించారు. కాగా, దాడి జరిగిన పార్లమెంట్ భవనానికి సమీపంలోనే కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనంలో భారతీయ కూలీలు పనిచేస్తున్నారు. వారంతా సురక్షితంగానే ఉన్నారని భారత రాయబార వర్గాలు తెలిపాయి.
దాడిని ఖండిస్తున్నాం: ప్రధాని మోదీ
ఆఫ్ఘన్ పార్లమెంట్‌పై దాడిని ప్రధాని నరేంద్రమోదీ తీవ్రంగా ఖండించారు. దీనిని పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఆఫ్ఘన్‌కు అన్నివిధాల సహకరిస్తామని హామీ ఇస్తూ ట్వీట్ చేశారు. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తానని మరో ట్వీట్ చేశారు.