సిటీబ్యూరో : కువైట్లోని ప్రార్ధనా మందిరంలో శుక్రవారం బాంబు పేలుళ్ల నేపథ్యంలో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. ముస్లింలకు చెందిన రెండు వర్గాల...
కువైట్లో ఓ వర్గం ప్రార్ధనా మందిరాలపై బాంబు దాడులు జరగడంతో ఇక్కడి ఆ వర్గం వారు ఆవేశాలకు లోనుకాకుండా చూడాలని వారిని పోలీసులు కోరినట్లు సమాచారం. ముందుజాగ్రత్త చర్యగా శుక్రవారం రాత్రి వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. అవసరమైతే అదనపు బలగాలను కూడా రంగంలోకి దింపే ఆలోచనలో ఉన్నతాధికారులు ఉన్నారు. దక్షిణ మండల డీసీపీ సత్యనారాయణతో సిటీ పోలీసు కమిషనర్ ఎం.మహేందర్రెడ్డి మాట్లాడారు.
ఈ సందర్భంగా బందోబస్తుపై ఆరా తీశారు. గతంలో పాతబస్తీలో ఒక మతంలోని రెండు వర్గాలు పరస్పర దాడులకు జరిగిన ఘటనలను గుర్తు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అప్పట్లో దాడులకు పాల్పడిన వారిపై నిఘా పెంచారు. మరోపక్క రంజాన్ ఉపవాసాల నేపథ్యంలో పోలీసులు పాతబస్తీపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా ప్రార్ధనా మందిరాల వద్ద ప్రత్యేక పోలీసు బలగాలతో పికెట్లను ఏర్పాటు చేశారు.