(29 Jun) వారం రోజుల పాటు బ్యాంకుల మూసివేత గ్రీస్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుంది. దీంతో వారం రోజుల పాటు దేశ వ్యాప్తంగా ఉన్న జాతీయ బ...
(29 Jun) వారం రోజుల పాటు బ్యాంకుల మూసివేత గ్రీస్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుంది. దీంతో వారం రోజుల పాటు దేశ వ్యాప్తంగా ఉన్న జాతీయ బ్యాంకులను మూసివేస్తూ ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫలితంగా బ్యాంకు ఖాతాదారులు ఏటీఎం సెంటర్ల వద్ద బారులు తీరారు. కొన్ని ఏటీఎంల వద్ద కిలోమీటర్ల కొద్దీ లైన్లు పెరిగిపోయినట్టు సమాచారం. గ్రీస్ ఆర్థిక సంక్షోభ ప్రభావం ఆసియా మార్కెట్లపై పడింది. జపాన్, సియోల్, హంకాంగ్ మార్కెట్లు నష్టాలు నమోదు చేశాయి. అత్యవసర నిధుల విడుదలను పొడిగించేది లేదని యురోపియన్ సెంట్రల్ బ్యాంక్ తేల్చి చెప్పడంతో ప్రభుత్వం జాతీయ బ్యాంకులను మూసివేసింది. ఆర్థిక సంక్షోభంపై అత్యవసర సమావేశం అయిన కేంద్ర కేబినెట్ బ్యాంక్ మూసివేతపై నిర్ణయం తీసుకుంది. జులై 7వ తేదీ వరకు బ్యాంకులను మూసివేయనున్నారు. అంతేకాదు ప్రతి రోజు డ్రా చేయాల్సిన మొత్తాన్ని కూడా 60 డాలర్లకు కుదించారు. గత శనివారం ఉద్దీపన ప్యాకేజీపై యూరో జోన్ దేశాల మధ్య జరిగిన చర్చలు ఎటువంటి ఒప్పందం లేకుండా ముగిసాయి. దాంతో జులై 5వ తేదీ గ్రీస్ ప్రభుత్వం ఉద్దీపన ప్యాకేజీపై రిఫరెండం నిర్వహించాలని నిర్ణయించింది. మరోవైపు.. భారీ అప్పుల్లో కూరుకుపోయిన గ్రీస్ బయటపడే దారిలేక, ఖర్చులకు నిధుల్లేకనే బ్యాంకుల మూసివేత నిర్ణయంతీసుకుంది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన ప్రజలు ఒక్కసారిగా ఏటీఎంల వద్దకు నగదు తీసుకునే నిమిత్తం భారీ సంఖ్యలో చేరిపోయారు. ఏటీఎంల్లో డబ్బు నిండుకోనుందన్న సమాచారంతో, స్పందించిన ప్రభుత్వం రోజుకు ఒక్కో ఖాతాలో 60 డాలర్లకు మించి నగదు విత్ డ్రా చేసుకోరాదని ఆంక్షలు విధించింది. కోపోద్రిక్తులైన ప్రజలు నిరసనలు తెలుపుతున్నారు.